మనమందరం కారణ జన్ములమే అని నాకు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. ‘ఊరుకుందురు మనకంత సీన్ లేదు’ అంటారా. నా మాటా పూర్తిగా వినండి మరి. మనం పుట్టినప్పటి నుంచి, చనిపోయే అంత వరకూ కొన్ని లక్షల కదలికలు చేస్తూ ఉంటాం. అందులో పనికొచ్చేవి, పనికిరానివి అని లెక్కపెట్టకుండా చూస్తే, ప్రతీ కదలికా ఈ ప్రపంచంలో ఏదో ఒక మార్పుకి కారణమో, కొనసాగింపో అయి తీరుతుంది అని నేను నమ్ముతాను.
ఒక చిన్న ఉదాహరణకి, రోడ్డు పక్కన ఒక చిన్నపిల్ల కనిపిస్తుంది. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి, ముక్కు కారుతూ, బట్టలు సగం చిరిగిపోయి, జుట్టు అట్టలు కట్టేసి, తల్లి కోసం ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ పిల్లని చూసినవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఆలోచిస్తారు, స్పందిస్తారు. ఒకరు అచ్చంగా ‘ఆపవే తల్లీ నీ ఆరన్నొక్క రాగం, పొద్దున్నే ఇంట్లో గోల సరిపోదు అన్నట్టు, బయట కూడా అదేనా’ అనుకుంటారు. ఇంకొకళ్ళు ‘పిల్లల్ని పోషించలేనప్పుడు కనడం ఎందుకు, అనవసరంగా ఏడిపిస్తున్నారు’ అనుకుంటారు. మరొకళ్ళు ‘ఇలా రోడ్డు పక్కన కాకుండా, వీరిని ఏదైనా పునారావస కేంద్రానికి తరలించేలా చేయాలి’ అనుకుంటారు.
ఇప్పుడు ఆ పిల్ల జన్మకి ఏదైనా కారణం ఉందా అని ప్రశ్నించుకోండి. తప్పకుండా ఉంది. ఈ అమ్మాయిని చూసినవారిలో ఎవరో భారతదేశంలో పేదరికం అనే విషయంపై పని చేస్తూ, ఇక్కడ trigger అయ్యి, ఏదైనా పెద్ద మార్పుకి కారణం కావచ్చు. గర్భ దారిద్రంలో ఉన్న ఆ పిల్ల తల్లిదండ్రులు, ఈ పిల్లని బిచ్చం ఎత్తించి సంపాదించవచ్చు అనే దారుణమైన ఉపాయం తట్టి, మన దేశంలో బాల బిచ్చగాళ్ళ సంఖ్యని పెంచడానికి కారణం కావచ్చు.
ఇలా ఏదైన జరగచ్చు. కానీ ఏమీ జరగకుండా, ప్రపంచానికో, ప్రకృతికో ఉపయోగమో, నష్టమో చేయని జన్మ అంటూ పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉండదని నా నిశ్చితాభిప్రాయం. ఏమటమ్మోయ్ బ్రహ్మని కూడా కలిపేస్తున్నావ్ అంటారేమో. నిజమే కదండీ, దేవుడు ఉన్నాడు, వాడే మన తలరాత రాస్తున్నాడు, మన కష్ట-సుఖాలకు వాడే కారణం అనుకుంటూ ఎందరు ఎన్ని మార్పు చేర్పులు చేస్తున్నారు ప్రతీ క్షణం ఈ ప్రపంచంలో. మరి దేవుడు సైతం ప్రపంచాగ్నికి ఎన్ని సమిధలు ఆహుతి చేస్తున్నట్టు ఈ లెక్కన.
అలా తన స్టూడెంట్ తప్పటడుగు వేయకుండా ఆపడం కోసం ప్రయత్నించిన నీలిమ ఏ మార్పుకు కారణం అయింది. అవతల ఆ స్టూడెంట్ నీలిమ జీవితంలో ఎలాంటి పెను మార్పులకు కారణం అయింది. చివరికి ఈ ఇద్దరిలో పునర్జన్మ ఎవరికి లభించింది? ఫోను తీసుకోవడం అనే చిన్న సంఘటన, ఒక టీనేజర్ జీవితాన్ని, ఒక పూర్తి కుటుంబాన్ని ఎలా మార్చింది? నీలిమ జన్మ, పునర్జన్మ కూడా ఎలా సార్ధక్యం పొందింది అనేదే ప్రముఖ రచయిత్రి, ముఖ్యంగా చరిత్ర నవలాకారిణి, కోరన్ అయిన శ్రీమతి సత్య పాలంకి గారు రాసిన ‘పునర్జన్మ’ నవల కథాంశం.
ఇంతకీ నువ్వు పెట్టిన Heading కి, రాసినదానికి ఏమైనా సంబంధం ఉందా అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నా. ఈ నవలలో నీలిమ ఈ సంఘటన ద్వారా తన భర్తని వివాహం చేసుకోవడం ఎంత సరైన నిర్ణయమో తెలుసుకుంటే, అవతలి స్టూడెంట్ తను ఎంచుకున్న boy friend ఎలాంటి వాడో తెలుసుకుంటుంది. ఎలాంటి కష్టం ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, వదిలేసేందుకు ఎన్ని అవకాశాలు వచ్చినా, నేనున్నాను అంటూ నిలబడే ఆ తోడు ఎంత అవసరమో, అలాంటివారిని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో అర్ధం అవుతుంది మనకి.
త్రీ మెన్ ఇన్ ఎ బోట్ - విశ్లేషణ:
వైద్య శాస్త్రంలో ఒక రకం మందు ఉంటుందిట. అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జబ్బుకు మందు. ఏమిటో తెలుసా? నాకు ఏదో జబ్బు ఉంది అనుకునే జబ్బుకు ముందు. ఇంతకీ మందు ఏమిటో తెలుసా? ఔషధం ఏమీలేని చప్పరించే మాత్రలు. మనలో చాలామందికి ఈ జబ్బు అప్పుడప్పుడూ వస్తూంటుంది. కొందరికి నిత్యం ఉంటూనే ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు గూగులమ్మ కూడా చేరింది. తలనొప్పి ఎందుకు వస్తోంది అని వెతికితే, ఎండ తీవ్రత దగ్గర నుంచి బ్రెయిన్ ట్యూమర్ దాకా ఈ లక్షణం ఉంటుంది, కాబట్టీ నీకు ఏదైనా ఉండవచ్చు అంటుంది. మన అతి ఆలోచనతో ఎండను పక్కనపెట్టి, బ్రెయిన్ ట్యూమర్ కే మొగ్గు చూపి, కంగారు పడతుంటాం.
అలా తనకి కిడ్నీ జబ్బు ఉంది అనుకునే ఒక పెద్దమనిషి, అతని ఇద్దరు స్నేహితులు, వారి కుక్క కలిసి చేసిన ఒక విఫలవంతమైన ప్రయాణమే ప్రముఖ ఆంగ్ల హాస్య రచయిత జెరొమ్. కె. జెరొమ్ రాసిన ‘త్రి మెన్ ఇన్ ఎ బోట్’ నవల కథ. ప్రయాణ సన్నాహాల దగ్గర నుంచి, ప్రయాణాంతం వరకూ ఆసాంతం నవ్వులు పూయించే ఈ నవలా విశ్లేషణ ఈ వారం విడుదల అవుతోంది. ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్, విశ్లేషకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారి సహజ ధోరణిలో ఈ విశ్లేషణ మరింత సరదాగా ఉంటుంది. వినేయండి మరి.
కూటమి కబుర్లు:
‘అందరికీ అద్వైతం’ ప్రసంగం కూటమిలో మంచి హిట్ అయింది. ముందూ, తరువాతా కూడా మంచి చర్చలు జరిగాయి. మరో మంచి చర్చ ఏమిటంటే కొందరు ‘ఆర్య’ అనే పిలుపు దగ్గర మొదలై, భారతదేశ చరిత్ర, మాక్స్ ముల్లర్ ఇలా మూలాల్లోకి వెళ్ళారు. మంచి ఆసక్తికరమైన చర్చ చూడగలిగాం. ఇక గతవారం ప్రభ గారు రాసిన ‘సుప్రభాతం’ పోస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఈ పోస్ట్ వంశీ ‘మా దిగువ గోదారి కథలు’ గుర్తు చేసిందన్నారు కొందరు సభ్యులు. ఒకరైతే, నేనూ, కిరణ్ గారు, రామ్, ప్రభ గారు ఏమి తిని ఇలాంటి అద్భుతమైన పోస్టులు రాస్తున్నామో తెలుసుకోవాలని ప్రయత్నించారు. అమ్మా! చెప్పేస్తాం ఏమిటి?
అభినందనలు,
మీనా యోగీశ్వర్.