పిబరే త్యాగరసం…

Meena Yogeshwar
May 6, 2024

సాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు మన ఋషులు. తవ్వే కొద్దీ ఊరే ఊటబావి లాంటిది సాహిత్యం. కేవలం ఒక పదంగా కనపడుతున్నా, దాన్ని ఒక వాక్యంలో పొదిగితే ఎంతో అద్భుతంగా ధ్వనిస్తుంది. ఒక భావానికి రూపు కట్టాలన్నా, ఒక ఆలోచనకు ప్రాణం పోయాలన్నా ఒక్క పదం చాలు కొన్నిసార్లు. ఇక ఆ ఒక్క పదంతో వినేవారి దృష్టికోణంలోనే మార్పు వస్తే అదెంతటి అద్భుతం. అలాంటి అద్భుతం ఒక్కసారి చేస్తేనే కవి జన్మ ధన్యం అయిపోతుంది. రాసిన కీర్తనల్లో అత్యధిక భాగం ఇలా ఒక్క పదంతో కొత్త ప్రాణం పోస్తే ఆయన్ని...

సాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు మన ఋషులు. తవ్వే కొద్దీ ఊరే ఊటబావి లాంటిది సాహిత్యం. కేవలం ఒక పదంగా కనపడుతున్నా, దాన్ని ఒక వాక్యంలో పొదిగితే ఎంతో అద్భుతంగా ధ్వనిస్తుంది. ఒక భావానికి రూపు కట్టాలన్నా, ఒక ఆలోచనకు ప్రాణం పోయాలన్నా ఒక్క పదం చాలు కొన్నిసార్లు. ఇక ఆ ఒక్క పదంతో వినేవారి దృష్టికోణంలోనే మార్పు వస్తే అదెంతటి అద్భుతం. అలాంటి అద్భుతం ఒక్కసారి చేస్తేనే కవి జన్మ ధన్యం అయిపోతుంది. రాసిన కీర్తనల్లో అత్యధిక భాగం ఇలా ఒక్క పదంతో కొత్త ప్రాణం పోస్తే ఆయన్ని కవి అనరు, త్యాగరాజు అంటారు.

కేవలం ఒక్క పదంతో కీర్తన నడక మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క వాక్యంతో ఎంతో చెప్పేసిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి ఎన్నో సందర్భాలను ఈ నెల ప్రసంగంలో విజయభాస్కర్ గారు వివరించారు. అయితే పైన చెప్పుకున్నదాంట్లో రెండో దానికి ఉదాహరణగా దాసుకిరణ్ గారు ఒక వాక్యం ఉదహరించారు. అదే, సాధించెనే ఓ మనసా కీర్తనలో ‘వెతగల్గిన తాళుకొమ్మనెనే’ అనే వాక్యం. 

ఆ ఒక్క వాక్యంతో మానవుడైన వాడు సాధనగా నేర్చుకోవాల్సిన లక్షణాన్ని వివరించేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, అలాంటప్పుడు give up చేయడం కాదు, తాళుకోవాలి, తట్టుకోవాలి. This too shall pass అనేది గుర్తుంచుకోవాలని త్యాగరాజు ఒక్క వాక్యంలో చెప్పేశారన్నారు కిరణ్ గారు. నిజమే కదా. ఎన్ని అలా తాళుకుంటే, ఆ సమాధానానికి వస్తారో, దాన్ని అందరికీ చెప్పగలిగారో కదా త్యాగరాజు అనిపించింది.

త్యాగరాజు జీవితంలో పరిణామక్రమాన్ని వివరిస్తూ, అన్ని రకాల భావోద్వేగాలనూ దాటి, ద్వైతాద్వైతాలను దాటి, శాంత రసంలోకి, గుణాతీతుడైన పరమాత్మను దర్శించగల స్థితికి త్యాగరాజు చేరిన క్రమాన్ని వివరించారు భాస్కర్ గారు. దాని కోసం వారు ఘనరాగ పంచరత్న కీర్తనలను ఉదాహరణగా తీసుకున్నారు. స్వామిని పొగడడం దగ్గర మొదలై, ఎందరో మహానుభావుల్ని దర్శించగల స్థితికి చేరుకున్న విధాన్ని ఆయన విశ్లేషించారు. అది నేను వివరించే కన్నా, స్వయంగా వారి నుండి వినే అనుభూతిని మీకివ్వడమే న్యాయం.

అయితే, త్యాగరాజ సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడంలో ప్రీస్కూల్ కన్నా తక్కువ అయిన హోం స్కూల్ లోనే ఇంకా ఉన్న నేను, త్యాగరాజ పరిణామక్రమాన్ని ఆయన కీర్తనల ద్వారా నేను కాస్త దర్శించగలిగాను. ‘నాదుపై పలికేరు నరులు’ అంటూ తన లౌకిక జీవనంలో కలిగిన కష్టాలను రామునికి చెప్పుకోవడం దగ్గర మొదలుపెట్టిన ఆయన, ‘నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగరాదా’ అంటూ అలౌకిక బాధకు ఎదిగాడు. అలా మనసులోనే రామ దర్శనం చేసుకోవడం కోసం, ‘మనసు నిల్ప శక్తి లేకపోతే మధురఘంటవిరుల పూజేమి చేయును’ అంటూ బాహ్య పూజ కన్నా మానసిక సమర్పణ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాడు.

అదే దారిలో ‘కర్మకాండమతాకృష్టులై భవగహనచారులై’ తిరిగే వారిని బుజ్జగిస్తూ ‘మనవాలకించరాదటే మనసా, మర్మమెల్ల దెల్పెదనే’ అన్నాడు. ‘సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగా తెల్పరాదా’ అంటూ మానసిక పూజలో ఎదిగాడు. ‘అన్యాయయము సేయకురా రామా నన్నన్యుడిగా జూడకురా’ అంటూ ఆవేదనాపూరితంగా వేడుకున్నాడు. ‘నమ్మినవారిని మరచేది న్యాయమా రామా’ అంటూ నిష్ఠూరాలాడాడు. నెమ్మదిగా ఆ బాధను రసానందంలోకి మారుస్తూ ‘శ్రీహరి కీర్తనచే దేహాదియింద్రియ సమూహముల మరచి సోహమైనదె చాలు.. ఇంతకన్నానందమేమి ఓ రామ రామ’ అంటూ మురిసిపోయాడు.

‘ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా’ అంటూ ఊగిసలాడాడు. ‘నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా’ అంటూ ప్రశ్నించాడే కానీ, ఆయనకు నిక్కచ్చిగా తెలుసు ‘సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము’ లేదని. ‘తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా’ అంటూ ముక్తాయించాడు. జీవితంలోనూ, భక్తిలోనూ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన ఆఖరికి రామునితో రాజీకి వచ్చేశాడు. అందుకే ‘శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన’ అంటూ నిర్ణయించేశాడు. అలా ఎదుగుతూ వచ్చిన త్యాగరాజు ఆఖరికి హరి-హర-సుర-నర-గగనం- ఇల-తేజస్సు-జలం-భూమి- మృగం-ఖగం-నగం-తరువు- సుగుణం-విగుణం ఇలా అన్నిటిలోనూ ‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసు’కున్నాడాయన.

అన్ని రసాలనూ దాటి ఉత్కృష్టమైన శాంతరసంలోకి పరిణమించి, మోక్షాన్ని పొందిన త్యాగరాజు ఆ దారిని మనకూ చూపించగల గురువు. మనం చేయవలసినదల్లా ఈ నెల మన ప్రసంగం వక్త శ్రీ ఆలమూరు విజయభాస్కర్ గారిలా ఆ దారిని గట్టిగా పట్టుకుని, ఆ అమృతపు బావిని తవ్వుతూ వెళ్ళడమే. ఈ వ్యాసంలో భాస్కర్ గారు చేసిన విశ్లేషణ గురించి నేను వివరించకపోవడం తెలిసి చేసిన పనే. ఎందుకంటే, ఇంతకు ముందే చెప్పినట్టు, నేను చెప్పడం కన్నా, మీరే స్వయంగా వినడం న్యాయం. అతి త్వరలో ఈ ప్రసంగం రికార్డింగ్ యూట్యూబ్ లో విడుదల అవుతుంది. తప్పకుండా వినండి. త్యాగరాజుని మరిన్ని కొత్త కోణాల్లో భాస్కర్ గారి ద్వారా తెలుసుకోండి.

అయితే, విజయభాస్కర్ గారి గురించి నేను చెప్పేది ఒక్క మాటే..

‘ప్రేమముప్పిరిగొను వేళ నామము దలచేవారు రామభక్తుడైన త్యాగరాజ నుతుని నిజదాసులైనవారు ఎందరో మహానుభావులు.. అందరికి వందనములు’

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :