పెళ్ళంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు పెద్దలు. వాటితో పాటూ జాతకాలు, ముహుర్తాలు, ఆస్తులు, అంతస్తులు కూడా చూస్తున్నారు. పకడ్బందీగా అన్నీ చూసుకుని, లెక్కలేసుకుని మరీ నిశ్చయించుకుంటున్నారు. బ్రహ్మాండంగా పెళ్ళి చేస్తున్నారు. కట్నాలు, లాంఛనాలు అన్నీ కలిపి జీవితాంతం కష్టపడి సంపాదించినదంతా ఆ పెళ్ళిళ్ళల్లో ఖర్చు పెడుతున్నారు. తెలిసినవాళ్ళని, చుట్టాలని, స్నేహితుల్ని పిలిచి ఆడంబరంగా అందరి ముందూ కలిసి ఉంటాం అని వాగ్ధానాలు చేసుకుంటున్నారు. ఇలా జరుగుతున్న పెళ్ళిళ్ళల్లో నిలబడేవి, సమాజానికి ఆదర్శంగా నిలబడేవి ఎంత శాతం?
మరో వైపు, సంవత్సరాల తరబడి పరిచయం. కొందరైతే కలిసి ఉంటున్నారు కూడా. ఆమెకు ఏ రంగు ఇష్టమో అతనికి తెలుసు. అతనికి ఏ వంట నచ్చుతుందో ఆమెకు తెలుసు. ఒకరినొకరు క్షుణ్ణంగా అర్ధం చేసుకుంటున్నారు. కోపాలు, ప్రేమలు, దెబ్బలాటలు, కలిసిపోవడాలు, సర్దుకోవడాలు, ఎదురుతిరగడాలు, వెరసి పెళ్ళి కాకుండానే సంసారం ఎలా ఉంటుందో తెలుసుకుని మరీ సంసారంలోకి దిగుతున్నారు. కొందరు పెద్దల్ని నొప్పించి, కొందరు పెద్దల్ని ఒప్పించి. పోనీ ఇంత తతంగం తరువాతైనా అన్యోన్యంగా ఉంటున్నారా? అందులో నిలబడేవి ఎన్ని పెళ్ళిళ్ళు?
ఒకోసారి ఇది మిలియన్ డాలర్ ప్రశ్నలా అనిపిస్తుంది. ఎంత వాకబు చేసుకుని పెళ్ళి కుదుర్చుకున్నా, ఎన్నేళ్ళు ప్రేమించి అర్ధం చేసుకుని ప్రేమ పెళ్ళి చేసుకున్నా, చివరికి మన రాతలో ఎలా రాసుందో అదే జరుగుతుందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను రెండు రకాల వారనీ దగ్గరగా చూశాను. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని, వారిద్దరూ కలిసి ఉండడం కోసమే పుట్టారేమో అనిపించే జంటల్నీ చూశాను. ప్రేమించి పెళ్ళి చేసుకుని కూడా ఏ నిమిషంలో ఒకర్ని ఒకరు చంపేస్తారో బాబోయ్ అనిపించే వాళ్ళనీ చూశాను.
అలాగే రివర్స్ కూడా. పెద్దల్ని ఎదిరించి పెళ్ళి చేసుకుని, వాళ్ళ శాపనార్ధాలతో కొత్త జీవితాలు మొదలుపెట్టి, ఆదర్శ దంపతులు అంటే ఇలాగే ఉండాలి అనేంత గొప్పగా బతికిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళద్దర్నీ విడదీయలేనంత గొప్పగా కలిసింది జాతకం అని చెప్పిన జంటలు సంవత్సరంలో విడిపోయినవాళ్ళూ ఉన్నారు. మరి యువతరానికి పెళ్ళి విషయంలో పరిష్కారం ఏమిటి? ప్రేమ పెళ్ళి సరైనదా? పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవడం సరైనదా?
చాలామంది పెద్దలు చెప్పే ఒక మాట ఏమిటంటే, మిమ్మల్ని కని పెంచి పెద్ద చేశాం. మీ మంచి ఏమిటో మీకన్నా మాకే బాగా తెలుసు కాబట్టీ, మేము నిర్ణయించే సంబంధమే మీకు సరైనది అంటారు. అందులో నిజం లేకపోలేదు. కానీ నా కళ్ళారా చూసిన ఒక సంఘటన చెప్తాను. అది చూశాకే నాకు పెద్దలు చేసే ఆ వాదనలో బలం ఎంత అనే అనుమానం వచ్చింది. పెళ్ళి చూపులకు వెళ్ళిన వాళ్ళతో అమ్మాయి ఎలా ఉంది? అని అడిగాను. ఇల్లు చాలా బాగుంది అన్నారు వాళ్ళు. సరే, పిల్ల సంగతి ఏమిటి? ఏం చదువుకుంది అన్నాను. వాళ్ళకి ఇంకో స్థలం కూడా ఉందిట. ఒకత్తే కూతురు వాళ్ళ తరువాత అమ్మాయికే అన్నారు.
అది సరే ఆ అమ్మాయి గురించి అంతా వాకబు చేసుకున్నారా? ఇన్ని లక్షలు కట్నం కూడా ఇస్తాం అన్నారు అని సమాధానం వచ్చింది. నేను తూర్పు తిరిగి దణ్ణం పెట్టి ఊరుకున్నాను. పెళ్ళై రెండేళ్ళు అయింది. ఈ మధ్యే వాళ్ళు ఫోన్ చేశారు బాధగా. నా భర్త పెళ్ళి కాకముందు సంపాదించిన డబ్బు అంతా ఏమైంది? మా అమ్మా వాళ్ళు ఇచ్చిన నా కట్నం డబ్బులు ఏవి? అంటూ ఆ అమ్మాయి అడిగిందని మహా బాధ పడిపోతున్నారు వాళ్ళు. బంధం అంటే డబ్బులేనా అమ్మా, ఎలా మాట్లాడుతోందో మా కోడలు. ఇంటి కోడలు అన్నాకా బాధ్యతలు బంధాలు ఏవీ లేవు. ఎప్పుడూ డబ్బు ధ్యాసే అంటూ చెప్తున్నారు.
వాళ్ళు చేసిన పెళ్ళి డబ్బు పునాదులపైనే నిర్మించినప్పుడు, బంధాలు అభిమానాలు ఎలా వస్తాయి? పిల్లా, పిల్లాడు ఇష్టపడ్డారు అనో, వాళ్ళ కుటుంబం నడవడి బాగుందనో, వాళ్ళకి బంధుప్రీతి ఉందనో వీళ్ళు సంబంధం కుదుర్చుకోలేదుగా. పెళ్ళికి ముందు డబ్బు, ఆస్తి, కట్నం గురించే మాట్లాడినవాళ్ళకి, పెళ్ళైయ్యాకా బంధాలు, ప్రేమలు కావాలని కోరుకోవడం అత్యాశ కాదూ..!
ఈవారం విడుదలయ్యే ‘కడలి’ నవల ప్రేమ, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ గురించే మాట్లాడుతుంది. ఇందులోని లాయర్ పాత్ర రక్తమాంసాలతో మన ముందు నడిచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే, ఆ పాత్ర మనసు అచ్చంగా మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి. ఆమె చాలా ఉదార స్వభావి, ఎన్నో విడాకుల కేసులు చూసిన తలపండిన లాయరు. అభ్యుదయ భావాలు, forward thinking గల మనిషి. ఆడపిల్లలకి నిర్ణయాధికారం ఉండాలి, ప్రేమించడం అనేది వారి ప్రాధమిక హక్కు, ఇష్టం లేని, హింసలు ఆనుభవించే పెళ్ళిలో ఉండడం కన్నా విడిపోవడం సరైన నిర్ణయం లాంటి స్వేచ్ఛను సమర్ధించే భావజాలం ఆమెది.
అయితే అవన్నీ తన సొంత కూతురు ప్రేమలో పడేంతవరకే. ఎప్పుడైతే తన కూతురు తాము తెచ్చిన సంబంధం కాక, తనకి నచ్చినవాణ్ణి చేసుకుంటానని తెగేసి చెప్తుందో ఆమెలో మరో మనిషి బయటకు వస్తుంది. సగటు సాధారణ స్త్రీ బయటకు వస్తుంది. ప్రతీ తల్లిలాగానే కూతుర్ని ప్రేమించకూడదు అంటూ మాట్లాడుతుంది. నీకు పెళ్ళి చేసే హక్కు మాది, నీ ఇష్టం వచ్చినవాణ్ణి చూసుకుని ప్రేమించే హక్కు నీకు లేదు అంటుంది. Dual personality లా అనిపిస్తోంది కదా. నిజమేగా, మనందరిదీ అదేగా. దేశానికి గాంధీ అవసరం. కానీ మన ఇంట్లో పుట్టకూడదు అనుకునే వాళ్ళమేగా మనమందరం.
తరతరాల నుండి దాంపత్యం సమాజాన్ని ఎంతగా నిలబెడుతోందో, ఎప్పటికీ మారని ఒక నిత్య నూతన సత్యంగా ఎలా ఉందో, అంతే స్థాయిలో సమస్యాత్మకంగా కూడా ఉంది. ఎందరు స్త్రీ, పురుషులు ఈ సమాజం నిర్మించిన ఉక్కు పిడికళ్ళ లాంటి కట్టుబాట్ల కింద నలిగిపోయారో మనందరికీ తెలుసు. పెళ్ళి అనేది ఎప్పుడూ ప్రధానంగా ఇద్దరు మనుష్యుల మధ్యన విషయం. వాళ్ళ బంధం ఎంత గట్టిగా ఉంటే, అది తమ చుట్టూ వారిని అంతగా కలిపి ఉంచగలుగుతుంది. అదే లోపించినప్పుడు బయట నుండి ఎంత ప్రయత్నం జరిగినా, ఆ పెళ్ళి వలన ఎవరికీ ప్రయోజనం లేకపోగా, ఇంకా నష్టం కలిగిస్తుంది అనేది నా అభిప్రాయం.
పెళ్ళి అనే బంధాన్ని చూపించడంలో బాపుగారు తీసిన ‘పెళ్ళి పుస్తకం’ నాకు చాలా ఇష్టమైన సినిమా. అందులో హీరో చెప్పినట్టు ‘పెళ్ళికి పునాది ప్రేమ, గౌరవం’. అది వేదమంత్రంగా ప్రతివారికీ చెప్పాలి అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా కొత్త దంపతులకు. ప్రేమ పెళ్ళైనా, పెద్దలు కుదిర్చినది అయినా, ఈ రెండిటి మీదా నిర్మించిన బంధం గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. మీ అభిప్రాయం ఏమిటి? ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రాసిన ‘కడలి’ నవల వినండి. ఈ న్యూస్ లెటర్ కూడా చదివాకా, మీరేం అనుకుంటున్నారో నాకు చెప్పండి. మీరూ నన్ను ఏకీభవిస్తారని నా అనుకోలు. ఏమంటారు?
అభినందనలు,
మీనా యోగీశ్వర్.