నేను ఇప్పటికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి జీవితంపై వచ్చిన నవలలు రెండు చదివాను. మొదటిది ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర గారు రాసిన ‘మనోధర్మపరాగం’, రెండవది పల్లవి గారు రాసిన ఈ పుస్తకం ‘సుస్వరాలలక్ష్మి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి’. మొదటిది బాహాటంగా ఎమ్మెస్ జీవిత కథ అని చెప్పకపోయినా, చదివనవారందరికీ స్ఫురించినది ఎమ్మెస్ జీవితమే. రెండు నవలలూ సాగే తీరు, కథనం, తీసుకున్న stand అన్నీ వేరు. కానీ కొన్ని మాత్రం రెండిట్లోనూ ఒకేలా ఉన్నాయి.
అవి, సుబ్బులక్ష్మి గారి భర్త సదాశివం గారు సుబ్బులక్ష్మి గారి ప్రతి విషయంలోనూ నిర్ణయం తీసుకునేవారని. ఆయనకు, ఆమెకు కూడా ఆమె పుట్టిన దేవదాసి మూలాలపై అయిష్టం ఉండేదని. ముఖ్యంగా సదాశివంగారు వీలైనంత వరకూ ఎమ్మెస్ గారి చిన్నతనాన్ని దాచేందుకు ప్రయత్నించారని. ఎంతవరకూ అంటే, ఆమె స్వంత ఊరు మధురై వెళ్ళడం కానీ, ఆమె తల్లి షణ్ముగ వడివును కలవడం కానీ ఆయనకు సుతరామూ ఇష్టం లేదని, చాలా సందర్భాల్లో అడ్డుపడేవారని. తన నుంచి తన కూతుర్ని దూరం చేసిన వాడు అనే భావన ఆమె తల్లికి కూడా సదాశివం గారిపై ఉండేదని.
సదాశివం గారు మార్కెటింగ్ లో దిట్ట అని. తన తెలివితేటల్ని, శక్తిని, పరిచయాలని ఎమ్మెస్ గారిని ప్రపంచానికి పరిచయం చేయడానికి నూటికి నూరు శాతం ఉపయోగించి, విజయం సాధించారని. తన పత్రిక కల్కి ద్వారా ఎమ్మెస్ ప్రతీ కచేరీని జాగ్రత్తగా ప్రజలకు చేరవేశారని. సదాశివం గారే లేకపోయి ఉంటే, అప్పటి మరో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు డి.కె.పట్టమ్మాళ్ లాగా ఎమ్మెస్ ప్రతిభ కేవలం తమిళనాడు, కర్ణాటక సంగీత ప్రియులకు మాత్రమే తెలిసేదని. ముఖ్యంగా కేవలం సేవకు మాత్రమే ఇచ్చే ‘రామన్ మేగససే’ పురస్కారం ఎమ్మెస్ కు రావడానికి సదాశివం గారు ఆమె చేత చేయించిన లెక్కలేనన్ని దాన కచేరీలే కారణమని.
ఈ రెండు పుస్తకాలూ చదివినప్పుడు కొన్ని విషయాలు నాకు అర్ధం కాలేదు. ఒకటి, దేవదాసి మూలాలంటే అంత విముఖత ఉన్నా సదాశివంగారు సుబ్బులక్ష్మి గారి గతాన్ని అందరికీ తెలిపే ముందు పేర్లు మధురై షణ్ముగ వడివులను ఎందుకు తీయలేదు? ఆయన ఆమెను అంత control చేస్తున్నా, ఎమ్మెస్ ఎందుకు ఎదురు తిరగలేదు? కట్టే చీర దగ్గర్నుంచీ, కచేరీలో పాడాల్సిన పాట వరకూ భర్తే నిర్ణయిస్తుంటే ఎందుకు ఊరుకున్నారు? ఒక సమయంలో నాకు ఎమ్మెస్ గారి మీద కోపం కూడా వచ్చింది. కొన్ని విషయాలలో personal choice ఉండదు, ముఖ్యంగా తమపై జరిగే అణచివేతకు. వారిని చూసి ఎందరు ఇది సాధారణ విషయమే అని ఆ వలయంలో ఉండిపోతారో కదా. ఆమె అలా చేయకుండా ఉండాల్సింది అని అనుకున్నాను.
పైగా సదాశివంగారు కూడా ఆమెను అన్ని విషయాలలోనూ బాగా చూసుకుని, ప్రేమగా ఉన్నా కూడా అంత అదుపు విధించడం కూడా నాకు నచ్చలేదు. ముఖ్యంగా ఆమె కళపై కూడా ఆయన పెత్తనం నాకు నచ్చలేదు. అయితే, ఆలోచించగా.. ఆలోచించగా నాకు వీటికి సమాధానాలు దొరికాయి. మొదట సదాశివం గారి విషయానికి వస్తే, ఆయన ఆమె కచేరీలు, వాటిలో పాడాల్సిన పాటలు విషయంలో నియంత్రణ పెట్టడానికి కారణం, బహుశా ఎమ్మెస్ ను ఒక బ్రాండ్ గా నిర్మించే భాగంలో ఒక బ్రాండ్ మేనేజర్ గా ఆయన పని చేశారు అనిపించింది. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు తమను ఒక బ్రాండ్ మేనేజర్ కు అప్పగించి, వారు చెప్పినట్టే తమ public image ను నిర్మించుకుంటారు. ఆ విషయంలో కూడా జరిగింది అదే అనిపించింది.
ఇక భర్తగా ఆయన నియంతృత్వ ప్రవర్తన గురించి ఒకటే సమాధానం తట్టింది. త్రివిక్రమ్ గారు ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో సుహాసిని గారి చేత ఒక మంచి డైలాగ్ చెప్పించారు. ‘మీ మావయ్య మంచి వాడు కాదు, అలాగని చెడ్డ వాడూ కాదు, మొగుడు అంతే’. ఆ డైలాగ్ నేను ఎందరి మగవాళ్ళ విషయంలోనో నిజం కావడం చూశాను. నాకన్నా పెద్దవారే అయినా నా దగ్గర స్నేహితురాలు ఒక మాట అంటారు. ‘చాలామంది మగవాళ్ళు తండ్రిగా, కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, బావగారిగా, మరిదిగా, మావగారిగా చాలా మంచివాళ్ళు కానీ, భర్తగా మాత్రం ఆ మంచితనం నిలవదు. భార్యలను granted గా తీసుకునే మగవాళ్ళే ఎక్కువ’ అని. ఈ రెండు డైలాగ్ లూ సదాశివంగారి విషయంలోనూ నిజం అని అనిపించింది. ఆయన ఒక సాధారణ సగటు భారతీయ భర్త.
కానీ, అసలు సమాధానం దొరకని ప్రశ్న మాత్రం ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు. ఆమె ఆ పెత్తందారీతనాన్ని ఎలా ఒప్పుకున్నారు. ఎందుకు మార్చడానికి, మారడానికి ప్రయత్నించలేదు. ఆమెకు సామాజిక స్పృహ లేదు, ఆమెను చూసి మరో నలుగురు ఆడవాళ్ళు అలా నలిగిపోవడానికి సిద్ధమైపోతారు అని తెలియదా? అనేది నా ఆరోపణ. దీనికి సమాధానం జలంధర గారు, మా వారు చెప్పారు.
ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్ గారు మాట్లాడుతూ, చాలామందికి కుటుంబ బాధ్యతలను మౌనంగా భరిస్తూ, తమపై పెత్తనాన్ని అనుభవిస్తూ ఉండే ఆడవాళ్ళు అంటే లోకువగా ఉంటుంది. వాళ్ళు ఇతర ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారనిపిస్తుంది. రాజీ పడి బతుకుతున్న నిస్సహాయులు అనిపిస్తుంది. కానీ, అలాంటి పరిణామాల్లో కూడా వాళ్ళు తమదైన జీవితాన్ని నిర్మించుకున్నారు. వారి చుట్టూ ఉండే పరిస్థితులను అర్ధం చేసుకుని, వాటిని accept చేసి, తమ మనశ్శాంతిని ఇందులోనే వెతుక్కోవడం ఎంతటి గొప్ప విషయం. వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అంతవరకే పరిమితం చేసినప్పుడు అందులోనే తమ ప్రపంచాన్ని నిర్మించుకోవడమే కదా feminism అంటే. అందరూ ఎదురు తిరగలేరు, అందరూ ఉద్యమాలు చేయలేరు, చేయాల్సిన అవసరం కూడా లేదు అన్నారు.
మావారిని ఈ ప్రశ్న నేను అడిగినప్పుడు ‘ఆమె ఇష్టపడి, తనకు ఈ జీవితం సరైనది అనుకున్నారు కాబట్టే ఆమె ఊరుకున్నారు. ఆమె ఇష్టపడని తన మూలల నుండి బయటకు తీసుకువచ్చి, అప్పటికి తనకి ఊహల్లో మాత్రమే ఉన్న సాధారణ సాంసారిక జీవితాన్ని అందించిన గొప్ప వ్యక్తిగా సదాశివంగారిని ఆమె ఆరాధించేవారేమో ఆలోచించావా? ఎదురు తన ప్రతిభను, కళను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయనను చూసేవారేమో కదా. అలాంటప్పుడు ఈ నలిగిపోవడం, పెత్తనం కూడా ఆమెకు ఒప్పుదలగానే ఉండేదేమో’ అన్నారు. నిజమే అనిపించింది.
ఇవన్నీ ఆలోచిస్తున్న నేను, ఆమె కచేరీ వీడియో చూస్తుంటే నాకు ఏం అనిపించిందో తెలుసా? జీవితంలోని మంచిని, చెడుని ఆ దేవదేవుని పాదాల చెంత వదిలి, అన్నిటినీ ఆ దేవునికే నివేదించి, మనశ్శాంతిని బదులుగా తెచ్చుకునేవారేమో అనిపించింది. ఆమె జీవితంలో ఎక్కువ సాధన చేసిన పాట ‘శాంతము లేక.. సౌఖ్యము లేదు సారసదళ నయనా’ అనిపించింది. మీరేమంటారు? ఈ వారం విడుదలవుతున్న రెండవ భాగం విని, నాకు చెప్పండి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.