ఏ పాట నే పాడను ?

Ram Kottapalli
October 9, 2023

ఒక దార్శనికుడు బయల్దేరాడు. తన స్వప్నంలోనూ, ఊహల్లోనూ ఊగిసలాడుతూ ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. ఆ ఆలోచనను ఒక కథ గా రాసాడు. ఆ కథని పెంచి సినిమా చేసాడు. ఇప్పుడు ఆ సినిమాకి ఒక పాట కావాలి. ఒక కవి దగ్గరకెళ్ళి తన కథంతా చెప్పాడు. క్షీర సాగరం అంతా అవపోసన పట్టి ఒక చుక్క అమృతం ఇచ్చినట్లు, ఆ కథలోని సారాన్ని అంతా పట్టుకొచ్చి...

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను…

కొన్ని వేల పాటలు రాసిన వేటూరి గారి కలం నుండి జాలువారిన పాట ఇది. వారు రాసిన పాటల్లో వారికి బాగా నచ్చిన పాట ఇది అని ఒక ఇంటర్యూలో వేటూరి గారు చెప్పారు. 

నిజమే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, ఇంకా చెప్పాలి అంటే రాత్రి పడుకోడానికి జోలపాట గాను, ఉదయం నిద్ర లేవడానికి సుప్రభాతం గాను, ప్రయాణంలోనూ, ప్రశాంతంలోనూ, బాధలోనూ, బాధ్యతలోనూ, ప్రేమలోనూ, ప్రళయంలోనూ, సరసంలోనూ, విరహంలోనూ, ఉద్యోగంలోనూ, సద్యోగంలోనూ  పాట నరుడి నర నరాల్లోనూ ఇంకి పోయి, ఒక ఇంధనంగా అతన్ని నడిపిస్తోంది.

మరి ఒక మనిషిని ఇంతలా కదిలించే, నడిపించే పాట ఎక్కడ ఎలా పుడుతోంది ?

ముందు అంతా శూన్యం. అప్పుడు ఒక దార్శనికుడు బయల్దేరాడు. తన స్వప్నంలోనూ, ఊహల్లోనూ ఊగిసలాడుతూ ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. ఆ ఆలోచనను ఒక కథ గా రాసాడు. ఆ కథని పెంచి సినిమా చేసాడు. ఇప్పుడు ఆ సినిమాకి ఒక పాట కావాలి. ఒక కవి దగ్గరకెళ్ళి తన కథంతా చెప్పాడు. క్షీర సాగరం అంతా అవపోసన పట్టి ఒక చుక్క అమృతం ఇచ్చినట్లు To cut a long story short ఆ కథలోని సారాన్ని అంతా పట్టుకొచ్చి ఒక పాటగా రాసి ఇచ్చేసాడు ఆ కవి.  పాట ఇలా పుడుతోంది. 

ఇలా పుట్టిన పాట మనలో ఎలా ఐక్యం అవుతోంది ?

ఒక మహానది హిమాలయాలలో పుట్టి ఎన్నో వేల మైళ్ళు ప్రవహించి, ఎన్నిటినో దాటుకుంటూ, మరెన్నిటినో తనలో కలుపుకుంటూ  మహా సముద్రాన్ని చేరడమే చివరి లక్ష్యంగా సాగినట్లు హిమనగాలంటి కవుల కలం నుండి జాలు వారిన పాటలు మనిషి యొక్క మస్తిష్కంలోకి చేరడమే చివరి గమ్యంగా సాగుతాయి. కాని మనందరికీ తెలుసు, సముద్రాన్ని చేరడమే నది చివరి గమ్యం కాదు, మనిషి మస్తిష్కంలోకి చేరడమే పాట యొక్క చివరి మజిలీ కాదు అని. మళ్ళీ సముద్రం మేఘమై గగనాన్ని చేరుతుంది, వర్షమై కురిసి భూమిని సస్యశ్యామలం చేస్తుంది. మనిషిని చేరుకున్న ఆ పాట అతనిలో ఐక్యం అయ్యి, చలనాన్ని కలిగించి అలాంటి పాటనో, అలాంటి మాటనో మళ్ళీ రాసేంత ప్రేరణని ఇస్తుంది. ఈ చక్రం ఇలానే తిరుగుతుంది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఓసారి సిరివెన్నెల గారి గురించి చెప్పిన మాటను కోట్ చేస్తే 

ప్రేక్షకులకి ఈ పాటలే అర్ధమౌతాయి, మనం ఈ పాటలే రాయాలి అని కాకుండా వాళ్ళకి అర్ధం చేసుకోవాలి అన్న తపన ఉంటుంది, ఏదో చిన్న ఊళ్ళో ఒక గ్రంథాలయంలో ఒక పదహారేళ్ల కుర్రాడు ఒక నిఘంటువుని తీసుకుని ఆ పాట అర్ధాన్ని వెతుక్కుని ఆ రోజుకి ఆ ఆనందంతో పడుకుంటాడు. అలాంటి పాట ఒకటి రాయాలి అని,  అలాంటి మాట ఒకటి రాయాలి అనే తపనని రేకెత్తించగల్గిన స్థాయి కవి సిరివెన్నెల.

అలాంటి కవులను ఎందరినో ఈ తరం, రాబోతున్న తరం కూడా కోల్పోవడం దురదృష్టకరం. కాని అదృష్టం ఏంటి అంటే ఆ ఏదో చిన్న ఊళ్ళో, ఒక గ్రంథాలయంలో, ఒక నిఘంటువుని వెతుక్కుని, పాట అర్ధాన్ని, పుట్టుకని, పూర్వోత్తరాన్ని పట్టుకుని మనకి అందించే పదహారేళ్ళ యువతి, యువకులు వారి ప్రయాణం ఎప్పుడో మొదలు పెట్టనే పెట్టారు. ఓ పాట సాహితి పరంగా ఎలా గొప్పది అయ్యింది? స్వర బద్ధంగా ఎలా గొప్పది అయ్యింది? ఆ పాటకి ఏ గళం ఎలా ప్రాణం పోసింది? అసలు ఆ పాట ఏంటి? ఆ పదం ఏంటి? దానికి అర్ధం ఏంటి అని వెతికి పట్టుకున్న వారు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఒకరు ప్రముఖ కోరన్, రచయిత  నళినీకాంత్ వల్లభజోశ్యుల గారు. 

ఈ నెల మొదటి శనివారం జరిగిన ప్రసంగంలో నళినీకాంత్ గారు తెలుగు సినీ కవులు గురించి, వారి సాహిత్యంలో ఉన్న విభిన్న అంశాలను, ఆ సాహిత్యం వారి జీవితంలో, దృష్టికోణంలో  ఏ విధమైన మార్పు, వికాసం తీసుకువచ్చిందో చెప్పారు. ఒక మనిషిని ఇంతలా శాసించే పాట, మాటలను రాసిన కవుల గురించిన విశేషాలను తెల్సుకోవాలి అంటే ఈ ప్రసంగం చూడాల్సిందే మరి. 

ఈ ప్రసంగంలో కొన్ని ఆసక్తికర పాయింట్లు 

"తెలుగు సాహిత్యాన్ని సులువుగా పరిచయం చేసే non-detailed పుస్తకం వంటిది తెలుగు సినిమా పాట” 

"పాటలో పల్లవి సూత్రం. చరణం విస్తృతి."

“సాహిత్యం, సంగీతం మొగుడు-పెళ్ళాల వంటివి. ఒక్కోసారి ఒక్కోళ్ళు గెలుస్తారు.”

“త్యాగయ్య గారి శిష్య పరంపర వల్ల వారి బాణీలు, సంగీతం ప్రాచుర్యం పొందాయి, అన్నమయ్య గారికి అలాంటి వీలు లేకుండా పోయింది”

ఈ పాయింట్లతో పాటు అల్లుకున్న సందర్భం, వాటి తర్వాత వచ్చిన ఆసక్తికర ప్రశ్నలు, సమాధానాలు  ఏంటో తెలుసుకోవాలి అంటే మీరు ఈ పూర్తి ప్రసంగం చూడాల్సిందే. ఈ క్రింది బానర్ ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూసేయండి మరి. 

అభినందనలు. 

రామ్ కొత్తపల్లి.

Image Courtesy :