రిపోర్టర్: మీరు ఇన్నేళ్ళు పత్రికారంగంలో, సాహితీరంగంలో ఉంటూ కూడా అతి తక్కువ కథలే రాశారేమిటండీ.
రచయిత: అన్నేళ్ళు పత్రికారంగంలో ఉండబట్టే అన్ని తక్కువ కథలు రాశాను.
రిపోర్టర్: అర్ధం కాలేదు.
రచయిత: ప్రతి మంగళవారం ఒక కాలమ్ రాయాలి అంటే కనీసం శుక్రవారానికి టాపిక్ సిద్ధంగా ఉండాలి. సోమవారం ఉదయం ఆఫీస్ కు వస్తూనే పూర్తి వ్యాసం తయారైపోయి, కంపోజర్ కు పంపేయాలి. అలా దాదాపు 45ఏళ్ళ పాటు రాయాలంటే ఎన్ని కథలు, ఎన్ని కబుర్లు, ఎన్ని విశేషాలు, ఎన్ని అబ్జర్వేషన్లు ఆ కాలమ్ తినేస్తుందో కదా. అందుకే కేవలం కొన్ని కథలు మాత్రమే కథల రూపంలో వచ్చాయి. మిగిలినవన్నీ కాలమ్స్ గా మారిపోయాయి.
ఇది కాలమిస్ట్ ల గురించి మనలో చాలామందిమి పెద్దగా ఆలోచించని అంశం. వారి కాలమ్ లు చదివి నచ్చినవి గుర్తుంచుకుని, ఎక్కనివి వదిలేసి, నచ్చని వాటిని విమర్శించడం వరకే మనం చేసే పని. కానీ, వారి ఈ కోణం మనలో చాలామందికి తెలియదు కూడా. అలా ఎన్నో అందమైన కథలను, వర్ణనలను, తాను చూసిన, విన్న సంగతలను కాలమ్ లకు ధారపోసి, తక్కువ కథల రచయితగా మిగిలిపోయిన ఆ రచయిత మరెవరో కాదు శ్రీరమణ గారు.
తెలుగు సాహిత్యంలో రావాల్సినంత పేరు రాని, వచ్చిన పేరును కూడా లాక్కోవాలని ప్రతీ ఆరునెలలకూ ప్రయత్నించబడిన రచయిత శ్రీరమణ గారు. వారి ప్రతి వాక్యంలోనూ ఏదో ఒక చమక్కు ఉంటుంది. అతి చిన్న వ్యాసంలో కూడా వారి శైలి విశిష్టంగా తెలుస్తూనే ఉంటుంది. కాలమ్ రాసినా, పిట్టకథ రాసినా, వ్యంగ్య వ్యాసం రాసినా, ఏదైనా పుస్తకానికి ముందుమాట రాసినా, కథ రాసినా చదువరిని ఆసాంతం చదివించడం వాటికి సహజ లక్షణం. శ్రీరమణ గారి కలం నుండి వచ్చిన ఏ రచన చదివినా అంత త్వరగా మర్చిపోవడం సాధ్యం కాదు. వారి అక్షరాలకు మన మస్తిష్కంలో జాగా చేసుకుని కూర్చోవడం బాగా వచ్చు.
ఈ వారం శ్రీరమణ గారి ‘మొగలిరేకులు’ అనే పుస్తకం విడుదల అవుతోంది. ఈ పుస్తకం నిండా పిట్ట కథలు, వ్యంగ్యాస్త్రాలు, కటిక నిజాలు, సరదా సంఘటనలు, రాజకీయాలపై చెణుకులు, సామాన్యుడి స్థితిగతులు, మధ్యతరగతి మందహాసాలు కొలువుంటాయి. నిజం చెప్పాలంటే కొత్తగా రచనలు చేయాలనుకునేవారు వీరి ఈ కాలమ్ లు పరిశీలించాలి. ఒకటి, రెండు పేరాల్లో వ్యంగ్యం ఘాటు తగ్గకుండా, విషయం పూర్తిగా చెప్పడం అంటే ఒక ఫీట్. అది శ్రీరమణ గారికి జీడిపప్పుతో పెట్టిన విద్య కదా. మల్లె, జాజి, మరువం, అన్నీ కట్టిన కదంబమాల ఉన్న పూల పొట్లం లాంటి ఈ పుస్తకం మీ చేతుల్లో పెడుతున్నాం. ఆస్వాదించండి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.