తెలుగు చనిపోతున్నది అన్న మాట మేము అంటున్నది కాదు. ఏ తెలుగు భాషా ప్రేమికులని, సాహితీ వేత్తలని అడిగినా, తెలుగు పండితులని, ఉపాధ్యాయులని అడిగినా తడబడకుండా అప్పటికప్పుడే అందులో ఉన్న వాస్తవం ఎంతో పరిశోధనాత్మకంగా చెప్పగలిగే మాట.
ఈ విషయం మనకి పూర్తి అవగాహనలోకి, ఎరుకలోకి రావడానికి చరిత్రలో జరిగిన ఒక చిన్న విషయం చెబుతాను.
మా ఊరు ఏలూరులో రామకోటి అని ఒక ప్రదేశం ఉంది. ప్రతీ సంవత్సరం అక్కడ రామకోటి, రామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ప్రస్తుతం మంచి రోడ్డు మార్గం ఉండి, అక్కడ పెద్ద పెద్ద భవనాలు, అంతస్తులు, ప్రభుత్వ వేదిక ఉన్నాయి గాని, ఒకప్పుడు అంటే బ్రిటిష్ కాలంలో, వేంగి రాజుల కాలంలో అది ఒక పెద్ద చెరువు. ప్రస్తుతం ఉన్న చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ముందు నుంచి రామకోటి వరకూ అక్కడ ఒక పెద్ద చెరువు ఉండేది అని కొందరు చెబుతూ ఉంటారు. అక్కడ పడవల తయారీ, పడవల మరమ్మత్తులు, పడవల మార్గంలో చిన్న చిన్న వ్యాపారాలు జరిగేవి అని చెప్పేవారు. ప్రస్తుతం ఆ గుర్తులు కూడా ఏమి లేవు కానీ కొందరు వ్యాపారస్థులని, మా ఇంట్లో పెద్దవారిని అడిగితే ఈ విషయం కథలు కథలుగా చెప్తారు. ఇందులో వాస్తవం ఎంతో కచ్చితంగా తెలియనంతగా కాల గర్భంలో కలిసిపోయింది.
ఒక చెరువు, ఒక కాలవ ఎండిపోయాయి అంటే కాల క్రమేణా ఎండిపోయాయి అనుకోవాలా లేదా నెమ్మది నెమ్మదిగా అవి ఎండిపోవడానికి తర్వాతి తరాలే స్పృహ లేకుండా స్వాగతించారు అనుకోవాలా ?. అవి ఎండిపోయాక వాటితో ముడి పడి ఉన్న వ్యాపారాలు, అక్కడి జీవితాలు, నాగరికత మారిపోయాయి. మానవ జీవితం, ఒక ఊరి పరిస్థితులు మార్పు చెందడం సహజమే మరి మానవ భాష ?, మాతృ భాష పరిస్థితి ? తెలుగు భాష పరిస్థితి ? చెరువు కొలను సరే. ఒక నదే ఎండిపోతే ? భాషే అంతరించి పోతే ?
సరే తెలుగు భాష ఏమైపోతుందో అని అందరూ అన్ని చోట్ల బాధ పడటం దానిని కొందరు విడ్డూరంగా చూడటం మనం గమనిస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలలో మనం కూడా ఇంతే విడ్డూరంగా చూస్తాము. ఏమైంది తెలుగుకి? బాగానే ఉందిగా అంటూ. ఇది ఒక విధంగా భూమి ఉపరితలం వేడెక్కుతుంది (Global Warming) అంటే, ఎక్కడా ? నేను నిల్చున్న నేల బాగానే ఉందే అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ మనం ఒక పని చేయవచ్చు మన బంధువుల, స్నేహితుల పిల్లల్లో కొందరిని “పెద్దయ్యాక ఒకవేళ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నావు అనుకుందాం ఏ అంశం బోధిస్తావు?” అని అడుగుదాం. వారిలో ఎంతమంది తెలుగు పాఠం బోధిస్తాము, తెలుగు ఉపాధ్యాయులం అవుతాము అంటారో లెక్కిద్దాం.
ఆ ప్రశ్నకి మనం ఊహించిన సంఖ్య రాకపోవచ్చు, లేదా మనం అనుకున్న సంఖ్య కంటే తక్కువ రావచ్చు. ఈ ప్రశ్నే కాకుండా ఇంకా ఎన్నో ప్రశ్నలు మాలో మేము వేసుకున్నాం. వేసుకున్న ప్రతి ప్రశ్న వెనక తెలుగు కోసం మనం ఏం చేయగలం? అనే ప్రశ్న వేసుకున్నాం. మా దాసుభాషితం బృందం ఇప్పటివరకూ కొన్ని తెలుగు సభలకు ప్రత్యక్షంగా హాజరు అయ్యాము, కొన్ని ఉన్న చోటు నుంచే అంతర్జాలం ద్వారా (virtual) గా పాల్గొన్నాము. CPB, SPB పేర్లు మీదుగా తెలుగు పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందించి తెలుగు బాలలను, ప్రజలను తెలుగులో ప్రోత్సహించడానికి దాసుభాషితం కృషి చేసింది. దాసుభాషితం CEO దాసు కిరణ్ గారు తెలుగు భాషావేత్తలతోనూ, ఎందరో తెలుగు ప్రముఖులతోనూ మాట్లాడారు. మేం మాట్లాడిన వారు, తెలుగు సభల్లో ప్రసంగించిన వారు ప్రముఖంగా చెప్పినవి మూడు విషయాలు.
“తెలుగు భాషాభివృద్ధికి ఏం జరగాలి? మేము ఏం చేస్తున్నాము? మీరూ ఏం చేయాలి? “
ఈ శనివారం 29-06-2024 న జరిగిన తెలుగాట ప్రసంగంలో ఈ మూడు ప్రశ్నలకి సమాధానం ఉంటుంది. అసలు తెలుగాట అంటే ఏమిటి ? తెలుగాటతో తెలుగు భాషాభివృద్ధికి ఏం జరుగుతుంది? మేం ఏం చేయబోతున్నాము? మీరూ ఏం చేయగలరు అనే విషయాలు ఈ ప్రసంగంలో ఉంటాయి. వినోదంతో విజ్ఞానం శీర్షికన తెలుగాటను ఒక యాప్ గా నిర్మాణం చేసి, తెలుగులో మాట్లాడటానికి ముఖ్యమైన పదజాలం (Vocabulary) అందించడంతో పాటు, తెలుగు భాష గురించి, తెలుగు భాషలో జరిగిన గొప్ప పనులు, చరిత్ర, గొప్ప వ్యక్తుల గురించి, ఇంకా ప్రపంచంలోని ఎన్నో విషయాలను తెలియజేస్తూ, తదుపరి కొన్ని ప్రశ్నలు సందిస్తాము. ఈ ప్రశ్నలకి సమాధానాలు సరిగ్గా చెప్పగలిగే వారు గొప్ప బహుమతులు కూడా గెలుచుకుంటారు. క్లుప్తంగా తెలుగాట అంటే ఇది. మరింత వివరంగా తెలుగాట గురించి ప్రసంగం రికార్డింగ్ లో మీరు చూస్తారు.
జులై నెలలో జరగాల్సిన ప్రసంగం ఒక వారం ముందుగానే జూన్ నెలలో జరిగింది. ఇక వచ్చే నెలలో మరో ప్రసంగం ఉండబోదు. తెలుగాట ప్రసంగం రికార్డింగ్ విడుదల గురించి మీకు త్వరలో తెలియజేస్తాము.
అభినందనలతో
రామ్ కొత్తపల్లి.