ఎవడు విశ్వనాథ?

Meena Yogeshwar
January 20, 2025

లెక్కప్రకారం విశ్వనాథను, చలాన్ని ఆరాధించేవారైనా, అసహ్యించుకునేవారైనా 90శాతం మంది, వారి రచనలను కనీసం ఒక 10శాతమైనా చదివి ఉండరు. తాము విన్నదాన్ని బట్టీ, తమ సిద్ధాంతాలు ఎటు లాగుతున్నాయో అటు వైపుకు వెళ్ళేవాళ్ళే అత్యధిక శాతం. విశ్వనాథ హిందూ మత పునరుజ్జీవనం అనే ఏకైక లక్ష్యంతో, ఒకే ఉద్ధేశ్యంతో రచనలు చేశాడు అనుకుని ఆయన్ను ఇష్టపడడమో, పడకపోవడమో చేస్తారే కానీ, ఆయన ఎన్నో చోట్ల ఎన్నో చెప్పాడని గ్రహించరు.వారికి కీచకునిలోని ప్రేమ తీవ్రతను విశ్వనాథ గుర్తించాడని తెలియదు. నాగసేనుడు నవలలో ఒక సత్పురుషుడైన బౌద్ధ భిక్షువును అభినందించాడని తెలియదు. సలీంను ప్రేమ యోగిగా దర్శించాడని తెలియదు. ఎంతసేపూ...

నేను విశ్వనాథను ఏకవచనప్రయోగం చేయడం మీలో చాలామందికి నచ్చకపోవచ్చు. దీని గురించి మొదట్లోనే చెప్పేసుకుంటే నేను ఏ వైపు నుండి వస్తున్నానో మీకు అర్ధమవుతుంది. ఆయనను నేను ఒక రచయితగా కాక, అన్ని మంచి చెడులతో సహా ఇష్టపడే తాతగారిగా చూస్తాను కాబట్టీ. ఏనాటివో కథలను చెప్పే ఒక తాత ఆయన నాకు కాబట్టీ ఏకవచనప్రయోగం సమంజసమైనదే. నా పదహారవ ఏట మొట్టమొదటిసారి నేను విశ్వనాథను చదువుకున్నాను. మొదటి పుస్తకం వీరవల్లడు. మొదటి రెండు పేజీలు అతి కష్టంపై నడిచింది. పక్కన పెట్టేద్దాం అని ఆలోచన వచ్చినప్పుడు నాకు తెలియకుండానే నేను ఆ కథకు అతుక్కుపోయానని అర్ధం అయింది. అలా నా మొదటి విశ్వనాథ నవలను పూర్తి చేశాను.

అప్పుడు మొదలైన ఆ ఝరి, ఈ నాటికి నన్ను వదలలేదు. వరసగా ఏకవీర, మాబాబు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, హాహాహూహూ, కడిమిచెట్టు ఇలా సాగుతున్న నా పిల్లకాలువ వంటి ప్రవాహంలోకి ‘వేయిపడగలు’ అనబడే మహాసర్పం చేరింది. చేరిన మొదటి రోజు నుండే ఆ ప్రవాహంలో తన ప్రభావాన్ని మొదలుపెట్టింది. ఆ సర్పం వదిలేది విషవాయువులు కావు, వేల ఏళ్ళనాటి సనాతన భారతీయ జీవనపు భావవీచికలు. అందులో నాకు నప్పేది ఏదో, కానిదేదో తెలుసుకోలేనంతగా మునిగిపోయాను. ఒకటికి మూడుసార్లు మునకలు వేశాను. నెమ్మదిగా వయసుతో పాటు, అందులోని లోటుపాట్లు కూడా తెలియసాగాయి. వాటితో సహా ఇష్టపడడం కూడా తెలిసింది.

ఆ తరువాత వచ్చింది పురాణవైరిగ్రంథమాల. ఆ మాల భగవద్భక్తులకు, ధర్మబుద్ధులకు విష్ణువు మెడలోని వైజయంతిలా కనిపిస్తుంది. అధర్మబుద్ధులకు భిక్షా పాత్ర పట్టుకుని తిరిగే ఉన్మత్తశేఖరుడైన శివుని మెళ్ళోనూ, ఒళ్ళంతా ఉండే పాముల దండలా కనిపిస్తుంది. ఎలా కనిపించినా భగవంతుని స్వరూపంగా కనిపిస్తుంది. ఈ ఊహలన్నీ 11నవలల ఆ సిరీస్ చదివినప్పుడు నాకనిపించిన విషయాలు. 

ఇదివరకులోనే ‘భగవంతుని మీది పగ’ నవలలో భౌతికంగా నేను ఎలా చంద్రభాగా నదీ జలపాతంలో నిలబడగలిగాను? ఆయన వర్ణించిన ఆ చల్లని వాయువులు నాకు ఎలా అనుభూతమయ్యాయి అనేది చెప్పాను. అలా నన్ను మానసికంగా మాత్రమే కాక, భౌతికంగానూ ఆ ప్రదేశానికి పట్టుకుపోయిన విశ్వనాథ విశ్వరూపం ఈ నవలలో దర్శించాను. ఈ నవలలన్నిటిలోనూ ఒకడే ప్రతినాయకుడు. మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చావుకు కారణం, చెల్లెలు వంటిదైన ద్రౌపదిని కోరిన దుశ్శల భర్త ‘జయద్రధుడు’. భగవంతుడైన కృష్ణునిపై అతను పట్టిన పగను, భారతదేశ చరిత్రను చెరిపేయడంలోనూ, కొన్ని వందల ఏళ్ళ కాలాన్ని హరించడం ద్వారాను తీర్చుకున్నాడు అని ప్రతిపాదించిన విశ్వనాథ మేథకు జ్యోతులర్పించాను.

ఆ తరువాత వచ్చిన మరొక నవలా సిరీస్ కాశ్మీర రాజవంశ నవలలు. నన్ను ప్రేమలో పడేసుకున్న ఒక పాత్ర ఆ సిరీస్ లోని ఒక నవలలో ముఖ్య పాత్ర. ఆమే ‘భ్రమరవాసిని’. లోకాలను ఏలే త్రిమూర్తులను పాలించే తల్లి, రాజులకు రాజులైన వారికి రాజ్ఞి అయ్యే రాజరాజేశ్వరీదేవి మానవాకృతి దాల్చి, ఒక రాజ్యాన్ని నిర్వహిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆమె రాజ్ఞీత్వం ఎంత సుకుమారంగా, ఎంత కాఠిన్యంగా, ఎంత అందంగా, ఎంత భయంకరంగా, ఎంత శాంతిగా, ఎంత భయంగొలుపుతూ ఉంటుందో తెలుసా? భ్రమరవాసిని చదివినప్పుడు తెలిసింది. 

ఆ పాత్రతో ఎంత లోతులో కూరుకుపోయానో తెలుసా? ఇప్పటికి కొన్ని పదులసార్లు ఆ నవల చదవడం దానికి తార్కాణం కాదు. అది చదివిన మొదటిసారే, నాకు కూతురు పుట్టినప్పుడు ఆమెకు భ్రమరవాసిని అని పేరు పెట్టుకుంటాను అని స్థిరపడడం తార్కాణం. అంతగా కదిలించి, ఊగించి, శాసించింది నన్నా పాత్ర. మొత్తంగా ఆయన నవలలు, అన్ని సిరీస్ లతో కలిపి ప్రస్తుతం లభ్యంలో ఉన్నవి 57. అందులో నేను చదివినవి 42. ఓహ్.. అయితే, నువ్వు విశ్వనాథని చదివేశావన్నమాట అని అనకండి. కొందరిని పూర్తిగా చదవడం అంటూ ఉండదు. వారు అత్యంత దుర్లభులు. తెలుగు సాహిత్యంలో నా చూపుకు కనపడేది ఇద్దరే. ఒకరు విశ్వనాథ, రెండవవారు చలం.

వీరిద్దరినీ పూర్తిగా చదవడం అంటూ ఉండదు. మెతుకు పుచ్చుకుని అన్నాన్ని అంచనా వేయగల సామర్ధ్యం వీరిద్దరి విషయంలో అక్కరకు రాదు. ఇద్దరూ పైకి చెప్పేదానికి, అంతరార్ధంలో ధ్వనించేదానికి, మనం ఆలోచించిన కొద్దీ ఊరే ఊహకీ, కొంత పరిపక్వత వచ్చాకా వెనక్కు తిరిగి చూసి, తిరిగి చదివితే తోచేదానికి చాలా తేడా ఉంటుంది. అన్ని పొరలు ఉంటాయి వీరి రచనల్లో. అందుకని విశ్వనాథను, చలాన్ని పూర్తిగా చదివేశాం, వారు కచ్చితంగా చెప్పేది ఇదే అని ఎవరైనా చెప్తే, నమ్మకండి.

నా లెక్కప్రకారం విశ్వనాథను, చలాన్ని ఆరాధించేవారైనా, అసహ్యించుకునేవారైనా 90శాతం మంది, వారి రచనలను కనీసం ఒక 10శాతమైనా చదివి ఉండరు. తాము విన్నదాన్ని బట్టీ, తమ సిద్ధాంతాలు ఎటు లాగుతున్నాయో అటు వైపుకు వెళ్ళేవాళ్ళే నేను చూసినవారిలో అత్యధిక శాతం. విశ్వనాథ హిందూ మత పునరుజ్జీవనం అనే ఏకైక లక్ష్యంతో, ఒకే ఉద్ధేశ్యంతో రచనలు చేశాడు అనుకుని ఆయన్ను ఇష్టపడడమో, పడకపోవడమో చేస్తారే కానీ, ఆయన ఎన్నో చోట్ల ఎన్నో చెప్పాడని గ్రహించరు.

వారికి కీచకునిలోని ప్రేమ తీవ్రతను విశ్వనాథ గుర్తించాడని తెలియదు. నాగసేనుడు నవలలో ఒక సత్పురుషుడైన బౌద్ధ భిక్షువును అభినందించాడని తెలియదు. సలీంను ప్రేమ యోగిగా దర్శించాడని తెలియదు. ఎంతసేపూ ఆయన ఛాందసవాదాన్ని రుద్దాడని, ముందుకు కాక, వెనకకు నడిచాడని అభినందనాపూర్వకంగానో, ఆరోపణలుగానో చెప్తారు అంతే.

నిన్న, మొన్నటిలో ‘X’ వేదికగా ఓ చర్చ జరిగింది. అది, తెలుగు సంస్కృతం నుండి పుట్టింది అని కొందరు, కాదు ద్రావిడం నుండి పుట్టిందని కొందరు కొంత తీవ్రంగానే చర్చించారు. అది చదివి, ఏ వైపు ఉండాలో నాలాంటివారికి తెలియనంతగా తమ ప్రతిపాదనలను ఖండితంగా రాశారు వారు. అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. విశ్వనాథ ఏ వైపున ఉంటారు ఈ విషయంలో అని. యాదృచ్ఛికంగా ఈ న్యూస్ లెటర్ రాయడానికి డాక్టర్ సి. మృణాళిని గారు చేసిన విశ్వనాథ-విశ్లేషణ అనే శీర్షిక మన యాప్ లో విన్నాను.

అందులో, కోకిలమ్మ పెండ్లి అనే కావ్యంలో అక్కాచెల్లెళ్ళైన కోకిల, చిలుకల కథ ఉందని చెప్పారు. అయితే అది రెండు సామాన్య పక్షుల కథ కాదని, చిలుక సంస్కృత భాష అని, కోకిల అంటే తెలుగు భాష అని ఆ రెండిటి కథను విశ్వనాథ చెప్పారని చెప్పారు. అయితే ఇందులో అక్క ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది? ఒకరి వస్తువులు ఒకరు ఉపయోగించుకునే, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్న బంధమా? ఒకరిపట్ల ఒకరికి అలవిమాలిన ప్రేమ ఉన్న అనుబంధమా? మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సంబంధమా? ఇద్దరూ ఒకేలా ఉండే అక్కచెల్లెళ్ళా? ఒకేలా ఉన్నా స్వభావాలు వేరైన అక్కాచెల్లెళ్ళా?

ఆయన నవలా సాహిత్యంలో 85శాతం చదివిన నాకు విశ్వనాథకు తెలుగుపట్ల ఉన్న భావం తెలియాలి అంటే ఆ కావ్యం చదవడం అవసరం. అది చదవకుండా ఆయన నాకు పూర్తిగా తెలుసు అనడం ఎంత తప్పో, ఆయనకు మతపిచ్చి మాత్రమే ఉంది, ఆయన ప్రగతి నిరోధకుడు అనడం కూడా అంతే తప్పు. 

ఇంతకీ నేను శీర్షికలో అడిగిన ప్రశ్న ‘ఎవడు విశ్వనాథ’ అన్నదానికి ఒకటే సమాధానం. అతనొక తేనెపట్టు. ఎన్నో పొరలు, ఎన్నో అరలు,.బయట భయాన్ని గొల్పే తేనెటీగల వంటి క్లిష్ట సమాసాలు, గ్రాంధిక భాష. వాటిన దాటితే వస్తుంది తేనె వంటి జాను తెనుగు, కథ, కథనం, శిల్పం, తత్త్వం, ఊహాశక్తి, ఆయన వ్యక్తిత్వం, దయాగుణం, ప్రేమ, భారతీయత అన్నీ. అయితే ఈ తెనె కాస్త వగరుగా కూడా ఉంటుంది. అవే ఆయన వ్యక్తిత్వంలోని కొన్ని నిప్పు నెరుసులు, ఈ కాలానికి సరిపోని కొన్ని భావాలు. అయితే, అన్నిటితో కలిపి ఆస్వాదించాలి. ఆ వగరుని వగరుగా గుర్తించి, తేనెను మాత్రం కడుపులో చల్లగా దాచుకోవాలి. అది ఆయన తన నడవడిలో, రచనలలో మనకి పాటించి చూపించారు కూడా.

విశ్వనాథ అంటే వల్లమాలిన ప్రేమ, గొప్ప భక్తి, అసలుసిసలైన ఆరాధనాభావం కలిగిన రచయిత్రి, డాక్టర్ మైథిలి అబ్బరాజు గారి ‘నా విశ్వనాథ’ అనే వ్యాసం ‘రససిద్ధ కవీశ్వరః’ అనే శీర్షకలో భాగంగా ఈ వారం విడుదల అవుతోంది. తప్పక వినండి. నేను పైన చెప్పిన కొన్ని విషయాలకు నిదర్శనాలు ఆ వ్యాసంలో మీరు చూడచ్చు. విశ్వనాథను మరింత దగ్గరగా, మరింత చేరువన నుంచుని చూడవచ్చు. విశ్వనాథను చూడడంలో ఆమె కళ్ళద్దాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి.

Tap to Listen

చివరగా విశ్వనాథను అనుకరించే ధైర్యం చేస్తూ ఆయన రచనల గురించి నేను చెప్పదలచిన ఒక్క మాట:

విశ్వనాథ రచనలు ఎందులకు గ్రాంధికమునందుండును? సరళ వ్యావహారికములోనున్నచో మరింత మందికి చేరువవగును గదా? నావరకునిది దైవ సంకల్పమని భావింతును. అతని కాలములోనున్నవారికి గ్రాంధికముననున్ననూ చదువటుకునిబ్బంది లేదు. కావున వారి అభిప్రాయములు వారేర్పరుచుకొనిరి. తరువాతిది సంధికాలము. అప్పటివారికి ఏ భాషననున్ననూ అతను ప్రతిపాదించది రుచించెడిదికాదు. నేటి ఈ 21వ శతాబ్ధమునకు అతని రచనలందడమన్నది ఎడారినందు ప్రయాసతో నీటిని వెదుకుకొనువారికి దొరికే అమృతజలము వంటిది. అలా వెదుకుకొననివానికి అతనిజదివే అర్హతలేదు. వెదికినవారి జన్మమంతా వారి ఉల్లమున వెన్నెలలు కురియును. స్వస్తి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :