నా కనుల యెట్టయెదుటన నా జనకుని
నా జనని కుత్తుకలను కోసి నన్నెడిగెన
తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు
ఓ ప్రభూ! యగునంటి నే నొదిగి యుండి
నా కనుల యెట్టయెదుటన నా లతాంగి
ప్రాణములు నిల్వునందీసి యడిగెనను న
తండు ‘‘నే దయాంబుధిని కాదా’’ యటంచు
ఓ ప్రభూ! యగునంటి నేనొదిగి యొదిగి
తనుజు కుత్తుక నులిమి తానను నడిగెన
తండు ‘‘నే దయాంబుధిని కాదా’’
యటంచు
ఓ ప్రభూ! యగునంటి నేనొదిగి పోయి.
అన్నారు విశ్వనాథ సత్యనారాయణ. ఆనందాన్ని, బాధను, వేదనను, ఆశ్చర్యాన్ని, ప్రేమను, కోపాన్ని, పరిశీలనను ఇలా ప్రతీదాన్నీ అక్షర రూపంలో అందించిన సుకవులలో ఒకరు విశ్వనాథ. అలాంటివారి ప్రతి జీవన మలుపూ పాఠకుల పాలిట వరాలయ్యాయి. తలెత్తి చూసేందుకు, వెనకనే నడిచేందుకు తమ ప్రతి అడుగునూ తరువాతి వారి కోసం అందించిన వారు, వారి జీవుని వేదన అంతటినీ రచనల రూపంలో పాఠకుల మీద కురిపించి కరిగిపోయిన దయా మేఘాలే కవులు, రచయితలు.
ఎన్నో జన్మల నుండి తాము పోగేసుకున్న నవ్వులు, ఏడ్పులు, ప్రేమలు, విరహాలు, ఆలోచనలు, అనుభవాలన్నిటినీ కొంగున కట్టుకున్న బంగారంలా జాగ్రత్తగా తమ ఆత్మలో దాచుకుని పుడతారేమో ఈ కవి-రచయితలు. వాటిని ఈ జన్మలోనివాటితో కలిపి, తమ రచనలు అనే స్వర్ణ శిల్పాలు చెక్కుకుంటూ పోతారు. వాటిని ఏ స్థాయికి తీసుకువెళ్తారు అంటే తమను పట్టుకున్న పాఠకుడి ఆజన్మాంతం, బహుశా తరువాత జన్మలకి కూడా పట్టుకువెళ్ళగలిగినంత దృఢంగా ముద్రిస్తారు మనసులపై.
ఈ కష్టం ఎదురైనప్పుడు విశ్వనాథ అయితే ఏం చేశారు? ఈ భావం తట్టినప్పుడు కృష్ణశాస్త్రి ఎలా స్పందించారు? ఈ పూవు వాడిపోతుండడం చూస్తే కీట్స్ ఏమనుకుని ఉంటాడు? ఈ వేదన చూసినప్పుడు చలం ఏమని ఉండేవారు? ఈ సమస్యకి జలంధర గారు ఎలా పరిష్కారం చూపిస్తారు? ఇలాంటి మనస్తత్త్వం ఉన్నవారి గురించి యద్ధనపూడి వారి దృష్టి కోణం ఎలా ఉంటుంది? ఈ నగరాన్ని చూస్తే టాల్ స్టాయ్ ఏ చరిత్ర చెప్పేవారు? ఈ జీవితాన్ని కథలా చెప్పాలంటే సోమర్ సెట్ మామ్ ఏం చేసేవారు? ఈ యుద్ధాన్ని చూస్తే తిక్కన ఏం అనేవారు?
ఇలా ఆలోచిస్తారు చాలామంది పాఠకులు. తమకి ఇష్టమైన కవి, రచయితల భుజం మీద నుండి లోకాన్ని చూడడం అలావాటు కదా మరి. Relatability కొందరి సాహిత్యాన్ని మనకి దగ్గర చేస్తే, ఆ విషయంపై పూర్తిగా అవగాహన లేక, ఆ సాహిత్యం ద్వారా ఆ కొత్త ప్రపంచాన్ని explore చేయడం మరికొందరి సాహిత్యాన్ని ఇష్టపడేలా చేస్తుంది. ఇష్టం ఎలా పుట్టినా, ఆ కవినో, రచయితనో మన స్వంత మనుషులంత దగ్గర చేయడం మాత్రం నూటికి తొంభై సార్లు జరిగే తీరుతుంది. ఇక అక్కడి నుండి ఆ రచనలు మనపై చూపే ప్రభావం వెల కట్టలేనిది. ఈ కవి నావాడు, ఈ రచయిత్రి నా స్వంతం అనుకునే ఒక అభిమానపు బంధం చాలా అపురూపం, అమూల్యం.
సున్నితమైన పదాలతో, క్లిష్టమైన వాక్యాలను సృజించగల నేర్పరి, ఎందరో కవి, రచయితల సాహిత్యాన్ని ఔపోశన పట్టేసిన పాఠకురాలు, ఆ పఠనా సముద్రం నుండి తనదైన, తామరపూవులంతటి అందమైన పదాలతో సాహిత్యమనే సరస్సు నిర్మించి, అందులో మనందరితో మునకలు వేయించగల మనందరికీ ఇష్టమైన రచయిత్రి, డాక్టర్ మైథిలీ అబ్బరాజు గారిని ప్రభావితం చేసిన కవి, రచయితల గురించిన వ్యాసాలను ‘రససిద్ధా: కవీశ్వర:’ అనే పేరుతో లెసన్ గా రూపొందించాం.
మన విశ్వనాథ లాగానే ఎనిమిదేళ్ళ వయసులో తండ్రిని, 14ఏళ్ళ వయసులో తల్లిని, తద్వారా ఆస్తిని కోల్పోయి, ఇష్టంగా సాహిత్యం రాసుకునే స్థాయి నుండి జీవించేందుకు రాసే స్థాయికి వచ్చిన అల్ప భాగ్యుడు జాన్ కీట్స్. ఇక తాను డబ్బుల కోసం రాయక తప్పదు అని తెలిసినప్పుడు ఆయన రాసిన ఆఖరి కవిత ‘An ode to the autumn’. అయితే, అదే అతని చివరి కవిత అవ్వడం మరింత బాధాకరం. పాతికేళ్ళ చిరు ప్రాయంలో టి.బితో పోరాడి, ఓడిపోయిన సాహితీ సైనికునిపై మైథిలీ గారు రాసుకున్న వ్యాసం ‘రససిద్ధుని ప్రస్థానం’ ఈ లెసన్ లో మొదటి భాగంగా ఈ వారం విడుదల అవుతోంది. ముందే కూసిన ఆ కవికోకిల పాట విందామా..!
అందరికీ అద్వైతం - ప్రసంగం
నా దృష్టిలో కవులకు, సాధకులకు ఉండే సామాన్యమైన పోలిక ఏమిటో తెలుసా? ఇద్దరూ తమ జీవిత లక్ష్యాన్ని కొన్ని జన్మల నుండి పోగేసుకుంటూ తెచ్చుకుని, ఒక జన్మలో అది సాధించి, సార్ధక్యులుగా నిలిచిపోతారు. కవి రచనలు చేసి సార్ధక్యం పొందితే, సాధకులు సిద్ధి పొంది సార్ధక్యులవుతారు అనిపిస్తుంది నాకు. నేను కవిని కాదు, సాధకురాల్నీ కాదు. కానీ ఈ ఇద్దరిపైనా ఆసక్తి, మమకారం ఉన్నాయి. అందుకే కవిని చదువుతాను, సాధకుణ్ణి వింటాను.
అలా ఒక గొప్ప సాధకుని నుంచి ఎంతో తెలుసుకోగలిగే అవకాశం మనందరికీ అతిత్వరలో దొరకబోతోంది. ‘A search in the vedic India’, ‘అరుణాచలం పిలుపు’, ‘అన్వేషణ’ వంటి ఆధ్యాత్మిక రచనలు చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత శ్రీ పోడూరి వేంకటరమణ శర్మ గారు ప్రతి నెలా దాసుభాషితం నిర్వహించే ప్రసంగాలు కార్యక్రమంలో మాట్లాడబోతున్నారు.
ఏప్రిల్ మొదటి శనివారం ఉదయం 9.30గంటలకు(భారత కాలమానం ప్రకారం) ‘అందరికీ అద్వైతం’ అనే అంశంపై శర్మగారు ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దాసుకిరణ్ గారు నిర్వహిస్తారు. ఈ గంభీరమైన విషయం గురించి సాధకులు అయిన కిరణ్ గారు అడిగే ప్రశ్నలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో, వాటికి శర్మగారు ఇచ్చే సమాధానాలు మరెంత విజ్ఞానదాయకంగా ఉంటాయో నా ఊహకి అయితే తట్టడం లేదు. మరి మీకు? ఇంకో విషయం ఈ వారం కూడా శర్మగారి రచనలే spotlight లో ఉంటాయి. వినేయండి, మీ తరఫున ప్రశ్నలు సిద్ధం చేసేసుకోండి. శర్మ గారిని అడిగేద్దాం. సరేనా?
అభినందనలు,
మీనా యోగీశ్వర్.