రోమ్ నగరాన్ని ఒక రోజులో నిర్మించలేదనే మాటని మనం తరచూ వింటూ ఉంటాము. మనిషి బుర్రలో రోమ్ లాంటి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి అనే ఆలోచన ఒక అంకురంగా పుట్టి కొన్నాళ్ళకు బుర్రని తొలచడం ప్రారంభిస్తుంది. కేవలం ఒక ఊహగా, హొలోగ్రామ్ గా ఉన్న ఆ ఆలోచన అతన్ని వెంటాడుతూ తన కలలో కూడా ఒక కళగా సాక్షాత్కరిస్తుంది. ఆ సాక్షాత్కారం నీ చేతిలో సాధ్యమేనంటుంది. ఆకాశంలోకి చూస్తే చుక్కల్ని కలుపుతూ ఒక పటంలా, భూమి పైకి చూస్తే రాళ్ళను కలుపుతూ ఒక పునాదిలా, శూన్యంలోకి చూస్తే అసామాన్యమైన ఊహా నిర్మాణమై కనబడుతుంది ఆ ఆలోచన. ఒకానొక రోజున అంత పిచ్చిగా అతన్ని నడిపిస్తున్న ఆ ఆలోచనని నిర్మించడానికి పూనుకుంటాడు ఆ మనిషి. ఎలా ? “ నువ్వున్న దగ్గరనుంచి, నీకున్న వాటితో, నీకు కావలసింది చేయి “ అని చెప్పినట్లుగా తన దగ్గర ఉన్న పని ముట్లతో తనకున్న తెలివి తేటలతో ఆ నిర్మాణం మొదలు పెడతాడు. తర్వాతి కాలంలో అతనితో ఇంకొందరు చేరి ఆ నిర్మాణానికి సహాయపడతారు. రోమ్ నగర నిర్మాణం జరుగుతుంది.
రోమ్ గురించే కాదు మన భారతీయ కట్టడాలను కూడా గమనిస్తే హంపి, బేలూరు, తంజావూరు, శ్రీ రంగం ఇలా ఎన్నో దేవాలయాలను చూడండి. హంపి నగరం కూడా రోమ్ నగరంలా ఒక్క రోజులో నిర్మించబడలేదు. బేలూరు చెన్నకేశవాలయ నిర్మాణం కూడా 103 ఏళ్లు, తంజావూరు బృహదీశ్వర ఆలయ నిర్మాణం 15 ఏళ్లు పడితే శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయ నిర్మాణం 10 ఏళ్లు పట్టింది. పై విషయాలు చెప్పడానికి ఒక కారణం ఉంది. ఒక పెద్ద కొండని ఎత్తాలి అని నిర్ణయించుకున్న మనిషి ముందు చిన్న చిన్న రాళ్ళని ఎత్తడంతో తన సాధన మొదలు పెడతాడు అని ఒక నానుడి. అలాగే హంపి, బేలూరు తంజావూరు, శ్రీరంగం లాంటి పెద్ద పెద్ద నగరాలు, ఆలయాలు నిర్మిద్దాం అని నిర్ణయించుకున్న శిల్పులు ముందుగా వాటి నమూనాలను చిన్న చిన్న ఆలయాలుగా, చిన్న చిన్న శిల్పాలుగా నిర్మించుకుంటారు. మీరు గనుక ఆ ఆలయ మంటపాల్లో చూస్తే వాటి నమూనాలు కూడా అక్కడ ముఖమంటప అరుగుల మధ్య పేర్చి ఉంటాయి.
కొన్ని దశాబ్దాల పాటు నిర్మించి, తప్పొప్పులు ఎంచి సరిదిద్ది ఒక యుగంలోని మానవాళికి అంకితమిచ్చిన ఇలాంటి కళాఖండాలు ఎన్నో. అందుకు వారి సమయాన్ని వెచ్చించి, వారి జీవితాన్ని ధారపోసిన మహానుభావులెందరో. ఒకప్పుడు ఈ గొప్ప ఆలయాలే విద్యాలయాలు. ఎన్నో కళలు, విద్యలు, సంగీత సాధనలు, యోగములు ఇక్కడే పుట్టి గ్రంధీకరించి తర్వాతి తరాలకు అందజేయబడినాయి. ఆనాడు రోమ్ నగరం కానీ, హంపి నగరం కానీ ఇన్ని కళలతో శోభిల్లాడానికి అది నిర్మించడానికి పూనుకున్న కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే కారణం కాదు. అక్కడ ఉన్న సహకరించిన ప్రతి వ్యక్తి అందుకు కారణమే.
ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో కూడా అలనాటి కళలని, అలాంటి సాహిత్యాన్ని శ్రవణ రూపంలో వడబోసి అందించడంలో కృషి చేస్తుంది దాసుభాషితం. ఆకాశ హర్మ్యాలుగా నిర్మించిన నగరాలతోనూ ఆలయాలతోనూ, అరచేతిలో ఇమిడిపోయే మొబైల్ యాప్ తోనూ పోలిక ఎందుకు పెట్టాము అంటే దాసుభాషితం యాప్ నిర్మాణ క్రమంలోనూ, అందులో విడుదల చేసే కాంటెంట్ నిర్మాణంలోనూ కేవలం మా కృషి మాత్రమే లేదు. దాసుభాషితం శ్రోతల నుండి కూడా మాకు అందుతున్న సహకారం ఎంతో గొప్పది. ఈ యాప్ నిర్మాణంలో, కాంటెంట్ నిర్మాణంలో శ్రోతల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్ మాకు ఎంతో ప్రామాణికమైనది, ఉపయుక్తమైనది. ఉదాహరణకి ఈ వారం మాకు వచ్చిన ఒక ఫీడ్‌బ్యాక్ చూడండి.
ఇన్ని వందల పొత్తాలను చదివిన శ్రీ దాసు గారి గొంతులో ఇన్ని తక్కువ తప్పులే దొర్లటం అద్భుతమే. ఇవి కూడా తప్పులని కూడా ఇదమిత్థంగా చెప్పటం లేదు, నా వీనులకలా సోకిందంతే. ఇవి కూడా ఎత్తి చూపటం కోసం కాదు. నేను శ్రీ దాసు గారి గొంతుకలో ఈ పొత్తాలను చక్కని వెసులుబాటు తో వినటానికి నోచుకున్నాను అని చెప్పటం కోసమే.
పిల్లలమఱ్ఱివారి శృంగార శాకుంతలం మొదటి వంతులో సుమారు 7:22 నిముషాల దగ్గర మంచన సంస్కృతంలోని "విద్ధసాలభంజిక" ను తెలుగుచేసాడని చెప్పటానికి బదలు "విద్ధపాలభంజిక" అని వినవచ్చింది.
ఇంటిపేరు ఇంద్రగంటి 2 పాలు, 2.6.2 పాఠం, సుమారు 15:44 నిముషాల దగ్గర పండితరాయలి పేర వాసికెక్కిన శ్లోకం లో "భాస్వానుదేష్యతి" కి బదులుగా "భాస్వానుధేష్యసి" అని వినిపించింది.
" హంపీ నుంచి హరప్పా దాకా " లో గొడుగు పాలుని కథ(#12) లో 2:32 నిముషాల దగ్గర వాకిటి కావలి తిమ్మన పై నున్న చాటుపద్యంలో రెండో పాదంలో "సుకవి వరులపాలిటి" కి బదులు "సుక వికరుల పాలిటి" గా ధ్వనించింది.
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇలాంటి ఫీడ్‌బ్యాక్లే మమ్మల్ని ఇంకా తీర్చిదిద్దుతున్న నమూనా ఆలయాలు. వీటినుంచి ఎన్నో విషయాలు తెలసుకుంటున్నాం, వాటిని ఎలా సరిచేయాలో నేర్చుకుంటున్నాం, నేర్చుకున్న విషయాలని ఆచరణలో పెడుతున్నాము. ఇలా మాకు ఆచార్యులై ఎన్నో విషయాలు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తూ క్రొత్త కాంటెంట్ నిర్మాణంలో సాహాయపడుతున్న మీ అందరికీ కృతజ్ఞతలతో…
ఆచార్య దేవో భవ 2
చిరంజీవయినా పుడుతూనే మెగాస్టార్ ఐపోలేదయ్యా... తెగించే సత్తా చూపందే సడన్గా స్వర్గం రాదయ్యా... ఈ లిరిక్స్ మనీ అనే సినిమాలో ఒక పాటలోనివి. ఒక మామూలు మనిషిగా పుట్టి ఎన్నో కష్టాలకు ఓర్చి నేర్చిన కళలని ప్రదర్శించి ప్రేక్షకులని ఉల్లాసపరిచి ఒక గొప్ప హీరోగా ఎదిగిన వ్యక్తిపై రాసిన లిరిక్స్. డా. ఆర్. అనంత పద్మనాభారావుగారు రాసిన ఆచార్య దేవో భవ వ్యాసములలో ఇలా ఎందరో ఆచార్యులను గురించి మనకి తెలియజేశారు. ఒక గొప్ప ఆచార్యునిగా వారు ఎదిగిన స్థితి, ఆచార్యునిగా వారు చేసిన పరిశోధనలు కృషి విద్యార్థులు దృష్టిలో ఒక హీరోగా ఎదిగిన తీరుకి ఏమాత్రం తక్కువ కాదు. ఈ శీర్షికలోని వ్యాసాలను వింటుంటే ఎందరో ఆచార్యులు ఆంధ్ర దేశంలో మనం ఉంటున్న ఊర్లో నుండి మనం తిరిగిన ఊర్లలో నుండి ఎన్నో యూనివర్శిటీలకు చేరి శాస్త్రం, చరిత్ర, నాట్యం, నటన, ఇలా ఎన్నో కళలలో, విద్యలలో వారు చేసిన పరిశోధన, కృషి గురించి వివరిస్తూ ఉంటే ఆచార్యులని ఆచార్యులగానే కాక గొప్ప హీరోలుగా మనం చూస్తాం. మరి వారు చేసిన కృషి తెల్సుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి అనుకుంటే ఆ ఆచార్యులు నడిచిన మార్గం ఏంటో వినండి.
ఎలెవెన్త్ కమాండ్మెంట్
కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞలు. క్రైస్తవుల మత గ్రంధమైన బైబిల్ లో నిర్గమకాండములో పది ఆజ్ఞలు మనిషికి ఆదేశింపబడ్డాయి. మనిషి నైతికంగా జీవించడానికి ఈ పది సూత్రాలు దేవుడు మోషేకు వివరించి వాటిని శిలాపలకాలపై శాసనాలుగా ఇచ్చాడు. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నాలుగో సింహమే పోలీస్ అని ఓ పోలీస్ సినిమాలో డయలాగ్. ఆ విధంగానే కనిపించే పది ఆజ్ఞలు మానవాళిని నడిపించే నైతిక సూత్రాలు అయితే మరి ఇక్కడ చెప్పిన పదకొండవ ఆజ్ఞ ఏమిటి ?
ఎలవెంత్ కమాండ్మెంట్ అనే ఈ నవల జెఫ్రీ ఆర్చర్ రాసిన ఒక గొప్ప ఫిక్షన్ నవల. సాహసాలు, రాజకీయాలు అమెరికా దేశపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సి నడిపే రహస్య వ్యవహారాల గురించి, గూడచర్య వ్యవస్థ గురించి, రెప్పపాటులో మలుపు తిరిగి ఆశ్చర్య చకితుల్ని చేసే ఘట్టాలతో జెఫ్రీ ఆర్చర్ రాసిన ఈ నవల విశ్లేషణ వింటుంటే ప్రతి పాత్రను మన మస్తిష్కంలో ఊహించుకుని గొప్ప అనుభూతికి లోనవుతాము. జేమ్స్ బాండ్, జాక్ ర్యాన్, జాసన్ బౌర్న్ లాంటి ఫిక్షన్ నవలలు, సిరీస్లు, సినిమాలు చూసిన వారికి, తెలిసిన వారికి ఈ ఎలవెంత్ కమాండ్మెంట్ నవలా విశ్లేషణ వింటే ఒక గొప్ప గూఢచారి సిరీస్ చూసిన అనుభూతిని ఇస్తుంది. కనిపించే పది ఆజ్ఞలు మనిషి నైతికంగా పాటించవలసినవి అయితే కనబడని ఆ పదకొండవ ఆజ్ఞ ఏమిటో తెల్సుకోవాలి అంటే ఈ శీర్షిక వినండి.