3పాత్ర చిత్రణ, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, సన్నివేశాలు ఇలా మొత్తం అన్నిటినీ కలిపితే ఈ ఒక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సినిమాలను ప్రభావితం చేసిందో లెక్కించడం చాలా కష్టం. ఆంగ్ల సినిమా భాషని, వ్యక్తిత్వాన్ని ఒక మలుపు తిప్పిన సినిమా ఇది. మన భారతదేశంలో ఈ సినిమాని అచ్చంగా రీమేక్ చేసినవారు కొందరైతే, ఎన్నో విషయాల్లో ఈ సినిమాను inspiration గా తీసుకున్నవారు ఇంకా ఎక్కువ మంది. సీక్వెల్ కి ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు పొందిన మొట్టమొదటి సినిమా త్రయం ఇదే. ఇంతకీ ఆ సినిమా ఏమిటో మీరు ఊహించగలిగారా?
ఇందులో నుండి ఒక డైలాగ్ చెప్తే మీరు గుర్తుపట్టేస్తారు. ‘I’m gonna make him an offer he can’t refuse’. అవును, మీరు అనుకున్నదే. అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంగ్ల చిత్రం ‘ది గాడ్ ఫాదర్’. అంతటి Iconic సినిమా వచ్చింది మారియో పుజో అదే పేరుతో రాసిన ఒక నవల నుండి. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇంతటి Iconic నవలకు కూడా ఎన్నో inspiration లు ఉన్నాయి. ఈ కథలోని బలవంతుడైన తండ్రి, ముగ్గురు కొడుకులు, నౌకరుగా పనిచేసే అక్రమసంతానం వంటి పాత్రల outline ప్రముఖ రష్యన్ రచయిత ఫ్యోదర్ దస్తోవ్స్కీ రాసిన ‘ది బ్రదర్స్ కరమజోవ్’ అనే నవలలోని పాత్రలకు పోలి ఉంటాయి.
ఈ నవలను మారియో ఒక డైలాగ్ తో మొదలుపెట్టారు. అది ప్రపంచ సాహిత్యంలోనే కాక, సినిమా ద్వారా మొత్తం సినిమా ప్రపంచంలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ‘Behind every great fortune there is a crime’ అనేదే ఆ డైలాగ్. నిజానికి ఈ డైలాగే కాదు, పైన ఉదహరించిన డైలాగ్ కూడా ప్రముఖ ఫ్రెంచి రచయిత హానరే బాల్జాక్ రచనలలోని కొటేషన్ ల నుండి inspire అయినవేట. ఈ నవల ముఖ్యంగా న్యూయార్క్ నగరాన్ని ఏలే 5 మాఫియా కుటుంబాల రక్త చరిత్ర. ఒకరిపై ఒకరు ఆధిక్యత సాధించాలనే ఎత్తులు పై ఎత్తులతో నిత్యం రక్తపాతం సృష్టించే కుటుంబాలు ఇవి.
అందులో అందరి కన్నా ఎత్తున ఉండగలిగే స్థానం సంపాదించుకున్న వాడు ‘డాన్’ అనబడే వీటో కారలిన్. అతనినే అందరూ గాడ్ ఫాదర్ అని పిలుస్తుంటారు. అతనిపై, అతని కుటుంబంపై జరిగిన దాడులు, వారు నిలదొక్కుకున్న తీరు, ఊహించని రీతిలో ఈ రక్తపాతం నచ్చని చిన్న కొడుకు తరువాతి డాన్ గా మారడమే ఈ నవలాత్రయం కథ. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ 5 కుటుంబాలు, వారి మధ్య కక్షలు, ఈ రక్త చరిత్ర అంతా న్యూయార్క్ నగరం 1920లు నుండి 60ల కాలం వరకూ ఇటాలియన్-అమెరికన్ కుటుంబాల మధ్య చూసిన నిజమైన చరిత్రే.
వారి అంతర్యుద్ధాల నుండి, సొంత ప్రభుత్వాలు నడపడం, settlements చేయడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఆ యుద్ధాల ద్వారా ఒక నాయకుణ్ణి ఎన్నుకోవడం, కొన్నాళ్ళకి వాడినీ పడగొట్టాలని చూడడం, ఇవన్నీ నిజ జీవిత సంఘటనలే. ఈ నవలలో గాడ్ ఫాదర్ అసలు ప్రాంతం ఇటలీలోని సిసిలియా దగ్గర కారలిన్. అమెరికా వచ్చిన తరువాత తన ఇంటిపేరు అండోలినీ తీసేసి, తన ఊరి పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. నిజ జీవిత అమెరికన్ మాఫియా కూడా ఇటలీలోని సిసిలియా ప్రాంతం నుండి వలస వచ్చినవారే. వారిలో ఒకడికి ఈ నవలలో డాన్ పేరు మాదిరిగానే ‘జో ద బాస్’ అనే పేరు ఉండేది.
ఇలా సాహిత్యం, నిజమైన చరిత్ర, తన ఊహాశక్తి కలగలిపి మారియో పూజో నెలకొల్పిన మాఫియా ఊహా లోకమే ‘ది గాడ్ ఫాదర్’. 1969లో విడుదలైన ఈ నవల మొదటి భాగం రెండేళ్ళలో తొంభై లక్షల కాపీలు అమ్ముడుపోయింది. ఈ నవలను సినిమాగా తీసినప్పుడు స్క్రీన్ ప్లే ఈ నవల రచయిత మారియోనే నిర్వహించాడు. 1972లో సినిమాగా వచ్చినప్పుడు అమెరికా, కెనడాలతో కలిపి 81.7 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే కేటగిరీలలో మూడు ఆస్కార్లు పొందింది. ఇదంతా కాక, మొదట్లో మనం చెప్పుకున్నట్టు కథ, పాత్రలు, సన్నివేశాలు, డైలాగ్ లు ప్రపంచవ్యాప్తంగా ఎందరు దర్శక, రచయితలను ప్రభావితం చేశాయో లెక్కలు తెలీవు మనకి.
ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు ఈ నవలపై చేసిన విశ్లేషణ ఈ వారం విడుదలవుతోంది. ఇప్పటివరకూ ఎప్పుడూ నేను ఈ కథ వినలేదు. మొదటిసారి విన్నప్పుడు నాకు ఎన్ని బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు గుర్తుకొచ్చాయో చెప్పలేను. ఈ విశ్లేషణ విని, మీకు ఎన్ని గుర్తుకువచ్చాయో నాకు మెయిల్ చేసి చెప్పడం మర్చిపోకండేం. నేనైతే ఈ నవల విశ్లేషణ విన్నాకా, ఈ వారంతంలో సినిమా కూడా చూద్దాం అనుకుంటున్నా. మీరు అంతేనా? అయితే ముందు విశ్లేషణ వినేయండి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.