పుస్తకం అంతా తెంగ్లీష్ లోనే ఉంది

Meena Yogeshwar
March 11, 2025

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతీదానికి పునర్వైభవం తిరిగి వస్తుంది. అదే జరుగుతోంది తెలుగు సాహిత్యానికి. మళ్ళీ అందరూ పుస్తకాలు చేతబడుతున్నారు. రాసేవాళ్ళు, చదివేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. చాలా నాణ్యమైన కాంటెంట్ వస్తోంది. తెలుగు సాహిత్యంలో కొత్త కెరటాలు వస్తున్నాయి. కథా వస్తువులో కూడా విస్తృతి పెరిగింది. కేవలం సాహిత్యంపైనే ఆధారపడి కెరీర్ నిర్మించుకునేవారూ పెరిగారు. తెలుగులో ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. గాలికి వంగిన పైరు తిరిగి లేచి నుంచుని ఆకాశాన్ని చూసినట్టు, సాహిత్యం తిరిగి లేస్తోంది. దిగంతాల వైపు ప్రయాణిస్తోంది. దానితో పాటు, నిశ్శబ్ధంగా గడిచిన దశాబ్ధాల్లో వచ్చిన గొప్ప సాహిత్యాన్ని కూడా....

న్యూస్ లెటర్ లోకి వెళ్ళేముందు మీకో ముఖ్యమైన న్యూసు.

 ‘శ్రేయం’ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం..

దాసుభాషితంలో ఒక మనిషి సమగ్ర శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా కాంటెంట్ తయారు చేస్తామని అందరికీ తెలిసిందే. ఆ సమగ్ర శ్రేయస్సులో ముఖ్యమైన అంశం ఆధ్యాత్మికత. కొన్నేళ్ళ క్రితం మొదలైన దాసుకిరణ్ గారి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఆయన ఎన్నో చోట్ల ప్రస్తావించారు. మన యూట్యూబ్ ఛానెల్ లో కూడా ఎన్నో ఆధ్యాత్మిక వీడియోలు చేశారు. అద్వైత సాధన అనే వాట్సాప్ గ్రూపులో మీలో చాలామంది వారితో పాటు, ఇతర సాధకుల అనుభవాలను నేరుగా చదువుతున్నారు కూడా.

ఇప్పుడు మరో ముందడుగు వేస్తూ, కేవలం ఆధ్యాత్మిక విషయాలను వివరించేందుకు ‘శ్రేయం’ అనే యూట్యూబ్ ఛానెల్ ను తన 51వ పుట్టినరోజు సందర్భంగా మార్చి 6వతేదీన విడుదల చేశారు కిరణ్ గారు. ఇందులో తన ఆధ్యాత్మిక అనుభవాల గురించి, అద్వైత సాధన గురించి సులభమైన ఆంగ్ల భాషలో వివరించనున్నారు ఆయన. మరింతమంది ప్రపంచవ్యాప్త సాధకులను చేరేందుకు ఈ ఛానెల్ లో ఆంగ్లాన్ని మాధ్యమంగా ఎంచుకున్నారు కిరణ్ గారు.

ఆధ్యాత్మిక సాధన వలన మన రోజూవారీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అటువైపుగా అడుగులు వేసేందుకు ఎలా సాధన చేయాలి? కిరణ్ గారు అద్వైత మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అసలైన స్వాతంత్రం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత ఆ స్వాతంత్రాన్ని ఎలా ఇవ్వగలదు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ ఛానెల్ ద్వారా పంచుకోనున్నారు కిరణ్ గారు. ఈ యూట్యూబ్ ఛానెల్ లింకును ఈ కింద ఇస్తున్నాం. మీకు ఈ విషయంపై ఆసక్తి ఉంటే తప్పకుండా ఛానెల్ ను subscribe చేసుకోండి. మీ స్నేహితులు, బంధువలకు కూడా ఈ ఛానెల్ గురించి చెప్పండి.

ఇప్పుడు ప్రసంగం గురించి మాట్లాడుకుందాం..

నేను ఒక విషయం ఒప్పేసుకుంటున్నాను అండి. నిజమే ‘I judge gen z’. వాళ్ళ భాష, జీవన ధృక్పధం, మానవ సంబంధాలు, ముఖ్యంగా ప్రేమ సంబంధాల విషయంలో ఆ తరం అంటే చాలామంది మిలీనియల్స్ లాగానే నేనూ వారిని జడ్చ్ చేస్తాను. ప్రతీ తరంలోనూ, ఆ తరానికే ప్రత్యేకమైన కొన్ని సుళువులూ ఉంటాయి, కష్టాలూ ఉంటాయి. మా ముందుతరం చూసిన ఆర్ధిక మార్పుల వలన, వారు చదువుకోవడానికి పడిన కష్టాలు, జీవన అవకాశాల కోసం పడిన కష్టాల వలన, మా మిలీనియల్స్ లో ఎక్కువ శాతం వారికి చదువు, చదువు, చదువు తప్ప ఏమీ మిగలలేదు. 

ఎంతసేపు రుబ్బురోట్లో వేసి రుబ్బినట్టు బట్టీపట్టి చదవడం మా తరానికి జరిగిన అతిపెద్ద అన్యాయం. అలాగే కెరీర్ లో కూడా అయితే డాక్టర్ లేదంటే ఇంజినీర్, మహా కాదంటే చార్టెడ్ అకౌంటెంట్. వీటి వెనుకే పరిగెత్తేలా మమ్మల్ని తీర్చిదిద్దారు మా ముందుతరం వారు. మిగిలిన ఉద్యోగాలు, వ్యాపారాలు పనికిమాలినవని, వాటి వైపు వెళ్తే బాగుపడరని చాలామందిని ఈ రాటలకే కట్టేశారు. ఈ కెరీర్ కట్లను తెంచుకుని బయటపడిన వారు పొగరుబోతులుగా చిత్రించబడ్డారు. పైగా రొడ్డకొట్టుడు చదువులో పడి ఇతర ఆటలు, వ్యాపకాలు వంటివి లేక ఎందరి శారీరిక, మానసిక ఆరోగ్యమో నాశనం అయిపోయింది. Hormonal issues కు అత్యధికంగా గురైన మొదటి తరం మాదే.

అయితే, మాకూ కొన్ని మంచి లక్షణాలు మిగిలాయి. మేము ఎదుగుతున్న దశలోనే కొత్త టెక్నాలజీ రావడం వలన దానిని అందిపుచ్చుకునే అవకాశం, త్వరగా నేర్చుకోగల సామర్ధ్యం మా తరానికి దొరికిన గొప్ప వరం. కొత్త పోకడలను అలవరచుకుంటూనే, పాత పద్ధతుల పట్ల అవగాహన, అందులో మంచిని ముందుకు తీసుకుపోగల ఔదార్యం మా సొంతం. అయితే, మేము జెన్ జి ని జడ్జ్ చేస్తున్నట్టే, మా ముందుతరం మమ్మల్నీ జడ్జ్ చేసింది. మా పద్ధతులనూ ఎద్దేవా చేసింది. ఇది కూడా ప్రతీ తరానికి విధిగా వచ్చే ఆనవాయితీ ఏమో.

అయితే, ఇప్పుడు నేను అలా గుడ్డిగా జడ్జ్ చేయడం తగ్గించాను. వారు ఎందుకు ఇలా అవుతున్నారు అనేది అర్ధం చేసుకుంటున్నాను. ప్రతి తరం, తమ ముందు తరంలో జరిగిన విషయాలను ఒక memory లా మోస్తాయి. అప్పుడు జరిగిన తప్పులను తాము తిరిగి చేయకూడదు అనుకుంటాయేమో అనిపిస్తుంది. మా తరంలో live in relationship వలన ఎంత లాభం జరిగిందో, అంతే నష్టమూ జరిగింది. అవి చూసి, అలా మేము ఈ బంధాల వలన ఎక్కువగా attach అయ్యి, తేడా కొడితే Mental గా effect అవ్వకూడదు అని ఇప్పుటి పిల్లలు  situationship లాంటి వాటిని ఉపయోగిస్తున్నారు అనిపిస్తుంది. కాబట్టీ గుడ్డిగా ఈ తరమంతా తప్పు అనడం సరికాదు.

ఇదే విషయం భాషలోనూ వర్తిస్తుంది. నిజానికి మా తరంలో 90శాతం వారిని తరగతి పుస్తకాలు తప్ప, ఇతర పుస్తకాలు పుచ్చుకోనివ్వలేదు. తెలుగు వల్ల రూపాయి పైసా ఉపయోగం లేదు అని చెప్పారు. ఇంగ్లీషు, వీలైతే జర్మన్, జపనీస్ నేర్చుకోండి తెలుగు ఎందుకు అన్నారు. Whatsapp లాంటి మాధ్యమాల్లో వాడే తెంగ్లీషే తెలుగు భాషకు అనధికారిక లిపిగా మారింది మా తరానికి, తరువాతి తరానికి. నిజానికి తెలుగు సాహిత్యంలో readership కూడా చాలా వరకూ తగ్గిపోయింది. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతీదానికి పునర్వైభవం తిరిగి వస్తుంది. అదే జరుగుతోంది తెలుగు సాహిత్యానికి. 

మళ్ళీ అందరూ పుస్తకాలు చేతబడుతున్నారు. రాసేవాళ్ళు, చదివేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. చాలా నాణ్యమైన కాంటెంట్ వస్తోంది. తెలుగు సాహిత్యంలో కొత్త కెరటాలు వస్తున్నాయి. కథా వస్తువులో కూడా విస్తృతి పెరిగింది. కేవలం సాహిత్యంపైనే ఆధారపడి కెరీర్ నిర్మించుకునేవారూ పెరిగారు. తెలుగులో ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. గాలికి వంగిన పైరు తిరిగి లేచి నుంచుని ఆకాశాన్ని చూసినట్టు, సాహిత్యం తిరిగి లేస్తోంది. దిగంతాల వైపు ప్రయాణిస్తోంది. దానితో పాటు, నిశ్శబ్ధంగా గడిచిన దశాబ్ధాల్లో వచ్చిన గొప్ప సాహిత్యాన్ని కూడా celebrate చేసుకోవడం మరింత శుభపరిణామం.

ఇంతకీ ఆ heading చాలా ఆసక్తికరంగా ఉంది, ఆ విషయం కూడా చెప్పేయమ్మా అంటారా? అమ్మా..! ఆశ, దోశ, అప్పడం, వడ. నేను చెప్పనుగా. నిజానికి నేను చెప్పేదాని కన్నా, మీరు ప్రసంగంలో ఆదిత్య అన్నావఝుల గారి నుండే నేరుగా వింటే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే, తెలుగులో new age సాహిత్యం మొదలైంది. కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భాషాపరంగా. జనానికి తెలుగు కన్నా ఆంగ్ల పదాలపై ఆధారపడడం ఎక్కువ అయింది. నన్నే తీసుకోండి, 15కు పైగా ఆంగ్ల పదాలు వాడాను ఈ వ్యాసంలో. అవి ఆంగ్లలో ఉంటేనే ఆ సందర్భంలో సరిగ్గా అతుక్కోవడం ముఖ్య కారణం. కానీ అందులో 30శాతం వరకూ avoid చేయచ్చు.

అదే జరుగుతోంది అన్ని చోట్లా. అవసరం అయిన చోట కూడా తెలుగు రెండో choice గా మారిపోయింది. సరే, అన్నీ నేనే చెప్పేస్తే మీరు ప్రసంగం ఏం చూస్తారు? ఈ కింది లింకులో ప్రసంగాన్ని చూడండి. ‘Telugu Collective’ అనే Instagram page ను నిర్వహిస్తున్న ఆదిత్య అన్నావఝుల గారు తెలుగు సాహిత్యంలో, readershipలో వచ్చిన మార్పుల గురించి చాలా తీరువగా మాట్లాడారు. ఆయన ధృక్పధం, అవగహనా తీరు చూసి భలే బాగా అనిపించింది. ఇలాంటి సరైన outlook మంచి భవిష్యత్ ను నిర్మిస్తుంది అనిపించింది. సరే, సరే నేనింక ఆపేస్తాను. మీరు పూర్తి వీడియోను ఈక్రింది లింకులో చూసేయండి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :