నా చిన్నప్పుడు మా చుట్టాలావిడని కన్యాకుమారి ఎక్కడుంది అండి అని అడిగితే, కాశ్మీర్ లో ఒక చిన్న ప్రాంతం ఒకప్పుడు, ఇప్పుడు దాన్ని విడిగా ఒక ఊరు చేశారు అని చెప్తే నోరెళ్ళబెట్టుకుని వినేదాన్ని. అప్పటికి ఆవిడే నా గూగుల్. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాలకు తేడా చెప్పమంటే అ, విశిష్ట అవే తేడాలు ద్వైతం అన్నిట్లోనూ ఉంది కాబట్టీ, ఒకదాన్లోంచి ఒకటి వచ్చాయి అని చాలా ధీమాగా, ధైర్యంగా, తొణకకుండా తెలియనిదాన్ని తెలిసినట్టు చెప్పేశారు. ‘దారిని పోయే ప్రతివాడినీ చూపించి, వీడే కామమ్మ మొగుడే అంటే కాబోలు అనుకున్నది’ట నాలాంటిది. అలా యధావిధిగా ఆ విషయాన్నీ నమ్మేశాను.
కాస్త పెద్దయ్యాకా ఆవిడ చెప్పేవాటిలో ఉండే నిజాల సంఖ్య కన్నా, నాకు లెక్కల్లో వచ్చే మార్కులు సంఖ్య ఎక్కువ అని అర్ధం అయింది. దేవుడి దయ వల్ల పుస్తకాలు చదివే అలవాటు అయింది. దానివలన విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతమని, శ్రీవైష్ణవం పూర్తిగా ఒక మతమని అర్ధం అయింది. ఆళ్వారులు, గోదాదేవి, రామానుజాచార్యుల గురించి తెలియడంతో ఆ మత స్థాపన, సిద్ధాంత ప్రారంభం వెనుక ఎన్నో సామాజిక, చారిత్రిక, రాజకీయ కోణాలున్నాయని అర్ధమైంది. కానీ, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతల మధ్య పూర్తి తేడా తెలియలేదు.
మేము అద్వైతులం. మా ఇంట్లో కృష్ణుణ్ణి, శివుణ్ణి ఒకే పానవట్టంపై పెట్టి పూజిస్తారు. ‘శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే’ ఇది అద్వైతులకు ముఖ్యమైన వాక్యం. అంతా ఆ పరబ్రహ్మమే అయినప్పుడు శివుడు, విష్ణువు అనే బేధాలేమీ ఉండవు, కాబట్టీ వారిద్దరికీ అబేధమే. మేము శివుడికన్నా విష్ణువే గొప్ప అనో, ఆయనని పూజించడమే బాగుంటుంది అనో అంటే మా బామ్మ మెత్తగా చెవులు మెలేసి, పై శ్లోకం చెప్పేది. అలాంటి నాకు, నిన్న జరిగిన ప్రసంగంలో ఒక షాక్ తగిలింది.
అదేంటంటే, శ్రీవైష్ణువుల్లో తెన్ కలై, వడకలై అని రెండు శాఖలు ఉంటాయిట. వడకలై సంప్రదాయం వారు సంస్కృతంలోని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ చదువుతారట, వారి పూజా విధానం వీటిని అనుసరించే ఉంటుందిట. వారికి విష్ణువు అందరికన్నా ఎక్కువ, రుద్రుడు ఇంద్రాది దేవుళ్ళతో పాటు ఒక గణం. కాబట్టీ, శివుణ్ణి పూజించరు, దేవుడిలా భావించరు కానీ, ఆయన ఉన్నాడని ఒప్పుకుంటారు. శివుడి గుడిలో ఉండే విష్ణువు ఆలయంలో పూజారులుగా కూడా ఉంటారు. అంటే మధురై, శ్రీకాళహస్తి వంటి ఆలయాలలో ఉండే విష్ణువు గుడిలో వాళ్ళు పూజారులుగా ఉండడం, కేవలం ఆ ఒక్క స్వామినే దర్శించుకుని, యాత్రలు చేయడం వంటివి చేస్తారట.
కానీ తెన్ కలై సంప్రదాయంలోని వారికి మాత్రం ఏ ఇతర పూజా విధానాలతోనూ, కర్మ కాండలతోనూ సంబంధం ఉండదుట. వాళ్ళు కేవలం తమిళ వేదంగా వ్యవహరించబడే ‘నాలాయర దివ్యప్రబంధం’ మాత్రమే చదువుకుంటారట. దాని నుండే వారి పూజావిధానం అంతా రూపొందించుకున్నారట. అంటే వారి పూజలో పురుష సూక్తం కూడా ఉండదు. శివుడి గుడిలోకి అడుగు కూడా పెట్టరట. పొరపాటున పెడితే, ఇంటికి వెళ్ళాకా తలారా స్నానం చేసేస్తారట. వారు శివ దర్శనం కూడా పాపంగానే భావిస్తారట. ఇది తెలిసాకా కొంత సేపు ఇబ్బందిగా అనిపించింది. మరీ అంత వైముఖ్యం దేనికి అని.
కానీ, ఈ కఠిన నియమాల వెనుక కూడా ఏదో సామాజిక, రాజకీయ కారణం తప్పకుండా ఉండి ఉండవచ్చు అనిపించింది. ఎందుకంటే మతం అనేది అనాది కాలంగా జనాలకు దెబ్బలాడుకోవడానికి అతిపెద్ద కారణంగా ఉంటూ వచ్చింది. రాజాశ్రయం పొందిన మతం, వేరొక మతాన్ని అణగతొక్కాలని చూడడం, మార్పిడులకు పాల్పడడం ప్రపంచవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న, జరుగుతూనే ఉండే విషయం. శైవ, వైష్ణవ మత కలహాలు ముఖ్యంగా తమిళనాట జరుగుతూనే వచ్చాయి. వాటి నుండి తమని తాము రక్షించుకునేందుకు ఈ తెన్ కలై సంప్రదాయం వారు ఇంత కఠిన నియమాలు పెట్టుకొని ఉండచ్చు అనిపించింది.
నిన్నటి ప్రసంగంలో ఇలాంటి ఎన్నో mind blowing విషయాలు తెలిశాయి శ్రీ చంద్రమోహన్ గారి ద్వారా. రామానుజుల వారు తన కాలానికే రెబెల్ అనీ, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఆయన గురువులుకే నచ్చలేదని, ఆయన్ని చంపే ప్రయత్నం కూడా ఆయన గురువుగారు ఒకరు చేశారనీ, నాథముని-యామునాచార్యుల వారి దగ్గర నుండే శ్రీవైష్ణవంలో గురు సంప్రదాయం మొదలైందనీ, నేటికి ఆ సంప్రదాయం ఎంతగా పెరిగిందంటే సమాశ్రయణం చేయించుకునే ప్రతి శ్రీవైష్ణవుడికీ తప్పకుండా ఒక గురువు ఉండాలనీ, శ్రీవైష్ణవం తమిళనాట విస్తృత వ్యాప్తికి కారణం రాజాశ్రయమనీ, గోదాదేవి రాసిన తిరుప్పావై కేవలం భక్తి పాటలు మాత్రమే కాదని, అద్భుతమైన, సున్నితమైన కవిత్వం అందులో ఉందనీ, ఇలా ఎన్నో చెప్పారు చంద్రమోహన్ గారు.
అన్నీ నేనే రాసేస్తే ఎలా? రెండున్నర గంటలా అమ్మో అనుకోకుండా, మొదలుపెట్టండి. ఆ తరువాత ఆపడం మీ తరం కాదు. నేను గ్యారంటీ. ఒకవేళ మీకు భక్తిపై ఆసక్తి లేకపోతే, ఏం పరవాలేదు. చరిత్ర మీద ఏ కాస్త ఇష్టం ఉన్నా, సాహిత్యం మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా, మీకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుందని కీబోర్డ్ గుద్ది మరీ చెప్పగలను. ఇక భక్తి, శ్రీవైష్ణవంపై ఆసక్తి ఉన్నవారికి నేను చెప్పేదేముంది. మీరు ఎలాగో చూసేస్తారు, అంతేగా..
అభినందనలు,
మీనా యోగీశ్వర్.