వాళ్ళ జీవితం ఇక అంతేనా?

June 18, 2024

అవయవ లోపాలు ఉన్నవాళ్ళూ, మానభంగానికి గురైన వాళ్ళూ తమ నిర్ణయాలు, తమ జీవితాలూ తమ చేతిలో లేకుండానే జీవిస్తున్నారు. తమకంటూ కోరికలు, ఆశయాలు, ఇష్టాలు, ప్రేమలు ఉండకూడదు అని సమాజం నిర్ణయించేసింది. వాళ్ళకి రెండే భావోద్వేగాలు ఉండాలి. ఒకటి తమ స్థితిపై నిత్య బాధ, ఎవరైనా తమని పెళ్ళి చేసుకుంటే వారిపై నిత్య కృతజ్ఞత. అవతలి వారు వీరిని ఎలా ట్రీట్ చేస్తున్నా సరే. ఈ అన్యాయపు నియమాలకు లోబడి కొన్ని లక్షల మంది బతుకీడుస్తున్నారు ఈ ప్రపంచంలో. ఎక్కడో ఒకరిద్దరు ఎదురించి, తమ కాళ్ళపై తాము నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకత్తే ...

మా ఊళ్ళో మాకు తెలిలున్న వాళ్ళ అమ్మాయి ఉండేవారు. ఆమెకి పుట్టినప్పటి నుంచి కళ్ళు కనిపించేవి కాదు. కానీ అద్భుతమైన గాత్రం. ఆమె పాట అందుకుంటే, ఎంతటివారైనా ముగ్ధులైపోయేవారు. ఎంతో అందంగా, తీరువుగా, ఒద్దికగా ఉండేది ఆ అక్క. చాలామంది చెప్పినట్టు ‘దేవుడు ఒక మనిషికి ఒక లోపం పెడితో, మిగిలిన విషయాల్లో గ్రాహణశక్తి ఎక్కువగా ఇస్తాడు’ అనడానికి ఆ అక్కే నిదర్శనంలా ఉండేది.

ఎం.ఎ చదువుకుంది. స్వంతంగా ఏ కోటా అవసరం లేకుండానే ప్రభుత్వ బ్యాంక్ లో ఉద్యోగం కూడా సంపాదించుకుంది. నలుగురు ఒకచోట చేరిన ప్రతీసారీ ఈ అక్కని ఉద్ధేశిస్తూ ‘ఏదో గంతకు తగ్గ బొంతను ముడిపెట్టేయాలండీ, గుడ్డిదే అయినా ఆడపిల్ల కదా, చేయిజారితే కష్టం’ అనే మాటలు వింటే పెద్దవాళ్ళు అని కూడా చూడకూడదు అనిపించేది. నాకే ఇలా ఉంటే ఆ అక్కకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకెంత బాధగా ఉంటుంది పాపం. నిజంగా ‘లోకులు పలు కాకులు’.

వీళ్ళ దీవెనలు పండిపోయి, ఆ అక్కని చేసుకోవడానికి ఏ శారీరిక లోపమూ లేనివాడు ముందుకు వచ్చాడు. అక్కకి ఇదే ఉద్యోగపుటూరు కాబట్టి, ఇక్కడే కాపురం పెట్టారు. అతను మాత్రం మొదటి మూడు నెలలు ఆదర్శపతి అచ్చమైన నిదర్శనంలా ఉన్నాడు. ఉద్యోగం కోసం విశ్వప్రయత్నాలు చేశాడన్నారు. నాలుగో నెల నుంచి విశ్వరూపం చూపెట్టాడు. ‘నీకు కళ్ళు లేకపోయినా, ఏదో జాలిపడి నిన్ను పెళ్ళి చేసుకున్నాను. నేను చేసుకోకపోయి ఉంటే, అసలు నీకు ఈ జన్మకి పెళ్ళి అయ్యేదా?’ అంటూ సాధింపులు, తిట్లూ, కొన్నిసార్లు కొట్టడాలు కూడా. ఈ గోలలో ఆ అక్కకి గర్భవతి అయింది.

ఇక ఇన్నాళ్ళూ పెళ్ళి, పెళ్ళి అని చంపుకుతిన్న అమ్మలక్కలు ఏ మాత్రం సిగ్గూ, శరం లేకుండా కొత్త పాట మొదలుపెట్టారు. ‘ఆ అమ్మాయి గుడ్డిది కాబట్టీ, ఆ అమ్మాయికి పుట్టేవాళ్ళు కూడా గుడ్డివాళ్ళే పుడతారు’ అంటూ జంకూ గొంకూ లేకుండా ఆ కుటుంబం మొహానే మాట్లాడేవాళ్ళు. ఈ సుందరాంగుడికి ఈ తొమ్మిది నెలలూ ఇదో కొత్త విషయం దొరికింది. ‘గుడ్డివాళ్ళని కన్నావంటే నీ చావు నా చేతిలో మూడినట్టే’ అంటూ గోల. ఏం చదువుకున్నాడో మరి వీడు. అవన్నీ మనం సెలక్ట్ చేసుకోవడానికి AIలో తయారు చేసుకునే బొమ్మా?

చక్కటి పాప పుట్టింది. అక్కే అనుకుంటే అక్క కన్నా అందంగా ఉంది. అక్కకి భయంవేసి, మామూలుగా డాక్టర్లు చేసే పరీక్షల కన్నా ఎక్కువగా చేయించింది. అన్ని అవయవాలూ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు అయినా నోరు మూస్తారు అందరూ అనుకున్న నన్ను వెర్రిదాన్ని చేస్తూ, ‘హు, ఆడపిల్ల’ అని మొదలుపెట్టారు. వీళ్ళ జన్మంతా ఎదుటివాళ్ళని చూసి పడి ఏడవడమే అనుకుంటా అనిపించింది నాకు. అక్క జీతం మీద పడి తింటూ, ఎదురు ఆమెను కాల్చుకుతినే అతణ్ణి చూస్తే ఆ చిన్నవయసులో పెళ్ళి అంటేనే భయం వేసేది. 

మా నాన్నగారు చాలాసార్లు చెప్పేవాళ్ళు ‘ఎందుకమ్మా, అంత దరిద్రుణ్ణి భరిస్తున్నావ్? జీవితం అంటే పెళ్ళే కాదు కదా. చక్కాగా ఉద్యోగం ఉంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవ్. నీకు యోగం ఉంటే మంచి పిల్లాడు మళ్ళీ నీ జీవితంలోకి వస్తాడేమో. వీడితో ఈ నరకం ఎందుకంటావ్’ అని. దానికి పాపం ఆ అక్క ‘ఏం చెప్పను అంకుల్, వాడు నా జీవితం ఉద్ధరించాడట. నా బతుకు నిలబెట్టేశాడట. వీడు కాకపోతే ఈ జన్మలో నాకు పెళ్ళే అవదుట. ఏం చేసినా చేయకపోయినా, చక్కటి కూతుర్ని ఇచ్చాడట. అందుకు నేను కృతజ్ఞతగా పడి ఉండాలట. వాడు నన్ను కొట్టడం కూడా నా తప్పేనట. పాపం, నాకు కళ్ళు లేవు అని గుర్తుకు వస్తేనే కొడతాడట. నాకు కళ్ళు లేవు కాబట్టీ, మనసు కూడా లేకుండా బతకాలట. నాకంటూ ఇష్టాలు ఉండకూడదట. నేను వీణ్ణి అడిగానా అంకుల్ నన్ను పెళ్ళి చేసుకుని నన్ను ఉద్ధరించమని’ అని ఏడ్చింది ఒకసారి.

ఆ తలపొగరు భర్తతో ఎనిమిదేళ్ళు ఓపికపట్టింది ఆ అక్క. ఆఖరికి అతనికి విడాకులు ఇచ్చేసింది. సిగ్గు లేకుండా అక్క నుంచి కొన్ని లక్షల డబ్బులు ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకుని కానీ, విడాకుల కాగితాల మీద సంతకం చేయలేదు వాడు. వాడికి పెళ్ళి చాలా లాభం తెచ్చిన వ్యాపారం. రూపాయి పెట్టుబడి లేదు. ఎదురు గౌరవాలు, సన్మానాలు, దయామయుడు అంటూ వెర్రి జనం పొగడ్తలు కూడా. ఆ అమ్మాయికి మాత్రం కృతజ్ఞత లేని, తలబిరుసు గుడ్డి అమ్మాయి అనే బిరుదు ఇచ్చారు. ఆఖరికి తిట్టడానికి కూడా ఆమె లోపమే కావాల్సి వచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయం చూసి, అందరికన్నా ఆనందించింది ఆమె తల్లిదండ్రులు, మా కుటుంబమే నాకు తెలిసినంతవరకూ.

ఇప్పుడు అక్క తన పాపని పెంచుకుంటూ హాయిగా ఉంది. ఆమె తల్లిదండ్రులు ఉన్నంత కాలం తనే దగ్గరుండి చూసుకుంది. ఈ అక్కకి చదువు ఉంది కాబట్టీ, కాస్తో కూస్తో స్వతంత్రం ఉంది. నిజానికి ఇలా అవయవ లోపాలు ఉన్నవాళ్ళూ, మానభంగానికి గురైన వాళ్ళూ తమ నిర్ణయాలు, తమ జీవితాలూ తమ చేతిలో లేకుండానే జీవిస్తున్నారు. తమకంటూ కోరికలు, ఆశయాలు, ఇష్టాలు, ప్రేమలు ఉండకూడదు అని సమాజం నిర్ణయించేసింది. వాళ్ళకి రెండే భావోద్వేగాలు ఉండాలి. ఒకటి తమ స్థితిపై నిత్య బాధ, ఎవరైనా తమని పెళ్ళి చేసుకుంటే వారిపై నిత్య కృతజ్ఞత. అవతలి వారు వీరిని ఎలా ట్రీట్ చేస్తున్నా సరే. ఈ అన్యాయపు నియమాలకు లోబడి కొన్ని లక్షల మంది బతుకీడుస్తున్నారు ఈ ప్రపంచంలో. ఎక్కడో ఒకరిద్దరు ఎదురించి, తమ కాళ్ళపై తాము నిలుస్తున్నారు.

Tap to L:isten

అలాంటి వారిలో ఒకత్తే అర్చన. జీవితంలోని ఒక దురదృష్టకరమైన సంఘటన ఆమె కెరీర్, పెళ్ళి, కనీసపు స్వంతంత్రం వంటివి హరించేసింది. తనకంటూ ఇష్టాలు, కోరికలు, ఆశయాలు ఉండకూడదు అంటూ ఆమె స్వంత కుటుంబం, సమాజం నిర్భందించాయి. ఎప్పటి నుంచో ఆమె ప్రేమకై పరితపిస్తున్న వేణు, ఇదే అవకాశం అన్నట్టు ఆమెని పెళ్ళి చేసుకుంటాడు. అంతే, ఒక అభాగ్యురాలికి జీవితం ఇచ్చిన దేవుడిగా అందరి దృష్టిలోనూ వెలిగిపోతాడు. కానీ, అతను జీవితం ఇచ్చాననుకుంటున్న ఆమె మనసు తెలుసుకున్నాడా? ఈ పెళ్ళి ఆమెకి ఇష్టమేనా? అసలు ఇష్టం ఉండే హక్కు ఆమెకి ఉంది అనే ఆలోచనైనా అతనికి ఉందా? దీనివల్ల వారిద్దరి జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి అన్నదే ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారు రాసిన ‘అర్చన’ నవల కథాంశం.

ఇప్పుడు మొదటి భాగం విడుదల అవుతోంది. ఎప్పటికప్పుడు ఏమౌతుందో అనే ఉత్కంఠతో, సంక్లిష్టమైన స్వభావం కలిగిన పాత్రలతో పరుగులు పెట్టిస్తుంది ఈ నవల. కాసేపు అర్చన వైపు న్యాయం ఉంది అనిపిస్తుంది. ఇంకాసేపట్లోనే వేణు వైపు కూడా న్యాయం ఉంది అనిపిస్తుంది. ఈ నవల వింటే, మన విలువల్ని మనం పునః సమీక్షించుకుంటాం. ఎవరి వైపు ఉండాలి అనేది ఒక పెద్ద ప్రశ్నై కూర్చుంటుంది ఒక్కోసారి. ఈ వారం తప్పకుండా ఈ భాగం వినేయండి. వచ్చే వారం న్యూస్ లెటర్లో ఈ భాగం గురించి, వచ్చే భాగం గురించి నా ఆలోచనలు, కథపై నా నిజాయితీతో కూడిన సమీక్ష ఇస్తాను. ఈ భాగం విని, వచ్చే భాగం కోసం, న్యూస్ లెటర్ కోసం ఎదురు చూస్తూ, మీ దృక్పధాన్ని గమనిస్తూ ఉండండి.

P.S: ఈ న్యూస్ లెటర్లో కళ్ళు లేని వాళ్ళ గురించి సామాన్య వాడుక భాషలో ఉండే అసభ్య పదాలను ఉపయోగించాల్సి వచ్చి, ఉపయోగించాను. అంతే కానీ అవి ఉపయోగించి, వారిని కించపరచడం నా ఉద్ధేశ్యం కాదు. అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరినైనా ఈ పదజాలం బాధపరిస్తే, క్షమించండి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :