తడిసితిమి సాహితీ వృష్టిన్ ఓ మీనమ్మా..!

Meena Yogeshwar
August 8, 2024

మాకు చిన్నప్పట్నుంచీ పద్యాలు అలవాటే. అష్టావధానాలు, శతావధానాలు, పద్య నాటకాలు ఇలా ప్రతీ కళా ప్రదర్శనలకు తీసుకుళ్ళేవారు మా నాన్నగారు. ఆయన పృచ్ఛకునిగా పాల్గొన్నవాటిలోనే కాక, కేవలం మాకు చూపించాలనే ఆశతో, మిగిలిన వాటికి కూడా దూరదూరాలకు తీసుకువెళ్ళేవారు. మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పద్యం వినవస్తూనే ఉండేది. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరధీ శతకం, పోతన భాగవత పద్యాలు, ఆధ్యాత్మ రామాయణం పద్యాలు పాడుకుంటూ పూజకు సిద్ధం చేసుకునేది మా బామ్మగారు. ఎందుకు అమ్మమ్మా ఈ వయసులో నీకు తలస్నానాలు, ఒంటి పూట భోజనాలు, ఇన్నేసి గంటల పూజ అని మా అమ్మ అడిగితే మా బామ్మ...

అబ్బో ఈవిడ పేరు మకుటం పెట్టుకుని ఏదో పద్యం రాసేసుకుందిగా అనుకోకండేం. ఈ నెల ప్రసంగం విన్నాకా నా వంటి పద్య సౌరభం తెలియనిదానికి కూడా ఇలా ఓ ముక్క రాయాలనిపించింది అంటే ఆలోచించండి, ప్రసంగకర్తగారి ప్రతిభ. సరిగ్గా గంట అంటే గంట పాటు 14వ శతాబ్ధం నుండి 21వ శతాబ్ధం వరకూ తెలుగు నేలను ఏలిన పద్య చక్రవర్తులకు నమస్కరించుకున్నాం మేమందరం. నిజానికి నాకూ, పద్యానికి తగు దూరం  ఉండనే ఉంది. దానికి కారణం నా దురదృష్టమే.

మాకు చిన్నప్పట్నుంచీ పద్యాలు అలవాటే. అష్టావధానాలు, శతావధానాలు, పద్య నాటకాలు ఇలా ప్రతీ కళా ప్రదర్శనలకు తీసుకుళ్ళేవారు మా నాన్నగారు. ఆయన పృచ్ఛకునిగా పాల్గొన్నవాటిలోనే కాక, కేవలం మాకు చూపించాలనే ఆశతో, మిగిలిన వాటికి కూడా దూరదూరాలకు తీసుకువెళ్ళేవారు. అత్తిలి పక్కన కంచుమర్రు గ్రామం నుంచి భీమవరం వరకూ పదహారున్నర కిలోమీటర్లూ, మా ముగ్గుర్నీ సైకిల్ పైన తొక్కుకుంటూ తీసుకువెళ్ళేవారు. అక్క ముందు కడ్డీ మీద, అన్నయ్య వెనుక, నేను నాన్నగారి భుజాలపైన. ఇక మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పద్యం వినవస్తూనే ఉండేది.

శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరధీ శతకం, పోతన భాగవత పద్యాలు, ఆధ్యాత్మ రామాయణం పద్యాలు పాడుకుంటూ పూజకు సిద్ధం చేసుకునేది మా బామ్మగారు. ఎందుకు అమ్మమ్మా ఈ వయసులో నీకు తలస్నానాలు, ఒంటి పూట భోజనాలు, ఇన్నేసి గంటల పూజ అని మా అమ్మ అడిగితే మా బామ్మ

‘ముప్పున గాలకింకరులు ముంగిట నిల్చినవేళ, రోగముల్

గొప్పరమైనచో గఫము కుత్తుకనిండినవేళ, బాంధవుల్

గప్పినవేళ మీ స్మరణ గల్గునో గల్గదో, నాటి కిప్పుడే

తప్పక చేతు మీ భజన దాశరధీ కరుణాపయోనిధీ..’ అంటూ పద్యం చెప్పేది.

పూజ అంతా పూర్తి చేసి, సర్వోపచారాన్ సమర్పయామి అని మంత్రం చేప్పేశాకా, కృష్ణుణ్ణి చూస్తూ ఈ కింది పద్యం చదివేది.

‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు, ప్రణయాంకమే సిద్ధపరుచుచుంటి ,

పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు , నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి,

పూజకు మావిట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి,

నైవేద్యము ఇడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతి కందియనుంటి,

లోటు రానీయ నున్నంతలోనా నీకు రమ్ము దయసేయు మాత్మ పీఠమ్ము పైకి,

అమృత ఝరి చిందు నీ పాదాంకముల యందు కోటి స్వర్గాలు మొలిపించు కొనుచు తండ్రీ’

ఇక తాడేపల్లిగూడెం బదిలీ అయ్యి వచ్చాకా, మా అన్నయ్యకు ఒక తెలుగు మాస్టారు గారి దగ్గర తెలుగు వ్యాకరణం కోసం ట్యూషన్ పెట్టించారు. లెక్కలు, సైన్స్ లపై ట్యూషన్ పెట్టించి, చేపని రుద్దినట్టు రుద్దించే సమయంలో తెలుగుపై ట్యూషన్ అంటే తెలిసినవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఆనక నవ్వి పోయారు కూడా. తెలుగు రాకపోతే సిగ్గు పడాలి కానీ, నేర్చుకుంటే కాదు అనుకున్నారు మా నాన్నగారు. ఆయన దయ వల్ల అన్నయ్యకి పద్యాలు రాయడం వచ్చింది. క్లిష్టమైన కంద, సీస పద్యాలు, హ్రస్వ పదాలతో పద్యాలు కూడా రాశాడు.

అయితే, నాకు మాత్రం ఆ పద్య ప్రేమ అబ్బలేదు. ఇప్పటికీ కొన్ని పద్యాలు చూస్తే గౌరవంతో కూడిన భయం నాకు. అమ్మో, మనకి ఒక పట్టాన అర్ధం కావు అని. కానీ కొన్నేళ్ళుగా నేను కూడా పద్యాన్ని నా జీవితంలో భాగం చేసుకునే సంకల్పం తీసుకున్నాను. మా బామ్మ నడిచిన దారే నాకూ శిరోధార్యం కదా. నా పూజలోనూ తెలుగు పద్యమే వస్తుంది. మంత్రపుష్పం చదివేశాకా,

‘నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమా మహేశులన్

పురాణ దంపతులన్ మిమ్ము మేలు భజింతు కదమ్మ మేటి పె

ద్దమ్మ దయాంబు రాశివి గదమ్మ హరిన్ పతి సేయుమమ్మ ని 

న్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ’ అని పూర్తి చేయడం అలవాటు చేసుకున్నాను. పతి వచ్చేశారుగా, ఇప్పుడు సుత అంటున్నాను.

ఈ రోజు నిజంగా మా బామ్మగారు గుర్తుకువచ్చింది. శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ గారిని మా బామ్మగారంతటి పెద్ద వయసు ఆమెతో పోలుస్తున్నాను అనుకోకండి. ఆమె గొంతు విప్పి, పద్యం ఎత్తుకోగానే, నా చిన్నతనమంతా నా కళ్ళెదుట ప్రత్యక్షమైంది. మా బామ్మ పప్పు పులుసు గోరు ముద్దలు తినిపిస్తూ, శతక పద్యాలు, నాటక పద్యాలు, సామెతలూ చెప్తున్న ఆ బంగారు రోజులు గుర్తుకువచ్చాయి. అందుకే ధైర్యం చేసి, యతి, ప్రాస వంటి నియమాలు ఏవీ తెలియని నేను పైన శీర్షికలో పద్యాన్ని పోలిన ఆ పాదం రాసే ధైర్యం చేశాను.

ప్రసంగం జరిగేటప్పుడు కూటమిలో ఇచ్చే commentryలో నేను రాసిన ఒక లైను నాకే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అందుకే మరలా ఇక్కడ పంచుకుంటున్నా.

ప్రసంగానికి రాలేనివారిని గుర్తుచేసుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆవిడది శారదా కుంభవృష్టి. మేమందరం ఆమె వాక్కులలో తడిసి ముద్దైపోతున్నాం. కుదిరితే మిగిలిన వారు కూడా వచ్చేయండి.

ఇది అక్షర సత్యం. నిజంగా ఇంచు కూడా ఖాళీ లేకుండా ఆమె కురిపించిన జడివానలో తడిసిపోయాం మేమంతా. లైవ్ లో విననివారు ఏం బాధ పడకండి త్వరలోనే ప్రసంగం వీడియో యూట్యూబ్ లో పెడతాం. విని మీరూ మైమరచిపోదురుగాని. అంతవరకూ మీ చిన్నప్పుడు విన్న, నేర్చుకున్న పద్యాలు నెమరేసుకుంటూ ఉండండి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :