ప్ర. జ లో చాలా తెలుసుకున్నాం..

Meena Yogeshwar
April 19, 2025

మా బామ్మ చదివింది 5వ తరగతి. కానీ ఆవిడ వేసుకునే ప్రతి మందు గురించి, దాని chemical composition, side effects, similar drugs ఇలా అన్నీ తెలుసుకునేది. చాలా వివరంగా గుర్తుపెట్టుకునేది. ఇక డాక్టర్ గారి దగ్గరకెళ్తే చూడాలి ఆవిడ ప్రతిభ. మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఈవిడ ధోరణికి అలవాటు పడిపోయారు కానీ, మిగిలిన డాక్టర్లు అబ్బురపడిపోయేవారు. ‘మామ్మగారూ మీకు ఇవన్నీ ఎలా గుర్తు ఉన్నాయండీ? వీటిలో కొన్ని మేము ఏ ఏ సందర్భాల్లో అత్యవసరంగా ఇస్తామో కూడా చెప్పేస్తున్నారేమిటండీ బాబూ’ అని ఆశ్చర్యపోయేవారు. అప్పుడు మా బామ్మ చెప్పే డైలాగ్ ఏమిటో తెలుసా? ...

తెలిసినవారు నేను పెట్టిన శీర్షిక అతి సామాన్యంగా చదువుకు వెళ్తారు కానీ, తెలియనివారైతే ఈ పిల్లకేమైంది ప్రజలో తెలుసుకోవడం ఏమిటీ అనుకుంటారు కదా. శ్రీశ్రీ గారు ప్రగతి వారపత్రికలో నిర్వహించిన ప్రశ్నలు జవాబుల శీర్షికకు పెట్టుకున్న పేరు ‘ప్ర. జ’. ఈ నెల జరిగిన ప్రసంగం ఈ ధోరణిలోనే జరిగింది. ప్రతిసారి మన ప్రసంగాలు నడిచేలా కాకుండా చాలా విన్నూత్నంగా నడిచింది. డాక్టర్ గారు క్విజ్ నిర్వహించి, ప్రతీ సమాధానానికీ మంచి వివరణ ఇచ్చారు. మంచి Interactive session లా జరిగింది.

గతవారం న్యూస్ లెటర్ చదివితే మీకు అర్ధం అవుతుంది, జీర్ణాశయ ఆరోగ్యం గురించి నేను పాటించడం ఎలా ఉన్నా, నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపుతాను అని. నిజం చెప్పనా, నాకు కార్తీక్ గారు చెప్పేదాంట్లో సగానికి సగం విషయాలు ముందే తెలిసిపోతాయి అని గర్వంగా ప్రసంగానికి హాజరయ్యాను. నా అదృష్టం కొద్దీ నాకు గర్వభంగం అయింది. నేను తెలుసు అనుకున్నది గోరంత అని, ఆ సబ్జెక్ట్ లో కార్తీక్ గారి ప్రజ్ఞ కొండంత అని అర్ధం అయింది. నాకు తెలుసు ‘ఇది obvious కదా. అటువైపు ఉన్నది డాక్టర్ గారు, ఈ పిల్ల ఇంత తెలివి తక్కువగా ఎలా అనుకుంది’ అనేగా మీరు అనుకునేది.

నిజానికి మా బామ్మ గురించి చెప్తే మీకు ఈ సందేహం పటాపంచలు అయిపోతుంది. మా బామ్మ చదివింది 5వ తరగతి. కానీ ఆవిడ వేసుకునే ప్రతి మందు గురించి, దాని chemical composition, side effects, similar drugs ఇలా అన్నీ తెలుసుకునేది. చాలా వివరంగా గుర్తుపెట్టుకునేది. ఇక డాక్టర్ గారి దగ్గరకెళ్తే చూడాలి ఆవిడ ప్రతిభ. మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఈవిడ ధోరణికి అలవాటు పడిపోయారు కానీ, మిగిలిన డాక్టర్లు అబ్బురపడిపోయేవారు. ‘మామ్మగారూ మీకు ఇవన్నీ ఎలా గుర్తు ఉన్నాయండీ? వీటిలో కొన్ని మేము ఏ ఏ సందర్భాల్లో అత్యవసరంగా ఇస్తామో కూడా చెప్పేస్తున్నారేమిటండీ బాబూ’ అని ఆశ్చర్యపోయేవారు.

అప్పుడు మా బామ్మ చెప్పే డైలాగ్ ఏమిటో తెలుసా? ‘కొత్త వైద్యుడికన్నా పాత రోగికే వైద్యం ఎక్కువ తెలుసు’ అని నవ్వేసేది. అలా నాకు జీర్ణాశయ ఆరోగ్యానికి ఆజన్మ వైరం ఉంది. మొదట Appendicitis తో మొదలై, gallbladder removal, chronic gastritis ఇలా సాగుతోంది మా జీర్ణ ప్రయాణం. పైగా biology అంటే తగని ప్రేమ నాకు. మా క్లాసులో అందరికన్నా, మా బయాలజీ టీచర్ అలియాస్ ప్రిన్సిపల్ గారికి నేనంటే వల్లమాలిన అభిమానం. అలాంటి నేను ఇంజినీర్ ఎలా అయ్యాను అన్నది ఓ విషాద గాథ. మరెప్పుడైనా చెప్తా. 

అందుకని, నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే కాక, సాధారణ వైద్య విషయాలు కూడా నేర్చుకోవడం నా హాబీ. ఇది నా హాబీనే కాదు, మా అమ్మది కూడా. అప్పట్లో ఈటీవీ 2 లో వచ్చే ‘సుఖీభవ’ అనే వైద్య కార్యక్రమానికి మా అమ్మ ఫ్యాన్. సాయంత్రం 3.30కి ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ ముందు మా అమ్మ ఉండాల్సిందే. రకరకాల విషయలపై డాక్టర్లు మాట్లాడేది వినాల్సిందే. ఇలా నేర్చుకోవడం నా రక్తంలోనే ఉన్న కారణంగా, ఈ విషయమై చదవడం, వినడం, తెలుసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. నా యూట్యూబ్ హిస్టరీలో చూస్తే సగం వరకూ డాక్టర్లు, డైటీషియన్ల podcast లే ఎక్కువ ఉంటాయి.

అందుకే నేను చాలా వరకూ విషయాలు నాకు తెలిసి ఉంటాయి అనుకోవడంలో తప్పు లేదు అని మీరే ఒప్పుకుంటారనుకుంటా. సరే, నాకు గర్వభంగం అయింది. డాక్టర్ కార్తీక్ కృష్ణమూర్తిగారు చాలా క్లిష్టమైన విషయాలని, చాలా సరళమైన తెలుగులో వివరించడం అపూర్వమైన విషయం. సహజంగా డాక్టర్లు వైద్య విషయాలు ఇంగ్లీషులోనే ఎక్కువగా వ్యవహరించడం పరిపాటి. వారు నేర్చుకున్నది, రోజూవారీ ఉపయోగించేది ఆ భాషే కాబట్టీ, అది సహజం. కానీ, కార్తీక్ గారు చక్కటి తెలుగులో వైద్య విషయాలన్నిటినీ వివరించడం చాలా గొప్పగా అనిపించింది.

ఆయన ఏ ప్రశ్నలు వేసి, సమాధానాలు ఇచ్చారు? ఏ విషయాలు వివరించారు? ఇతర సభ్యులు ఏం ప్రశ్నలేశారు? దానికి ఆయన ఏం జవాబులిచ్చారు? ఇవన్నీ మానేసి నీ సోది చెప్పుకుంటూ వెళ్తావేమమ్మా అంటారా? మీకు ఎప్పుడూ తొందరేనండీ బాబూ. ఆయన వివరించిన క్లిష్టమైన వైద్య విషయాలను మీకు తిరిగి నేను వివరించగలను అని మీరు అంత అమాయకంగా ఎలా అనుకుంటున్నారు? నా మీద అభిమానం వలన వచ్చిన నమ్మకంతో కూడిన ధైర్యం అయి ఉండాలి. అంత ధైర్యం నాకు లేదు. ఈ కింది యూట్యూబ్ వీడియోలో ఉంది చూసేయండి. మొదట్నుంచీ ఆఖరుదాకా తప్పకుండా చూడండి. మీరు మీ జీవనశైలిలో కనీసం ఒక్క మంచి మార్పు అయినా చేసుకోకపోతే నా పేరు మార్చుకుంటా. బస్తీ మే సవాల్.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :