సేవకు సంకెళ్ళు??

Meena Yogeshwar
September 10, 2024

సన్యాసులు/సన్యాసినులకు 'నా'అన్న స్పృహ ఉండదు. కోరికలు, ఇష్టా ఇష్టాలు, రాగ ద్వేషాలు ఉండవు. ఎంతసేపు దేవుడు, సమాజం అంతే. అంత స్వీయ స్పృహ లేకుండా ఎలాంటివారైనా ఎలా ఉండగలుగుతారు? మానవ సహజమైన కోరికలు కూడా ఎలా అధిగమిస్తారు అనేది ఎప్పటికీ తీరని ప్రశ్న. పైగా ఆ జీవితం కూడా ఎంతో కష్ట భూయిష్టమైనది. కఠోర నియమాలు, నిబంధనలు అడుగడుగునా ఉంటున్నా, దేవుడిపై మనసు ఎలా లగ్నం చేస్తారో, వారి సాంప్రదాయాన్ని తూచ తప్పకుండా ఎలా పాటిస్తారో అర్ధమే కాదు. వాళ్ళ ఆలోచనా విధానం, ఈ పద్ధతుల పట్ల వాళ్ళ నిబద్ధత, సమయపాలన అంతా అబ్బురపరుస్తాయి. సంసార విషయాలపై విరాగులై ఉంటారని తెలుసు. వారిని నడిపే శక్తి ఏమిటి అనేది....

మీకు ముందే చెప్పేస్తున్నాను. అసలు ఈ న్యూస్ లెటర్ రాయడానికి నేను పనికిరాను. ఎందుకంటే నాకు ఈ విషయంపై అసలు అవగాహన లేదు. నేను చదువుకునేటప్పుడు కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళలో చదువుకోకపోవడం వలనో ఏమో క్రిస్టియానిటీ గురించి కానీ, నన్స్ జీవితం గురించి గానీ నాకు ఏ మాత్రమూ తెలియదు. రెండు వేర్వేరు మతాలను, వేర్వే అంతస్థుల్లో ఉండే వారి జీవితాలనూ పోల్చడం సరైన పని కాదు. 

అయితే నన్స్ లాగా జీవితాన్ని దేవుడి సేవకు, ప్రజా సేవకు అంకితం చేసేవాళ్ళు నా మతంలో పీఠాధిపతులు, సన్యాసులు కాబట్టే, నాకు తెలిసిన రిఫరెన్స్ వారిదే. అయితే వారి జీవితం, వారి మార్గం, వారి పద్ధతులు, కట్టుబాట్లు, స్థాయి అన్నీ చాలా వేరు. కానీ సంసారాన్ని వదిలివేసి ఆధ్యాత్మిక చింతనలో జీవితం గడపడం మాత్రమే నేను వీరిద్దరిలో చూసిన కామన్ విషయం. కాబట్టీ ఇలా పోలుస్తున్నందుకు ఎవరూ నన్ను తప్పు పట్టుకోరు అని ఆశిస్తున్నాను.

కంచి పీఠాధిపతులనో, శృంగేరీ పీఠాధిపతులనో చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. వారికి 'నా'అన్న స్పృహ ఉండదు. కోరికలు, ఇష్టా ఇష్టాలు, రాగ ద్వేషాలు ఉండవు. ఎంతసేపు దేవుడు, సమాజం అంతే. అంత స్వీయ స్పృహ లేకుండా ఎలాంటివారైనా ఎలా ఉండగలుగుతారు? మానవ సహజమైన కోరికలు కూడా ఎలా అధిగమిస్తారు అనేది నాకు ఎప్పటికీ తీరని ప్రశ్న. పైగా ఆ జీవితం కూడా ఎంతో కష్ట భూయిష్టమైనది. కఠోర నియమాలు, నిబంధనలు అడుగడుగునా ఉంటున్నా, దేవుడిపై మనసు ఎలా లగ్నం చేస్తారో, వారి సాంప్రదాయాన్ని తూచ తప్పకుండా ఎలా పాటిస్తారో నాకు అర్ధమే కాదు.

కంచి స్వామి వారి దినచర్యలో కొంచెం భాగం తెలుసుకున్నప్పుడు నాకు ఎంత ఆశ్చర్యమేసిందో. తెల్లవారుఝామునే లేస్తారట, ఎంతటి చలిగా ఉన్నా, జ్వరంలో ఉన్నా సరే తప్పకుండా తలపై నుండి స్నానం చేస్తారట. మూడు, నాలుగేసి గంటలు నిటారుగా, కొంచెం కూడా కదలకుండా చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. అది అయిపోయాకా మళ్ళీ భక్తులకు తీర్ధం, ఆశీర్వాదం ఇస్తారు. వారితో మాట్లాడాలనుకునే వారికి అనుమతి ఇస్తారు. ఎందరో భక్తులతో మాట్లాడతారు. నియమంగా మితమైన ఆహారం. ఇష్టమైన వస్తువు అంటూ ఏమీ ఉండదు. మళ్ళీ సంధ్యా సమయానికి ఇంకో 3-4గంటలు మళ్ళీ చంద్రమౌళీశ్వరారాధన. రాత్రి మళ్ళీ భక్తులకు సమయం. ఏ ఒంటిగంటికో పడుకుని, తిరిగి తెల్లవారుఝామున లేవడం. నాకైతే కళ్ళు తిరుగుతాయి ఇలా ఒక్క రోజు ఉండాలంటే.

సన్యాస జీవితం అంత కష్టమా అనిపిస్తుంది నాకు. వాళ్ళ ఆలోచనా విధానం, ఈ పద్ధతుల పట్ల వాళ్ళ నిబద్ధత, సమయపాలన అంతా అబ్బురపరుస్తాయి. నాకు హిందు సన్యాసుల జీవితంఏ అరకొర తెలుసు, ఇక క్రిస్టియన్ నన్ లు, ఫాదర్ ల గురించి, వాళ్ళ పద్ధతులు, నియమాల గురించి ఇంక అస్సలు తెలియదు. అయితే, వారికి కూడా ప్రార్ధనా సమయాలు, కట్టుబాట్లు, బట్టల దగ్గర నుంచి ప్రతి దాని విషయమలోనూ నియమాలు ఉంటాయని మాత్రం తెలుసు. వారు కూడా సంసార విషయాలపై విరాగులై ఉంటారని తెలుసు? వారిని నడిపే శక్తి ఏమిటి అనేది కూడా అప్పుడప్పుడు నన్ను ఆలోచింపజేస్తుంది. నిజంగా ముక్తి పొందాలంటే అందరూ ఈ దారినే నడవాలా? అందరికీ సాధ్యమేనా? అసలు అందరికీ ఈ దారి సరైనదేనా? ఇలా బోలెడన్ని సందేహాలు ఉండేవి. 

అయితే, ఇలా నియమాలు, నిబంధనలు అందరికీ సరిపోయే విషయం కాదు అని ఈ నవల విశ్లేషణ విన్నాకా అర్ధమైంది. కొందరు ఆ నియమాల సహాయంతో దైవభక్తి, సమాజ సేవకు అలవాటుపడగలరు. అదే వారిని నడిపించే శక్తి అవుతుందని. అయితే కొందరు ఆ నియమాల చట్రంలో ఇరుక్కోలేనివారు, స్వేచ్ఛకు అలవాటు పడినవారికి ఆ దారి పనికి రాదని అర్ధమైంది. కేథరిన్ హ్యూం అనే అమెరికన్ రచయిత్రి, తన స్నేహితురాలైన బెల్జియం కాంగోకు చెందిన మాజీ నన్ సిస్టర్ లూక్ జీవితం ఆధారంగా ఈ నవల రాసింది. 

ఇందులో 20ఏళ్ళ పాటు నన్ గా బ్రతికి, ఆ జీవితంలోని కష్ట సుఖాలను తెలిసిన ఒక నన్, ఆ సన్యాస జీవితంలో నుంచి ఎందుకు బయటకు వచ్చిందో వివరిస్తుంది రచయిత్రి. సేవకు, దేవునితో అనుబంధానికి కట్టుబాట్లు ఆమెకు సహాయం చేయకపోగా, అడ్డంకిగా మారతాయి. అవే ఆమె ఆ జీవితాన్ని వదిలివేసేందుకు కారణం అవుతాయి. ఈవారం ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారి విశ్లేషణ విడుదల అవుతోంది.

Tap to Listen

ఏమో, నాకైతే నియమాలు కొంతమేరకు దైవారాధనలో సరైనవే అనిపించినా, ఎక్కువగా స్వేచ్ఛ కోరుకునే మనిషిగా ఆ జీవితం చాలా కష్టంగా తోస్తుంటుంది. అందుకే మన ధర్మంలోని సన్యాస జీవితంలో ఉన్నవారినైనా, ఇలా ఇతర మతాలవారినైనా వారి మనస్తితి అర్ధం చేసుకోగలిగేలా ఇంటర్వ్యూ చేయాలన్నది నా అతిపెద్ద కోరిక. దానికి ఈ నవల మొదటి మెట్టులా ఉపయోగపడింది నావరకూ. ఏమో భవిష్యత్తులో చేయగలుగుతానేమో. అందుకే మీరూ విని చూడండి. మీకు ఈ తరహా జీవన విధానంపై ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు చెప్పండి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :