వయసుకి విశ్రాంతినియ్యని విజ్ఞానగని

Lakshmi Prabha
January 27, 2023

ప్రముఖ శాస్త్రవేత్త, రచయిత రావు వేమూరి గారి విజ్ఞానదాయకమైన సమాధానాలతో శాస్త్రంతో మీ చేత దోస్తీ చేయించడానికి, ‘A Tale of Two Cites’ అనే లబ్ధ ప్రతిష్ట కలిగిన ఆంగ్ల నవల అనువాదాన్ని, ఆసక్తికరమైన, ఎన్నో మలుపులు కలిగిన నవలా విశ్లేషణలతో నిండిన ఈ నాటి విడుదలలతో మీ ముందుకొస్తోంది సమగ్ర శ్రేయస్సుకి సోపానమైన మీ దాసుభాషితం.

ప్రముఖ శాస్త్రవేత్త, రచయిత రావు వేమూరి గారి విజ్ఞానదాయకమైన సమాధానాలతో శాస్త్రంతో మీ చేత దోస్తీ చేయించడానికి, ‘The tale of two cites’ అనే లబ్ధ ప్రతిష్ట కలిగిన ఆంగ్ల నవల అనువాదాన్ని, ఆసక్తికరమైన, ఎన్నో మలుపులు కలిగిన నవలా విశ్లేషణలతో నిండిన ఈ నాటి విడుదలలతో మీ ముందుకొస్తోంది సమగ్ర శ్రేయస్సుకి సోపానమైన మీ దాసుభాషితం.

వయసుకి విశ్రాంతినియ్యని విజ్ఞానగని

మన వసుధలో ఎన్నో ఖనిజాలు, లవణాలు, ఇంధనాలు, రత్నాలు, వాయువులు ఉన్నట్టే, తనలో ఎన్నో శాస్త్రాలను ఇముడ్చుకున్నారు ప్రముఖ శాస్త్రవేత్త, శాస్త్రీయ, సాంకేతిక రచయిత శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు గారు.

వీరు Quora లో గణితానికి, విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. సాధారణంగా ఒక మనిషికి తాను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భాషలో, తనచుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులతో పోల్చుతూ విషయాలు చెబితే, అవి కఠినమైన శాస్త్రీయ విషయాలైనా సులువుగా అర్థం అవుతాయి. రావు గారు చేసేది అదే. నిత్యం వాడుతున్న వాటి గురించిన పూర్తి అవగాహన ఉండని అనేకులకు ‘ఓస్ ఇంతేనా’ అనిపించేలా వారి సమాధానాలు ఉంటాయి.

రావు గారు విశాఖ జిల్లా, చోడవరం లో వేమూరి సోమేశ్వరరావు, తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించారు. వారు తమ ఇంజినీరింగ్ విద్యను భారతదేశంలోనూ, ఎం.ఎస్ , Ph D లను అమెరికాలో పూర్తి చేశారు. భారతదేశంలో నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్, భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్‌లలో ఉద్యోగాలు చేశారు. ఆపైన యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు.

రావు గారు ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వీరు 1967 ప్రాంతాలలో కంప్యూటర్ల మీద మొట్టమొదటి తెలుగు పుస్తకం రాశారు. ఇది తెలుగుభాషా పత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించబడింది. ఇంతటి విజ్ఞానసమ్రాట్టుకి అవార్డులు చేరువకాకుండా ఉంటాయా? జీవిత సాఫల్య అవార్డులు, తానా వారి అచీవ్‌మెంట్ అవార్డు ఇంకా మరెన్నో వీరిని వరించాయి.

వీరు 10 సంవత్సరాలపాటు ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి, నడిపారు. పర్యావరణ పారిశుద్ధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి భత్యం కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు. 

ఇపుడు మన జీవితంలో తెలియకుండనే ఎంతో భాగమైపోయిన కంప్యూటర్లపై, ఇంటర్నెట్ ల గురించి మనకు ఉండే సందేహాలను చాలా సరళమైన భాషలో మన చుట్టూ ఉన్న వస్తువులతో ఉదహరించి, వివరించిన రావు గారి  వ్యాసాలను అదే శీర్షికలో శ్రవణ రూపంలో అందిస్తున్నాము.
 

రెండు మహానగరాలు 1

Tap to Listen


రాజసింహాసనాన్ని అధిష్టించేవారు తనపర భేదం చూపక రాజ్యపాలన సాగించాలి. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో కౌరవవంశ నాశనానికి కారకుడయ్యాడు. నియంతృత్వంతో నాజీ నేత హిట్లర్ ప్రపంచయుద్ధానికి కారణభూతుడుగా మారాడు. రాజు సరిగా లేని రాజ్యం, నాయకుడు సరిగా లేని సైన్యం అస్తవ్యస్తంగా, చిన్నాభిన్నంగా నడుస్తుంది. అందుకే రాజ్యసింహాసనంపై కూర్చున్నవారు ధర్మనిష్టతో, న్యాయవిచారణ చేసేటప్పుడు సునిశితబుద్ధితో వ్యవహరించాలి.

చార్ల్స్ డికెన్స్ రచించిన "ఎ టేల్ అఫ్ టూ సిటీస్" నవలను శ్రీ తెన్నేటి సూరి “రెండు మహానగరాలు” గా తెలుగులో అనువదించారు. నియంతృత్వంతో ఒక జమిందారీ వంశంలోని వారు చేసిన అరాచకాలు, అకృత్యాలు వల్ల బలైపోయిన Dr.మానెట్‌ పరిస్థితి, ఎంతో శ్రమకోర్చి న్యాయాన్ని, కేసుల్ని పరిశీలిస్తూ, ఏ విధమైన ఆదరణ పొందని కార్టొన్, ఇలా ఎన్నో పాత్రల ద్వారా ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఈ నవలలో మనం తెలుసుకుంటాం. రాజ్య వీధులలో సారా పారడం, తలలు నరికే గిలెటిన్ యంత్ర వివరణ వంటి విషయాలను, తెలుగువారికి అర్ధమయ్యేలా, చాలా సహజంగా సూరిగారు అనువదించిన తీరు అభినందనీయం.

ది పిజన్ ప్రాజెక్ట్ 

The Pigeon Project
Tap to Listen

మానవుడు పుట్టినప్పుడే అతని ఆయువుని భగవంతుడు నిర్ణయిస్తాడు. శాస్త్రం మీద ఉన్న ఆసక్తితో, పెరుగుతున్న విజ్ఞానంతో మనిషి ఈ సృష్టిని తిరగరాద్దాం అనుకుంటున్నాడు. శాస్త్రాన్ని లోతుగా పరిశీలించి, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా, మనం అతిగా ఆశపడితే మన వినాశనానికే కారకులవుతాము. ఇదే విధంగా ఈ నవల " ది పిజన్ ప్రాజెక్ట్" లో మాక్ డోనాల్డ్ తనకున్న శాస్త్రపరిజ్ఞానంతో ప్రపంచ చరిత్రని మార్చే విధంగా మనిషి యొక్క ఆయుప్రమాణం పెంచాలనుకుంటాడు.

దానికి ఒక ఫార్ములా (సూత్రాన్ని) కనుగొని, దాన్ని ఫ్రాన్సులో జరుగుతున్న అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల సభలో ప్రవేశపెట్టాలనుకుంటాడు. కానీ రష్యావాళ్ళు ఆ గౌరవాన్ని తమ దేశానికే చెందాలని డొనాల్డ్‌ని అపహరించి, నిర్బంధిస్తారు. తనను రక్షించమని ఒక పావురం ద్వారా సందేశం పంపితే, అది, కొన్నేళ్ళనుండి స్తబ్దుగా ఉన్న టిమ్ అనే ఇంజినీరుకి చేరుతుంది. డొనాల్డ్‌ని కాపాడి అతన్ని అంతర్జాతీయ సభలో ప్రవేశపెట్టడానికి టిమ్ ఎంత కష్టపడ్డాడో, అసలు ఆ సూత్రాన్ని సభలో ప్రవేశపెట్టారా? లేదా? అన్న విషయాలని ఈ నవలకు ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్, అనువాదకురాలు శ్రీమతి మాలతీ చందూర్ రాసిన విశ్లేషణలో వినండి. 


అభినందనలతో, 
ప్రభ.

Image Courtesy :