'ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా' అన్నాడు రామదాసు. అదే రామదాసు 'తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ' అంటూ రాముడొక్కడే చాలు అంటూ చాటాడు. ఆవిడ ఓరకంటితో రావణున్ని చంపగలిగే శక్తి ఉన్నా, ఆ ఘనత నీకు కట్టబెట్టడానికి ఆ పని చేయలేదు అన్నాడు త్యాగరాజు 'మా జానకి చెట్టబట్టగా మహరాజువైతివి ' కీర్తనలో. నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాల సుఖమా' అంటూ నిలవేసి ప్రశ్నించాడు ఆ త్యాగరాజే మనందరినీ.
ఇక మన సినిమా తరానికి వస్తే 'నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంటా' అనేశారు కొసరాజు. ఇలా మాటలనిపించుకోవడం రాముడికి కొత్తేమీ కాదు. 'పెట్టాలన్నా, కొట్టాలన్నా అమ్మే' అని సామెత. అలా తిట్టాలనుకోవాలన్నా, సర్వస్య శరణాగతి చేయాలన్నా రామ భక్తులకే సాధ్యం. అదంతా ఆ రాముడు వారికిచ్చే చనువు.
అలాంటి రాముడు మా దాసుకిరణ్ గారితో కూడా నాలుగు వాక్యాలు రాయించుకున్నాడు. పంతులమ్మ సినిమాలో 'మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ' అనే పాటకు తనదైన శైలిలో మూడో చరణం రాసి శ్రీరాముడికి సమర్పించుకున్నారు కిరణ్ గారు. ఈ వారం విడుదలైన న్యూస్ లెటర్ లో ఆ పాటకి తన విశ్లేషణతో పాటు, తాను రాసుకున్న 3వ చరణం ఉన్నాయి. కిరణ్ గారి మిత్రులు శ్రీ రవిశంకర్ గారు పాడిన ఆడియో లింకు ఇస్తున్నాం. విని, ఆనందించండి.
పంతులమ్మ సినిమాలో మనసెరిగినవాడు మా దేవుడు పాట వ్రాసింది వేటూరి సుందర్రామూర్తి గారు. అందులో సరళమైన పదాలతో శ్రీరాముడిని దివ్యంగా దర్శింపజేశారు వేటూరి.రామ నామ మహిమో, వేటూరి అక్షర పటిమో తెలియదు కానీ, పాట విన్నప్పుడల్లా ఈ పాటలో ఇంకో చరణమన్నా ఉంటే బావుంటుందని అనిపిస్తూ ఉంటుంది నాకు.
రాముడు నా మనసెరిగాడో ఏమిటో, పోతనలోకి తాను వచ్చి అల వైకుంఠపురములో.. పద్యాన్ని పూరించినట్టు, కాసేపు వేటూరి గారి అంశను నాలో ప్రవహింపజేసి, నా చేత ప్రయత్నం చేయించి, ఈ ఫలితం అందజేసాడు.
చరణం 3:
ప్రతి ఎదలో రామ, ఆలయముండిన నాడు
ప్రతి అడుగు రామ బాటనుండిన నాడు
ప్రతి నోట రామ జపము జరిగిన నాడు
పేరు తలచిన చోట శుభము కలిగేతీరు
పేరు పలికిన పూట అభయముండేతీరు
పేరు పాడిన నోట శుభశకునమే ఊరు
కొలిచెదమూ రండు రాముని ఆర్తితో
మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ
ఇది పాడి వినిపించమని నా స్నేహితుడు రవిశంకర్ ని కోరగా అతను ఈ రికార్డింగ్ పంపాడు. మీరు విని మీ అభిప్రాయం చెప్పండి.
https://youtu.be/fhaZ4plzeVI
వేటూరి సరళమైన పదాలను వాడుతూ, అక్షరాల అమరికలో చిన్న మార్పులతోనే భావ గాంభీర్యతను ఆవిష్కరించడంలో నిష్ణాతులు. అయితే, ఎంత బాగా వ్రాసినా, మంచి బాణీ, గాయకులు కుదరనిదే, అది పాటగా మారి పూర్తిగా పరిమళించదు. రాజన్-నాగేంద్రాల బాణీ, సుశీలమ్మ అమృత గళం ఈ పాటను ఇంకో స్థాయికి తీసుకువెళ్లాయి.
ఒక్కసారి ఆ పాటను వినండి.
https://www.youtube.com/watch?v=gWN1aTH5j2Q
పల్లవి:
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ
పాట మొదటి పంక్తి లో సుశీలమ్మ శ్రీ…రాముడు అనే విధానమే మనలను వెంటనే సమ్మోహితులను చేస్తుంది.
మధుర మధుర తర శుభనాముడూ…గుణధాముడు ||మనసెరిగినవాడు||
చరణం 1:
ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
చరణం మొదటి పంక్తి లో కేవలం మూడే మూడు గుణింతాలను మార్చి రెండవ పంక్తిలో విరుద్ధ భావం పలికించడం, ఆహా అనిపిస్తుంది.
మానవుడై పుట్టి మాధవుడై నాడు
ఈ పాటలో ఇంకో ప్రధాన ఆకర్షణ, మృదంగం. ఇక్కడ నుంచి పాట పరిగెడుతున్నట్టు ఉంటుంది.
తలచిన వారికి తారకరాముడు
పిలిచిన పలికే చెలికాడు సైదోడు
కోలువై ఉన్నాడు కోదండరాముడు
మన తోడుగా నీడగా రఘురాముడు ||మనసెరిగినవాడు||
చరణం 2:
కరకు బోయను ఆది కవిని చేసిన పేరు
గరళ కంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఈ పంక్తిలో శబ్దాలంకారం వలన పేరు దొర్లుకుంటూ తరలిచివనట్టుగానే అనిపిస్తుంది
ఇహపర సాధనకు ఇరువైన పేరు
ఇరువైన అనే పదానికి అర్థం నాకు తెలియలేదు. నిఘంటువు చూస్తే ‘సరియైనది’ అని తెలిసింది.
శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు
శబరి ఎప్పుడూ రామనామ స్మరణ చేసేది అనే భావనను, శబరి నోట్లో లాలాజలాన్ని గంగతో పోల్చి, తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో చేయించే చక్ర స్నాన ఘట్టం లోలా, రామ నామం అందులో మునకలువేసినట్టు చిత్రించారు. ఎంత గొప్ప కవిత్వ పటిమ.
హనుమ ఎదలొ భక్తి ఇనుమడించిన పేరు
పాటలో ద్విత్త్వాక్షరాలను వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లయకు అంతరాయం కలుగుతుంది. ‘భక్తి’ తరువాత ‘ఇనుమడించిన అనటంతో’ (ఇ+ఇ) పాట సాఫీగా సాగిపోతుంది.
రామ రామ అంటే కామితమే తీరు
‘కామితము’ పదానికి కూడా అర్థం వెతకవలసి వచ్చింది. కామితము అంటే ‘కోరిక’ ట.
కలకాలము మమ్ము కాపాడు పేరు ||మనసెరిగినవాడు||
ముందు చెప్పినట్టు ఇక్కడ కొచ్చేసరికి ఇంకో చరణం ఉంటే బాగుండేది అనిపించేది. ఆ కామితము నేడు తీరింది 🙂
జై శ్రీ రామ్.
🙏
దాసు కిరణ్