నేను ఈ వారంలో ఒక పెళ్ళికి వెళ్ళాను. ఉరమరగా ఓ ముగ్గురు, నలుగురు అమ్మాయిలు, అబ్బాయిల పెళ్ళి కష్టాల కథలు విన్నాను. ఒక అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. ఒకరికొకరు నచ్చారు, తాంబూలాలు ఇచ్చుకున్నారు, పెళ్ళికి ఆరునెలల సమయం వచ్చింది. ఈ సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక పెళ్ళికి ఒక నెల సమయం ఉంది అనగా, అబ్బాయి ఈ పెళ్ళి చేసుకోను అన్నాడట. ఎందుకు అంటే, ఇంతకు ముందే తనకు ఒక అమ్మాయితో ప్రేమ ఉందిట. బ్రేకప్ అయిందిట. ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే తను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఉన్నంత అనుబంధం లేదుట. తమ మధ్య పెద్దగా కెమిస్ట్రీ లేదు అంటూ ఈ పెళ్ళి వద్దు అని చెప్పాడట.
ఇప్పుడు ఇంకో అమ్మాయి కథ. ఆమె మంచి ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో తెచ్చిన సంబంధం ఒప్పుకుంది. వాళ్ళకి కూడా ఆరేడు నెలల సమయం ఉంది పెళ్ళికి. ఈలోపు అబ్బాయి అమ్మాయి చేత నిక్షేపంలా ఖర్చు పెట్టిస్తున్నాడు. తనకి ఏదో మంచి వాచ్ కావాలని అడగగానే ఈ అమ్మాయి కొనిపెట్టిందిట బహుమతిగా. తరువాత Branded Shoes. మనం పెళ్ళయ్యాకా ఎలాగో కార్ కొనాలి కదా, అది ఇప్పుడే కొందాం అని చెప్పి Loan ఆ అమ్మాయి పేర తీసుకున్నాడట, కానీ కార్ తన పేరు మీద కొన్నాడట. ఇక ఆఖరికి ఇల్లు కొందాం Down Payment నువ్వు ఇవ్వు EMIలు నేను కడతా అంటూ, ఒక 60% డబ్బులు ఆమెని కట్టేయమన్నప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చి enquiry చేస్తే, ఇదివరకూ ఇలాగే ఇంకో సంబంధం దగ్గర డబ్బులు లాగాడు అని తెలిసి పెళ్ళి మానేశారు.
ఇంకో అబ్బాయి కథ ఎలా ఉందంటే.. అతనిది చిన్న ఉద్యోగం. అందుకని వేరే part time job కూడా చేస్తాడు. అంతా కలిపి సంవత్సరానికి 5లక్షలు వస్తాయి. ఇంట్లో వాళ్ళు 6.50 అని చెప్పి profileలో రాశారు. ఆ విషయం ఆ అబ్బాయికి తెలియదు. మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు ముందుగా ఒకరినొకరు అర్ధం చేసుకుని, అప్పుడు ముందుకెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. చక్కగా మాట్లాడుకుంటున్నారు. అభిప్రాయలు బాగా కలిశాయి. ఈ సంబంధం ముందుకి వెళ్తుంది అని నమ్మకం కలిగింది. ఈలోపు ఈ జీతం తేడా గురించి అతనికి తెలిసింది. కొన్నాళ్ళు చెప్పలేదు. ఇక మనసు ఊరుకోక చెప్పేశాడు. ఆ అమ్మాయికి ఇలా అబద్ధం ఆడడం నచ్చలేదు. అయితే అతని తప్పూ తక్కువే అని తెలుసు. అందుకే సున్నితంగా, నొప్పించకుండా మనం ముందుకు వెళ్ళద్దు అని అక్కడితో full stop పెట్టింది.
ఇవన్నీ వింటే చాలామంది పెద్దాళ్ళకి కోపం వస్తుంది. అందుకే మాట్లాడుకోవడాలు, కలిసి తిరగడాలు వద్దు అని మా తరం చెప్పేది, మొదట్లోనే మోసం వస్తుంది అలా చేస్తే అంటారు. అన్నారు కూడా. నేను విన్నాను. కానీ ఇలాంటి process అంతా జరిగి, చివరికి పెళ్ళి జరగడంలో చాలా మంచి ఉంది అని నా నమ్మకం. నిజమే పైన చెప్పిన ముగ్గురూ ఈ సంఘటనల వల్ల బాధ పడుతున్నారు. వారి overall మానసిక పరిస్థితిపై ఇది ప్రభావం చూపుతోంది నేను కాదనను. కానీ నా దృష్టిలో Divorce is more painful and stressful than a breakup.
చాలాసార్లు మనకి వచ్చే పెళ్ళి సంబంధాల్లో చాలా serious red flags అత్యంత స్పష్టంగా కనిపిస్తుంటాయి. నూటికి తొంభైశాతం వాటిని కొట్టిపారేసి, గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతారు. పెళ్ళైపోయాకా అవి జీవితాలు నాశనం చేయగల సత్తా ఉన్న లక్షణాలు అని అర్ధం అవుతుంది. అప్పుడు చేతులు కాలాకా, ఆకులు పట్టుకుంటారు. ఇలా జరిగిన పెళ్ళిళ్ళు నాకు తెలిసి బోలెడు. చేయి చాచి, ఇదంతా మాదేనండి అని చెప్పి, వాటి వివరాలు అడిగితే కసురుకున్న ఒకానొక పెళ్ళివారిని వెనెకేసుకువచ్చిన తండ్రి, పెళ్ళయ్యాకా తమ పిల్ల జీతం కోసం మాత్రమే ఈ పెళ్ళి చేసుకున్నారని తెలిసి, పెళ్ళి రద్దు చేసుకోవడానికి నానా తిప్పలు పడడం నా కళ్ళారా చూశాను.
మా ఇంట్లో ఆడాళ్ళు వంటింటి గుమ్మం దాటి బయటకు రారండి అన్న పదాన్ని గొప్ప సంప్రదాయమున్న కుటుంబపు మాటలుగా భావించి పెళ్ళి చేసి, పిల్ల నలుగురిలో అడుగుపెడితే ఎవరో ఒకరితో అంటగట్టే కుటుంబం అని తెలిసి, పిల్లని వెనక్కి తెచ్చుకోవడానికి మూడు చెరువుల నీళ్ళు తాగిన ఆడపిల్లవారు తెలుసు. F2 సినిమాలో హీరోయిన్ల తండ్రిలా ‘అంతేగా.. అంతేగా’ అనే డైలాగ్ తప్ప ఇంకేమైనా అంటే ఉరిమి చూసే తల్లిని చూసి కూడా కట్నం ఇస్తున్నారు, ఒకత్తే కూతురు, ఆస్తి అంతా మనకే అనుకుంటూ ఆనందంగా పెళ్ళి చేసి, ఇప్పుడు కొడుకుతో మాట్లాడటానికి కూడా కోడలు అనుమతి ఇవ్వడం లేదు అని బావురుమనే పిల్లాడి తల్లిదండ్రులను కూడా చూశాను.
సరే ఇవన్నీ పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు. పిల్లది, పిల్లాడిది చాలా తక్కువ పాత్ర పెళ్ళి కుదరడంలో సామాన్యంగా. కానీ, అబ్బాయి - అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడి, దశాబ్ధాల తరబడి relationshipలో ఉండి, అన్ని రకాల ఎత్తుపల్లాలను చూసి కూడా, ఒక ఇంట్లో ఉండాల్సి వచ్చేటప్పటికి పూర్తి కొత్తవారిగా తమ ప్రేయసి, ప్రియులు కనపడ్డవారిని కూడా నేను చూశాను. కాబట్టీ, పెళ్ళి చేసుకోవడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. నిజానికి చాలా చిన్న వయసు నుండే ఈ విషయంలో అవగాహన కల్పించడం మన వివాహ వ్యవస్థను పటిష్ట పరుచుకోవడానికి ఒక మార్గమేమో అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తే.
ఒక భాగస్వామిని ఎంచుకోవడం అనేది సగం అదృష్టం, సగం మన అంచనా శక్తిపై ఆధారపడి ఉంటుంది అన్నది ముమ్మాటికీ నిజం. ఈ రెండిటిలో ఏది తక్కువగా ఉన్నా ఆ పెళ్ళిలో తృప్తి కొరవడుతుంది, మనశ్శాంతి తగ్గుతుంది. ఎన్నో సంబంధాలు చూసిన వ్యక్తిగా, పెళ్ళైన అమ్మాయిగా నేను యువతరానికి చెప్పాలనుకునే ఒక మాట ఏమిటంటే, ఏ relationshipలోనూ పూర్తిగా Emotional investment చేయకుండా, కాస్తైనా practicalగా ఉండడం అవసరం. పెళ్ళి కుదిరిన తరువాత కూడా వారిలో ఉండే red flagsను కనిపెట్టుకుని, అవసరమైతే, వారితో పొసగడం కుదరదు అనిపిస్తే ఆ బంధం అక్కడితో ముగించడం మంచి పని.
Engagement అయిపోయింది కదా, చుట్టాలు ఏమనుకుంటారు? పెళ్ళయ్యాకా మార్చుకోవచ్చులే. ఇన్నేళ్ళు relationship లో ఉన్నాం, ఇప్పుడు విడిపోతే స్నేహితులు ఏమనుకుంటారు? అమ్మానాన్నలను కూడా ఒప్పించేశాం ఏదో ఒకటిలే సర్దుకుపోదాం. ఇలా అనుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటే తరువాత భరించలేక, విడిపోదాం అంటే మాత్రం చాలా కష్టమైన process అది. Breakup కన్నా మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందికరమైన process అది. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత కాదన్నా జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. మన కుటుంబం, వ్యక్తిగత ఆనందం దీనిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టీ, ఏదో ఒకటిలే అనుకోవడం మాత్రం ప్రమాదకరం.
అసలు మొత్తంగా ఈ న్యూస్ లెటర్ అంతా ఇదే విషయంపై ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈసారి విడుదలయ్యే నవల పేరు ‘అవంతీ కళ్యాణం’. ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు శ్రీమతి లలితారామ్ గారు రాసిన నవల ఇది. యువతరం, పెళ్ళి అనే అంశాల చుట్టూ తిరిగే కథ కాబట్టీ, ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పాలనిపించింది. ప్రవాసాంధ్రులైన అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే కథ ఇది. ఇందులో పెళ్ళి గురించే కాకుండా, ప్రవాసాంధ్రుల జీవనం గురించి, ఇప్పుడు అక్కడ ఉండేవారు తమ సంస్కృతిని ఎలా కాపాడుకోవచ్చు వంటి విషయాలు కూడా ఈ నవలలో కనపడతాయి. ఈ వారం ఈ నవల విడుదల అవుతోంది. వినేయండి. నవలపైన, నేను రాసిన పై విషయాలపైన మీ అభిప్రాయాలు మాకు చేరవేయండి. ఇంతే సంగతులు. స్వస్తి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.