పదమూడేళ్ళు అంటే నా ఏడవ తరగతి. అప్పట్లో మాకు పబ్లిక్ పరీక్షలు ఉండేవి. అందుకని తెగ చదివించేవారు స్కూల్ లో. పొద్దున్నే లేచి, తాయితీగా తయారు అయ్యి, అన్నయ్యతో కలిసి స్కూలుకు వెళ్ళి, ఆడుతూ పాడుతూ చదువుకోవడం. సెలవల్లో ఆటలు. అక్కతో గిల్లికజ్జాలు. మధ్యలో వచ్చే చిన్ని చిన్ని ఫంక్షన్లకు అందంగా ముస్తాబై వెళ్ళడం. నాన్నగారితో షికార్లు, అమ్మ దగ్గర అలకలు. బామ్మతో కబుర్లు, అమ్మమ్మ దగ్గర గారాలు. ఆడుతూ పడిపోతే తగిలే దెబ్బలు. వాటి పేరు చెప్పి స్కూలు ఎగ్గొట్టడాలు. ఇలా ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి పదమూడేళ్ళ వయసు ఎలా గడుస్తుందో నాదీ అటూ ఇటుగా అలాగే గడిచింది.
అందరికీ అలాగే గడుస్తుందా? అమ్మానాన్నలతో సరదాలు, తోబుట్టువులతో ఆటలు, గిల్లికజ్జాలు, చదువులో పోటీలు వంటి సామాన్య విషయాల ముక్కూ మొహం కూడా తెలియని పిల్లలు ఉంటారు. ఇది మనకు తెలిసినా, గుర్తించని, గుర్తించడానికి పెద్దగా ఇష్టపడని కఠోర సత్యం. అసలు లోకమంటే ఏమిటి? సమాజం అంటే ఏమిటి? జాతి అంటే ఏమిటి? వేరే దేశం అంటే ఏమిటి? అది మన దేశం మీద ఎందుకు యుద్ధం చేస్తోంది? చేసి ఏమి సాధిస్తుంది? వంటి వాటికి పూర్తి సమాధానాలు తెలియకుండానే కొందరు బాలలు తమ జీవితాలను పోరాట సదృశంగా గడుపుతారు. యుద్ధం అంటే తెలియకుండానే, యుద్ధంలో భాగం అవుతారు. అది తెచ్చే పరిణామాలను భుజాలపై మోస్తారు.
తోటి మనిషిని చంపాలంటే మనసులో ఎంత కర్కశం ఉండాలి? అది కూడా అకారణంగా, వాళ్ళు మనకి ఏ హానీ చేయనివారైతే? అందులోనూ పసిపాపలైతే? అలాంటిది ఒక జాతి జాతి మొత్తాన్నీ ఈ భూప్రపంచంపై నుంచి తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు ఒకడు. తనదే గొప్ప జాతి అని. తన శరీరంలో ప్రవహించేదే శుద్ధమైన రక్తం అని, కొందరు జాతుల వాళ్ళు కనీసం బతకడానికి కూడా అర్హులు కారు అని. అసలు ఆ జాతిలో పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపం అని. అలా పుట్టినప్పుడే, వాళ్ళు తన చేతిలో చనిపోవడం రాసి పెట్టి ఉందని అనుకునే ఒక దురహంకారుడు చేసిన హత్యాకాండలో ఎందరు అమాయకులు ఎన్ని చిత్రహింసలు అనుభవించారు? ఎందరు చనిపోయారు?
ఇదంతా ఏ పురాణ గాథో అనుకునేరు. వాడెవడో రక్తం తాగే రాక్షసుడు అనుకునేరు. కాదు క్రితం శతాబ్ధం చూసిన అత్యంత దారుణమైన వ్యక్తి, నరహంతకుడు, రాక్షసులను మించిన దురహంకారం, క్రౌర్యం కలిగిన వ్యక్తి. అడాల్ఫ్ హిట్లర్. జాత్యాహంకారం, సామ్రాజ్య విస్తరణ, ధన-అధికార దాహం ఒక మనిషిని ఎంతటి నీచ స్థితికి తీసుకువెళ్ళగలదు అంటే హిట్లర్ ని చూపిస్తే చాలు. అందరూ మహాత్ములు, అతనొక్కడే రాక్షసుడు అని నేను అనడం లేదు. చరిత్రలో ఎన్నో దారుణాలు చేసినవారు ఉన్నారు. ఇంకా చేస్తున్నవారూ ఉన్నారు. హిట్లర్ వాళ్ళందరికీ ప్రతినిధి. మనిషిలోని క్రౌర్యానికి నిలువెత్తు నిదర్శనం. మూర్ఖత్వానికి మూర్తి కడితే అది హిట్లర్ అవుతుంది.
చాలామందికి కోపం రావచ్చు. అతనేమీ మరీ అంత చెడ్డవాడు కాదు. ఇదంతా అమెరికా, బ్రిటన్ లు చేసిన దుష్ప్రచారం. గోరంతల్ని కొండంతలు చేసి చూపారు అని చాలామంది దగ్గరే విన్నాను నేను. వాళ్ళందరికీ ఒకటే సూటి ప్రశ్న. అంత దుర్మార్గుడు అంటే ఎంత? దానికి కొలమానం ఏమిటి? ఒక మనిషిని చంపితేనే ఎన్నో కఠిన శిక్షలు ఉన్నాయిగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ. మరి కొన్ని లక్షల మందిని చంపినవాడు మహానుభావుడు ఎలా అవుతాడు? గ్యాస్ ఛాంబర్స్, బలవంతంగా ఎలాంటి మత్తు ఇవ్వకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లు చేయడం, కాన్సంట్రేషన్ క్యాంప్ లు, కొత్తరకం మందులును వాళ్ళపై ప్రయోగించి, ఎలా పనిచేస్తున్నాయో చూడడం, ఒక రోగం గురించి పరిశోధించాలంటే, వాళ్ళకి ఆ రోగాన్ని ఎక్కించడం ఇలా ఎన్ని చిత్రహింసలు అనుభవించాయో తెలుసా కొన్ని జాతులు?
వారందరి ధన, మాన, ప్రాణాల హననానికి బాధ్యుడు అతను కాదా? వీరందరి సమాధులపైనా అతను నిర్మించే సమాజానికి ఎలాంటి భవిష్యత్ ఉంటుంది? భగవంతుడే ఇన్ని జాతులనూ సృష్టించినప్పుడు, ఇందులో ఎక్కువ తక్కువలు ఎవరు నిర్ణయిస్తారు? వారందరూ కోల్పోయిన బాల్య, యవ్వనాలు, ఛిద్రమైపోయిన వారి కలలు, తిరిగి రాని వారి ఆత్మీయుల గురించిన బాధ, మానని ఆ గాయాల వలన క్షోభ, వారు అనుభవించిన ఆ అవమానాలు, పోయిన ఆ ప్రాణాలు ఎక్కడికి పోతాయి? తరతరాలకూ, జన్మజన్మలకూ ఆ మారణ కాండ నడిపినవారిని వెన్నాడుతూనే ఉంటాయి.
రెండవ ప్రపంచ యుద్ధం అనే కారు చీకట్లు కమ్ముకున్నవేళ, హంగేరి దేశ రాజధాని బుడాపెస్ట్ లో ఒక అనాథ బాలుడి కథ ఎలా ఉంటుందో తెలుసా? అవును నిర్జీవంగా, బాధాకరంగా, చావుకళ ఉట్టిపడుతూ ఉంటుంది. తెలివి తెలిసే సరికే తండ్రి పోయాడు. కొన్నాళ్ళకి తల్లి కూడా పోయింది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, తన జీవితానికి రక్షణ, పోషణ లేని 13ఏళ్ళ బాలుడు ఒక మంచు తుఫాను రాత్రి ఏం చేశాడు అన్నదే ‘ది బాయ్ అండ్ హిజ్ ఫ్రెండ్ బ్లిజర్డ్’. ఈ నరక కూపం నుంచి బయటపడి దూరతీరాల్లో భవిష్యత్తు రచించుకోవాలనుకున్న ఆ పిల్లాడి కోరిక ఏమైంది?
అసలు ఒక మంచు తుఫానును తన స్నేహితునిగా ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక ప్రకృతి విపత్తు ఎవరికైనా తన స్నేహ హస్తం ఎలా ఇవ్వగలదు? అంతలా నమ్మిన ఆ స్నేహితుడు ఆఖరికి ఆ పిల్లాడికి సాయం చేశాడా? మోసం చేశాడా? లేదంటే తన ధర్మం తాను చేశాడా? తాను తినడానికి తిండి లేకపోయినా, మరొక మనిషిని కాపాడాలనుకున్న ఆ బాలుడిలోని మానవత్వం చివరికి తనకి ఏమిచ్చింది? నిష్కారణంగా ఒక జాతిని తుడిచివేయాలనుకునే ఒక రాక్షసుడు చేస్తున్న యుద్ధంలో, ఏమీ సంబంధంలేని నిలువెత్తు మానవతా మూర్తి అయిన ఆ అమాయకుడైన 13ఏళ్ళ బాలుడు ఏమయ్యాడు?
ఏమవతాడు? కొన్ని లక్షల ప్రజలు ఏమయ్యారో అదే అయ్యాడు. ఆ నియంత చేతికి అంటిన రక్తంలో తనది కూడా కాస్త పూశాడు. అతని ఖాతాలో మరో విగత జీవి అయ్యాడు. రెండు దేశాలు అధికారం కోసం చేసుకునే యుద్ధంలో సామాన్యుల జీవితానికి రేటు ఎంత? వారి ప్రాణం ఖరీదు ఎంత? ప్రముఖ హంగేరియన్ రచయిత గ్రెగ్రరీ మార్టన్ ఈ నవల ద్వారా సూటిగా వేసిన ఈ ప్రశ్న ప్రతి మానవుణ్ణి కదిలిస్తుంది. బహుశా, ఆ నియంత ఈ నవల చదివి ఉంటే, అతణ్ణి కూడా కాస్త కదిలించగలదేమో. ఇంత depressed నవలపై విశ్లేషణ ఎందుకు వినాలి అని మీరు నన్ను అడగవచ్చు. ఇలాంటి కథలు మన ప్రాణం ఖరీదును, మన జీవిత విలువను, మనకు ఉన్న సౌకర్యాలను మనకు గుర్తు చేస్తాయి. వాటిపై గౌరవం పెంచుతాయి.
ఈ వారం ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు ఈ నవలపై చేసిన విశ్లేషణ విడుదల అవుతోంది. వినండి. నన్ను అడిగితే పదేళ్ళు దాటిన మీ పిల్లలకు కూడా వినిపించండి. ఇంత బాధాకరమైన కథ మీ పిల్లలకు వినిపించమన్నాను అని నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. పిల్లలను ఎంత హాయిగా, ఆడుతూ పాడుతూ పెరగనివ్వాలో, అంత కన్నా కాస్త తక్కువ మోతాదులోనైనా ప్రపంచంలోని realityని చెప్తూ పెంచడం కూడా వారి భవిష్యత్తుకు అవసరం అనిపించి ఇలా చెప్పాను. ఈ కథ విన్నాకా, నేను చేసిన ప్రతిపాదనను మీరు కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నాను.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.