స్కార్లెట్ నాకు Guilty Pleasure

Meena Yogeshwar
February 20, 2025

స్కార్లెట్ అనే పాత్ర. అత్యంత స్వార్ధపరురాలు, పొగరుబోతు, తన అందం, ఆకర్షణీయ గుణాలు అంటే విపరీతమైన విశ్వాసం ఉన్న అమ్మాయి, వాటిని తన స్వార్ధం కోసం వాడి, ఎలాంటివారినైనా లొంగదీసుకోగల చాకచక్యం ఉన్న ఒక అమ్మాయి కథ చదివితే....

‘మీనా మంచి అమ్మాయి’ అనిపించుకోవడం ఎంత కష్టమో నన్ను అడగండి చెప్తాను. నాకు చిన్నప్పుడు మా మేనత్త కూతురు జయశ్రీ చాలా మంచి స్నేహితురాలు. పండగలకి, సెలవలకి మా నాన్నగారి అన్నదమ్ముల పిల్లలం అందరం మా ఊరు కంచుమర్రులో కలుసుకునేవాళ్ళం. మిగిలినవాళ్ళందరూ చెట్లెక్కి, పుట్లెక్కి, కాలువల్లో ఈతలు కొట్టి మామూలు పిల్లలు చేసే అల్లరి చేసేవాళ్ళు. నేను, జయ మాత్రం ఆ వయసులోనే మంచి కళా పోషకులం. 

అందరి ఇళ్ళకూ వెళ్ళి, వాళ్ళని అడిగి పూవులు కోసుకోవడం. వాటి అందాన్ని గురించి గంటలు గంటలు చర్చించుకోవడం. మాలలు కట్టించుకుని తలలో పెట్టుకుని మురిసిపోవడం. పొలాలకు వెళ్ళి అక్కడి ప్రకృతిని చూసి పులకరించడం. సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు వీక్షించడం. ఇంట్లో బుద్ధిగా కూర్చుని లక్కపిడతలు ఆడుకోవడం. అందులో ఉత్తుత్తి అన్నాలు వండి పెద్దవాళ్ళందరికీ వడ్డించడం. వాళ్ళు మా అణకువ ఆటలు చూసి మురిసిపోవడం. ఇవీ మా ఇద్దరి కాలక్షేపం.

ఊరెమ్మట పడి ఆటలు ఆడిన ఇతర కజిన్స్, అక్కా, అన్నయ్యలకు పెద్దవాళ్ళు మమ్మల్నిద్దర్నీ ఆదర్శంగా చూపేవాళ్ళు. మాలాగా మంచి ఆటలు ఆడుకోమని వాళ్ళకి క్లాసులు పీకేవారు. పెద్దాళ్ళు పక్కకెళ్ళాకా వాళ్ళందరూ మమ్మల్ని ఉతికేవారు. మేము పెద్ద పేరక్కల్లాగా చూరు పుచ్చుకుని వేళ్ళాడుతూ పిచ్చి ఆటలు ఆడడమే కాక, పెద్దాళ్ళతో వాళ్ళని తిట్టించామని వాళ్ళ కోపం. తప్పులేదు మరి, పెద్దాళ్ళు మమ్మల్ని పొగుడుతుంటే మా మొహాలు చూడాలి. గర్వంతో ఊగిపోయేవాళ్ళం. వాళ్ళ మొహాలు చూడాలి అసూయతో రగిలిపోయేవి. ఆ పొగడ్తలు, మంచిపిల్లలు అనే ట్యాగ్ ల కోసం మా కష్టం అంతా ఇంతానా?

వాళ్ళలా ఆడుకోవాలని, అల్లరి చేయాలనీ మాకూ ఉండేది. కానీ మాలో ఒక మౌలికమైన వ్యక్తిత్వం అలాంటి ఆటలు అంటే ఇష్టపడకపోవడమే కాక, పెద్దాళ్ళు ఇచ్చే ఆ “మంచి” అనే బిరుదు చేజారిపోతుందనే భయం మమ్మల్ని ఆపేవి. వెనక్కి తిరిగి చూసుకుంటే, అప్పటి మా ప్రవర్తన నాకు నచ్చదు. అతి చిన్న వయసులోనే Validation వెనక పరుగులు తీస్తూ, సరిగ్గా ఆడుకోవడమే మర్చిపోయాను అనిపిస్తుంది. అలాగని నేనేం పెద్ద అమాయకురాల్ని ఏమీ కాదు. పెద్దాళ్లకి తెలియకుండా చేయగలిగే అల్లర్లు నిరభ్యంతరంగా చేసేసేదాన్ని. 

కానీ  మనసులో ఓ మూల ఉండే అంతరాత్మ ఘోషించేది. నీ లక్ష్యం ఏమిటి? నువ్వు చేసే అల్లర్లు ఏమిటి అని. ఆ దిక్కుమాలిన అంతరాత్మే ఎన్నోసార్లు నన్ను నన్నుగా ఉండనివ్వలేదు. మాయదారి గోల. ఇప్పటికీ అదే బాధ. ఈ మంచి అనిపించుకోవడం అనేది ఓ పెద్ద జబ్బు అని ఇంకో అంతరాత్మ చెప్తుంటుంది. దానివల్ల నిన్ను నువ్వు కోల్పోతావు, people pleasure గా మారిపోతావు, వారికి లోకువ అయిపోతావు అంటుంటుంది ఈ సదరు అంతరాత్మ. 

ఎప్పుడూ నాలో ఒకటే మ్యూజిక్కు ఈ ఇద్దరు అంతరాత్మల వలన. పాత సినిమాల్లో హీరోయిన్ ఎదురుగా నల్ల చీర, తెల్ల చీర కట్టుకుని ఇద్దరు అంతరాత్మలు నుంచుని, మంచి-చెడు చెప్తుంటాయి చూశారా. నాది అదే పరిస్థితి. అలాంటి నాకు, స్కార్లెట్ ఒహెరా ఒక Guilty Pleasure కావడంలో ఆశ్చర్యం లేదేమో. ఇంతకీ ఈ స్కార్లెట్ ఎవరు? నీకు ఆమెకు ఏమిటి సంబంధం. అవేమీ చెప్పకుండా, ఊహూ సోది చెప్పుకుపోతావ్ ఏంటమ్మాయ్ అంటారా? అదే, అక్కడికే వస్తున్నా.

సుమారు నా 20వ ఏట మొట్టమొదటిసారి, ‘గాన్ విత్ ద విండ్’ నవల తెలుగు అనువాదం ‘చివరకు మిగిలింది’ చదివాను. ఎం.వి. రమణారెడ్డి గారు అనువదించారు దీనిని. ఈ నవల ఒక english classic. ఒకానొక సమయంలో బైబిల్ తరువాత అత్యంత ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన నవలగా చరిత్ర సృష్టించింది. రచయిత మార్గరెట్ మిచెల్, రాసిన ఏకైక నవల ఇది. మొదటిసారి ఈ 512 పేజీల పుస్తకాన్ని మెరుపు వేగంతో చదివేశాను. మూలాలతో సహా ఊపేసి, కుదిపేసింది నన్ను ఈ నవల.

నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. చారిత్రిక నవలలు, చారిత్రిక సంఘటనలను చిత్రించిన నవలలు అంటే ఇంక చెప్పక్కర్లేదు. అలాంటి నాకు, అప్పటికి అమెరికా గురించి ఇసుమంతైనా తెలియని నాకు, 1860ల్లో అమెరికాలో జరిగిన అంతర్యుద్ధం, బానిసవిధాన రద్దు వంటి అతి ముఖ్యమైన ఘట్టలలో సామాన్య జీవనాన్ని చిత్రించే నవల చదవడమంటే నా పరిస్థితి మీరే ఊహించుకోవచ్చు.

అంతకన్నా ముఖ్యమైనది, స్కార్లెట్ అనే పాత్ర. అత్యంత స్వార్ధపరురాలు, పొగరుబోతు, తన అందం, ఆకర్షణీయ గుణాలు అంటే విపరీతమైన విశ్వాసం ఉన్న అమ్మాయి, వాటిని తన స్వార్ధం కోసం వాడి, ఎలాంటివారినైనా లొంగదీసుకోగల చాకచక్యం ఉన్న ఒక అమ్మాయి కథ చదివితే, నాలాంటి ‘మంచిపిల్ల’ ట్యాగ్ కోసం పాకులాడే అమ్మాయికి విరక్తి, చిరాకు, అసహ్యం కలగాలి కదా. కానీ కలగలేదు. సరికదా, ఆమెలోని కొన్ని గుణాలు నేనూ నేర్చుకుంటే బాగుండును అని పదే పదే అనిపించింది.

అవేంటంటే, నలుగురు ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోకపోవడం, మంచి పేరు కోసం కాక, మంచి జీవితం కోసం కష్టపడడం, అంతటి యుద్ధంలోనూ తననూ, తన వారినీ బతికించుకోవడానికి మొండి ధైర్యం కలిగి ఉండడం, సమాజం ఇచ్చే బిరుదులు, ఛీత్కారాలను లెక్కచేయకపోవడం. ఆ లక్షణాలు చూస్తే నిజంగా స్కార్లెట్ ను అనుసరించబుద్దవుతుంది నాకు. నేను చాలా సందర్భాలలో, ముఖ్యంగా నా జీవితంలో కీలక ఘట్టాలలో people pleasing  మానేసి, నా కోసం నేను నిలబడ్డ సందర్భాలలో నాకు ఆసరా ఇచ్చిన పాత్ర స్కార్లెట్.

ఆమెను, జీవితాన్ని, సమాజాన్ని చూశాకా చాలా ఆలస్యంగా తెలిసిన విషయం ఏమిటంటే, మనం ప్రతీ ఒక్కర్నీ ఒప్పించలేం. ప్రతీ ఒక్కరి చేత ‘మంచి’ అనిపించుకోలేం. మహా మహా రాముణ్ణి, సీతని, కృష్ణుణ్ణి కూడా ఇష్టపడని వాళ్ళున్నారు. గాంధీ, సుభాష్ బోస్ వంటివారంటే కూడా నచ్చనివారున్నారు. అంతటి వారు, అంత చేసిన వారే అందరినీ మెప్పించలేకపోతే, నేనెంత అనిపిస్తుంది. అందుకే, ‘స్కార్లెట్ ఒహెరా నాకు guilty pleasure’. ఆమెను పూర్తిగా ఇష్టపడలేను, అలాగని కోపగించలేను.

Tap to Listen

ఈ పుస్తకం ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో నాకు గుర్తులేదు. బహుశా, ఓ పదిసార్లు చదివి ఉంటాను. చదివిన ప్రతీసారీ పరుగులెత్తించే ప్రవాహమే. అయితే, ఈ నవల ఉన్న 512 పేజీలే కాక, నాకు మరో పావుపేజీ అంటే చాలా ఇష్టం. ఈ నవల రెండోసారి చదివేటప్పుడు నాకు ఒక ధృక్పధంతో చదవడానికి ఉపయోగపడిన పావు పేజీ అది. అదే ఈ నవలపై తన అభిప్రాయాన్ని మా అన్నయ్య పవన్ రాసిన పేరా. సాధారణంగా, తను చదివే ప్రతి పుస్తకం వెనుకా, తన అభిప్రాయం ఒక పేరా నుంచి ఒక పేజీ దాకా రాసేవాడు. అవన్నీ నాకు దిక్సూచిలా పనికి వచ్చేవి. ఆ పేరా ఏమిటంటే,

‘అద్భుతం, స్కార్లెట్ ఒక మనిషి కాదు, ఆమే అమెరికా అంతర్యుద్ధ కాలం నాటి దక్షిణాది. యుద్ధానికి ముందు తరమే యాష్లీ, తర్వాతి తరమే రెట్ బట్లర్. ఇది అమెరికా ఆత్మకథ కాదు కాదు దక్షిణాది ఆత్మకథ’ - పవన్(21-12-2011).

ఇలాంటి ఒక కళ్ళజోడు లభిస్తే, ఇంకేం కావాలి చెప్పండి. నాకు చాలా పుస్తకాలకు అది పవన్ ద్వారా దొరికింది. ఇంతకన్నా పెద్ద పెన్నిధిని తెలుగు సాహిత్యానికి అందించారు ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ, తెలుగు క్లాసిక్స్ ను మనకు పరిచయం చేశారు. అందులో భాగంగానే ఈ నవలపై విశ్లేషణ కూడా రాశారు. దానినే ఈ వారం విడుదల చేస్తున్నాం. త్వరలోనే ఈ పుస్తకం కూడా తీసుకురావడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానని మీకు మాట ఇస్తూ, దానికి ముందుమాట అన్నట్టుగా ఈ విశ్లేషణ వినేయండి ప్రస్తుతానికి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :